కొత్త ఏడాదికి కిక్కేకిక్కు | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదికి కిక్కేకిక్కు

Published Tue, Jan 2 2024 3:46 AM

Telangana liquor sales on December 30 cross over Rs 312 crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ఏడాదికి లిక్కర్‌ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతోపాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్‌షాపులకు చేరింది. డిసెంబర్‌ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది.

డిసెంబర్‌ 30న రూ.313 కోట్లు, డిసెంబర్‌ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్‌ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్‌ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్‌ 31న కొంత తగ్గినా, 30న రూ.59 కోట్లు, 29న రూ.21 కోట్ల మేర ఎక్కువ అమ్ముడయిందని చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఒక్క డిసెంబర్‌ 31నే 6లక్షల కేసుల లిక్కర్, 6.5లక్షల కేసుల బీర్లు వైన్‌షాపుల నుంచి అమ్ముడుపోయి ఉంటాయని, అంతకంటే ముందు రెండు రోజులు, జనవరి 1న కూడా ఇదే స్థాయిలో లిక్కర్‌ అమ్ముడవుతుందని అంటున్నారు.  

ఈ డిసెంబర్‌లో రూ.4,274 కోట్లు 
ఇక, గత ఏడాది డిసెంబర్‌ నెల మద్యం అమ్మకా లను పరిశీలిస్తే అంతకుముందు ఏడాది కంటే 27 శాతం పెరిగాయి.  
►2022 డిసెంబర్‌లో రూ.3,377 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, 2023 డిసెంబర్‌లో అది రూ.4,274 కోట్లకు చేరింది.  
►లిక్కర్‌ కేసులు 2022 డిసెంబర్‌లో 32.50లక్షలు అమ్ముడుపోగా, 2023లో 43.40లక్షలు అమ్ముడయ్యాయి.  
​​​​​​​►బీర్లు 2022 డిసెంబర్‌లో 39.56 లక్షల కేసులు అమ్ముడవగా, 2023 డిసెంబర్‌లో 46.10లక్షల కేసులు అమ్ముడయినట్టు ఎక్సైజ్‌ గణాంకాలు చెబుతున్నాయి.  
​​​​​​​►2022 డిసెంబర్‌తో పోలిస్తే 2023 డిసెంబర్‌లో లిక్కర్‌ అమ్మకాలు 33 శాతం, బీర్లు 16 శాతం పెరగడం గమనార్హం.

Advertisement
Advertisement