అగ్రస్థానమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

అగ్రస్థానమే లక్ష్యం

Published Thu, Sep 1 2016 2:21 AM

అగ్రస్థానమే లక్ష్యం - Sakshi

కర్ణాటక వైమానిక పాలసీ సవరణకు మంత్రి మండలి ఆమోదం
రూ.14,520 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 33 ప్రతిపాదనలకు అంగీకారం
10,584 ఉద్యోగాల సృష్టి’
జీఎస్‌టీ’ ఆమోదానికి 14న    అసెంబ్లీ ప్రత్యేక సమావేశం



బెంగళూరు: విమానయాన రంగంలో కర్ణాటకను దేశంలోనే అగ్ర స్థానంలో నిలపడమే లక్ష్యంగా కర్ణాటక వైమానిక విధానాల్లో సవరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మంత్రి మండలి ఆమోదం సైతం లభించింది. బుధవారమిక్కడి విధానసౌధలో సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మండలి సమావేశం అనంతరం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. కర్ణాటక రాష్ట్రం ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటక ‘వైమానిక పాలసీ 2013-23’కు సవరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం రూ.14,520 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 33 ప్రతిపాదనలకు మంత్రి మండలి అంగీకారం తెలిపిందని, తద్వారా రాష్ట్రంలో 10,584 ఉద్యోగాల సృష్టి జరగనుందని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న పారిశ్రామిక విధానంలో వ్యాపారులకు లభించే అన్ని సౌకర్యాలు, రాయితీలు నూతన వైమానిక పాలసీ ద్వారా ఈ రంగంలోని వ్యాపారులకు కూడా లభించనున్నాయని తెలిపారు. ఇక విమానాలు, హెలికాప్టర్ల  విడిభాగాల తయారీ కర్ణాటకలో ఎక్కువగా జరుగుతోందని అన్నారు. ఇదిలాగే కొనసాగితే కర్ణాటక  ఏషియాలోనే ఏరోస్పేస్ హబ్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు....
 

‘జీఎస్‌టీ’ బిల్లు ఆమోదానికి సెప్టెంబర్ 14న ఒక రోజు పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు మంత్రి మండలి అంగీకారం తెలిపింది. సెప్టెంబర్ 14న ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది.
 

రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్యారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మంత్రి మండలి అనుమతించింది. ఒక్కో కళాశాలలో 320 సీట్లు అందుబాటులో ఉంటాయి.
 

రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ మాజీ అధికారి చలపతిని సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారిగా నియమించేందుకు అంగీకారం


పోలీసు శాఖలో 50 బస్సులు, 200 హొయ్సళ వాహనాల ఖరీదుకు గాను రూ. 14కోట్లను విడుదల చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 
Advertisement
 
Advertisement