డినకరుడు

డినకరుడు

  • సూర్య కిరణాలతో ‘డి’ విటమిన్ లభ్యం

  •  నగర వాసులకు అందని భాగ్యం

  •  గ్రేటర్‌లో 60 శాతం మందికి కాల్షియం లోపం

  •  బాధితుల్లో ఎక్కువ మంది ఐటీ అనుబంధ ఉద్యోగులే

  •  మహిళల్లోనే సమస్య తీవ్రం

  • సాక్షి, సిటీబ్యూరో: అర్థరాత్రి విధులు... అపార్ట్‌మెంట్ జీవితం... మారిన జీవనశైలి...ఆహారపు అలవాట్లు వెరసి గ్రేటర్ వాసుల శరీరానికి రవి కిరణాల స్పర్శ కూడా తగలనివ్వడం లేదు. సూర్యుని కిరణాల్లో పుష్కలంగా లభించే విటమిన్ ‘డి’ని అందుకోవడం లేదు. ఫలితంగా గ్రేటర్‌లో 60 శాతం మంది కాల్షియం లోపంతో బాధ పడుతున్నారు. వీరిలో 60 శాతం మహిళలు ఉంటే, 40 శాతం పురుషులు ఉన్నారు. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే ఈ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్ల యువతీ యువకుల్లో గుర్తిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో అధిక శాతం ఐటీ, అనుబంధ రంగాల్లోని వారే కావడం గమనా ర్హం.

     

    రాత్రి విధులతో...



    గ్రేటర్ హైదరాబాద్‌లో ఐటీ, అనుబంధ రంగాల్లో ఏడు లక్షల మంది పని చేస్తున్నారు. నెలలో సగం రోజులు సగం మంది పగలు పని చేస్తే, మరో సగం మంది రాత్రి పని చేస్తున్నారు. వీరిలో 90 శాతం మందికి సూర్యరశ్మి అంటే తెలియదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సాధారణంగా మనిషి శారీరక ఎదుగుదల 20 ఏళ్లలోపే. శరీరానికి 30 ఏళ్ల వరకు కాల్షియాన్ని నిల్వ చేసుకునే శక్తి ఉంటుంది. ఆ తర్వాత పురుషులు ఏటా ఒక శాతం కాల్షియాన్ని కోల్పోతే. మహిళలు రెండు శాతం కోల్పోతున్నట్లు కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

     

    60 శాతం మహిళలే



    అధిక శాతం మహిళలు అతి తక్కువ సందర్భాల్లోనే ఇంటి నుంచి కాలు బయట పెడుతుంటారు. సూర్య కిరణాలు సోకక పోవడంతో కాల్షియం లోపించి, చిన్న వ యసులోనే కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. సాధారణంగా మహిళల్లో 40-45 ఏళ్లకు వచ్చే మేనోపాజ్, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు 35 ఏళ్లకే వస్తోంది. మోనోపాజ్ తర్వాత శరీరంలో నిల్వ ఉన్న కాల్షియం ఏటా సాధారణం కన్నా ఎక్కువ తగ్గుతుంది. వైద్యుల సూచనలు పాటిస్తూ... శరీరానికి సూర్యరశ్మి తగిలేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడే అవకాశం ఉంటుందని నిపుణుల మాట.

     

    పాలతో మేలు: డాక్టర్ నవీన్ పల్లా, చీఫ్ ఆర్థోస్కోపిక్ సర్జన్, శ్రీకర ఆస్పత్రి



    ఎముకల దృఢత్వానికి, రక్తపోటు నియంత్రణకు, గుండె రక్తనాళాల ఆరోగ్యానికి విటమిన్ ‘డి’బాగా తోడ్పడుతుంది. ఇందు కోసం పిల్లలకు ప్రతి రోజూ పావు లీటరు పాలు తాగించాలి. 45 గ్రాములు ఛీజ్, 200 గ్రాముల పెరుగుతో పాటు, ప్రతి రోజూ ఓ గుడ్డు, చేపలు, మాంసం, తాజా కూరలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, నారింజ, ద్రాక్ష, వంటి ఫలాలు ఇవ్వడం ద్వారా యుక్త వయసు వచ్చే నాటికి రోజుకు 1000 ఎంజీల కాల్షియం ఉత్పత్తి అవుతుంది. ఇది ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. ప్రొటీన్, సోడియం, కెఫిన్ అతిగా తీసుకోవడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. సాధ్యమైనంతవరకూ వీటికి దూరంగా ఉండాలి.

     

    ఉదయం పూట వ్యాయామం ఉత్తమం:డాక్టర్ గురువారెడ్డి, సన్‌షైన్ ఆస్పత్రి



    ఉదయం ఏడు గంటల్లోపు సూర్య కిరణాల్లో విటమిన్ ‘డి’ పుష్కలంగా లభిస్తుంది. ఆ సమయంలో వ్యాయామం శరీరానికి ఎంతో మంచింది. రాత్రి విధుల వల్ల నగరంలో చాలా మంది మధ్యాహ్నం తర్వాత నిద్రలేస్తూ కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. ఫలితంగా ఎముకల్లో పటుత్వం తగ్గిపోయి, నొప్పులతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రికి వస్తున్న బాధితుల్లో నూటికి 80 శాతం మంది ఇదే లోపంతో బాధ పడుతున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top