ఔరంగాబాద్‌లో సత్తా చాటిన మజ్లిస్
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముజ్లిస్-ఏ-ఇత్త్తెహదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ సత్తా చాటింది.
26 మున్సిపల్ వార్డుల్లో విజయ కేతనం
కార్పొరేషన్‌లో రెండో పెద్ద పార్టీగా మజ్లిస్
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముజ్లిస్-ఏ-ఇత్త్తెహదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ సత్తా చాటింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. మున్సిపల్ కార్పొరేషన్‌లోని 53 వార్డుల్లో పోటీ చేసి 26 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి రెండో అతిపెద్ద పార్టీగా అవతరిం చింది. మొత్తం 113 స్థానాల్లో శివసేన 28, బీజేపీ 23, కాంగ్రెస్ 10, ఎన్‌సీపీ 03, ఇతరులు 23 స్థానాలను కైవసం చేసుకున్నారు.
హైదరాబాద్ పాతనగరానికి పరిమితమైన మజ్లిస్ పార్టీ ఇటీవల జరిగిన మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాలను దక్కించుకుంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ యంత్రాం గాన్ని రంగంలోకి దింపి సత్తా చాటింది. పార్టీ అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ రాష్ర్ట శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ మకాం వేసి ప్రత్యర్థి పార్టీలకు దీటుగా ప్రచారాన్ని హోరెత్తించారు. ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికల విజయకేతనంతో మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో కార్యకర్తలు గురువారం సంబరాలు చేసుకున్నారు.


