ఫోన్ కొడితే.. ఇంటికే మద్యం

ఫోన్ కొడితే.. ఇంటికే మద్యం - Sakshi


సాక్షి, హైదరాబాద్: ఫోన్ కొడితే చాలు.. ఇంటికే బిర్యానీ, మెడిసిన్, కారు వచ్చేస్తున్న కొత్త పోకడ... మద్యం సిండి‘కేట్ల’కు సరికొత్త ఐడియాను ఇచ్చినట్లుంది. వారు కూడా ఇదే రీతిలో ఫోన్ కొడితే చాలు.. ఇంటికే మద్యం పంపిస్తూ, ఎమ్మార్పీకంటే 40 నుంచి 100 శాతం అధిక ధరకు విక్రయిస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ‘లిక్కర్ ఆన్ బైక్స్’ ద్వారా మందు బాబులకు మద్యం సరఫరా జరుగుతోంది. మద్యం విక్రయాల్లో మూడో వంతు జరిగే బెల్టు షాపులకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతుండడంతో సిండి‘కేట్లు’ ఈ మొబైల్ లిక్కర్ సేల్స్ ప్రారంభిస్తున్నారు.


 


చంద్రబాబు గతంలో అనుసరించిన ప్రజల వద్దకే పాలన తరహాలో ఇప్పుడు ప్రజల వద్దకే మద్యం సరఫరా జరుగుతోంది. ఎక్సైజ్ చట్టం ప్రకారం పది బాటిళ్ళ లోపు పట్టుబడితే కేసు నమోదు చేసేందుకు వీల్లేదు. దీన్ని ఆసరా చేసుకున్న మద్యం వ్యాపారులు బెల్టు షాపుల స్థానే ‘లిక్కర్ ఆన్ బైక్స్’ విధానం చేపడుతున్నారు. దీనికి ఆదరణ పెరుగుతుండటంతో మద్యం వ్యాపారులు జోరు కొనసాగిస్తున్నారు.

 

 బడ్డీ కొట్లలోనూ..: మద్యం లెసైన్సీలు... కిళ్ళీ షాపులు, బడ్డీ కొట్లలోనూ పదిలోపు బాటిళ్ళను ఉంచి బడ్డీ కొట్టు నిర్వాహకుడితోనే ద్విచక్ర వాహనంపై సరఫరా చేయిస్తున్నారు. ఈ విధానంలో ఎమ్మార్పీ కంటే 40 నుంచి వంద శాతం అధికంగా అమ్ముతున్నారు. ప్రస్తుతం మద్యం వ్యాపారులు బెల్టు షాపులు తీసేసినా ఫర్వాలేదనే పరిస్థితికి వచ్చారంటే మొబైల్ లిక్కర్ సేల్స్ లెసైన్సీలకు ఎంతగా కల్పతరువుగా మారుతుందో అర్థమవుతోంది. విశాఖ, విజయనగరం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు బెల్టు షాపులు, ఎమ్మార్పీ ఉల్లంఘనపై దాడులు చేసినప్పుడు మద్యం షాపు నుంచి బైక్‌లపై మద్యం సీసాలు తరలిస్తున్న వారిని పట్టుకున్నారు. అయితే దీనిపై విచారణ కొనసాగుతోంది.

 

 మొబైల్ లిక్కర్ సేల్స్‌ను అడ్డుకుంటాం

 

 రాష్ట్రంలో మద్యం లెసైన్సీలు మొబైల్ లిక్కర్ సేల్స్ సాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, టాస్క్‌ఫోర్సు అధికారులు తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంటు విభాగం డైరక్టర్ సూర్యప్రకాశరావు ‘సాక్షి’కి వివరించారు.     

 - సూర్యప్రకాశరావు, ఎన్‌ఫోర్సుమెంటు డైరక్టర్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top