మరో ‘పంచ్’ కొడతారా!

మరో ‘పంచ్’ కొడతారా!


 దూకుడు మీదున్న ధోని సేన

 తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లండ్

 నేటినుంచి మూడో టెస్టు

 

 మ. గం. 3.30నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం


 

 సౌతాంప్టన్: ఒక విదేశీ టెస్టులో సిరీస్‌లో భారత జట్టు ప్రత్యర్థిని వెనక్కి నెట్టి ముందే ఆధిక్యంలోకి దూసుకెళ్లడం అరుదు. అయితే స్ఫూర్తిదాయక ఆటతీరు కనబరుస్తోన్న టీమిండియా చాలా ఏళ్ల తర్వాత ఆ స్థితిలో నిలిచింది. ఇప్పుడు అదే పట్టును నిలబెట్టుకోవాలని ధోని సేన పట్టుదలగా ఉంది.

 

 ఇప్పటికే దెబ్బ తిన్న ప్రత్యర్థిపై మరో ‘పంచ్’ విసరగలిగితే సిరీస్‌లో ఇక తిరుగుండదు. ఈ నేపథ్యంలో  ఇక్కడి ఏజియస్ బౌల్ మైదానంలో ఆదివారం నుంచి జరిగే మూడో టెస్టులో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉన్న భారత్, ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోండగా...సొంతగడ్డపై ఈ సీజన్‌లో విజయమే లేని ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ టెస్టులోనూ రాణించలేకపోతే ఆ జట్టుపై బ్రిటీష్ జాతి యావత్తూ విరుచుకుపడే పరిస్థితి ఉందంటే ఆశ్చర్యం లేదు.

 

 ఒక మార్పుతో...

 లార్డ్స్ టెస్టులో జట్టు విజయం సాధించినా...ఆ మ్యాచ్‌లో స్టువర్ట్ బిన్నీ పాత్ర నామమాత్రమే. ఆల్‌రౌండర్ కోటాలో అతను జట్టులో ఉన్నా రెండో ఇన్నింగ్స్‌లో అతనితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ తన పాత సంప్రదాయ శైలిలో ఆరుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలని భావిస్తోంది. కాబట్టి బిన్నీ స్థానంలో రోహిత్ శర్మ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

 

 లోయర్ ఆర్డర్‌లో భువనేశ్వర్ కూడా పరుగులు చేస్తుండటం కూడా దీనికి కారణం. ఇక బౌలింగ్‌లో ఇషాంత్, భువీ తమ జోరును కొనసాగించాలని భావిస్తుండగా...షమీ ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. బ్యాటింగ్‌లో ధావన్, కోహ్లి రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యారు. అయితే ధావన్‌కు మరో అవకాశం దక్కవచ్చు. విజయ్, రహానే గత మ్యాచ్‌లలాగే చెలరేగితే భారత్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. జడేజా కూడా తన పాత్రకు న్యాయం చేస్తుండటంతో ధోని చెప్పినట్లు  మరో స్పిన్నర్ గురించి భారత్ ఆలోచించాల్సిన అవసరమే లేకుండా పోయింది.

 

 రాత మారుతుందా...

 ఇంగ్లండ్ క్రికెట్ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంది. జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్ కుక్, బెల్ ఘోరంగా విఫలమవుతున్నారు. గత 27 ఇన్నింగ్స్‌లలో కేవలం 23.60 సగటుతో కుక్ ఆడుతుండటం, అతని కెప్టెన్సీ లోపాలు జట్టును దెబ్బ తీస్తున్నాయి. పెద్దగా అనుభవం లేని బ్యాలెన్స్, మొయిన్ అలీలే కొంత వరకు జట్టును ఆదుకుంటున్నారు. ఇంగ్లండ్ పేస్ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. జడేజాతో గొడవకు సంబంధించి అండర్సన్ విచారణ ఈ టెస్టు ముగిసిన వెంటనే జరుగుతుంది. ఆపై నిషేధానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లోనైనా అతను జట్టును గెలిపించాలని భావిస్తున్నాడు. ప్రయర్ స్థానంలో  కీపర్‌గా బట్లర్ తుది జట్టులోకి రానున్నాడు.

 

 పిచ్, వాతావరణం...

 ఏజియస్ బౌల్ మైదానంలో చక్కటి బౌన్స్ ఉంది. అయితే లార్డ్స్ తరహాలో ఇక్కడ స్వింగ్ పని చేయదు. చివర్లో స్పిన్ ప్రభావం చూపవచ్చు. మొత్తంగా భారత్‌ను ఇబ్బంది పెట్టని వికెట్‌గా చెప్పవచ్చు. కొన్నాళ్లుగా ఇక్కడ వర్ష సూచన లేదు.

 

 అతని పేరు కూడా ఉచ్ఛరించను: ధోని

 జడేజాతో గొడవ ఉదంతంలో ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్‌పై భారత కెప్టెన్ ధోని తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ఏ స్థాయిలో అంటే... కనీసం అండర్సన్ పేరు ఉచ్ఛరించడానికి కూడా మహీ ఇష్టపడటం లేదు. ఆ రోజు నాటింగ్‌హామ్‌లో ఏం జరిగిందో ధోని మాటల్లో...

‘అంపైర్లు లంచ్ ప్రకటించగానే మేం పెవిలియన్ వైపు బయల్దేరాం. మేం నడుస్తూ ఉండగానే ఆ వ్యక్తి జడేజాను బూతులు తిట్టడం ప్రారంభించాడు. అప్పుడు నేను కల్పించుకున్నాను. బౌండరీ లైన్ వరకు చేరుకునే సరికి అంతా సమసిపోయిందనే భావించాను. అయితే మెంబర్స్ ఏరియానుంచి నడుస్తున్న సమయంలో నాకు రెండడుగుల వెనక జడేజా ఉన్నాడు. అప్పుడు మళ్లీ ఏదో జరిగింది. మళ్లీ జడేజాను ఏదో అన్నాడు. దాంతో అతనూ ఆ ప్లేయర్ వైపు తిరిగాడు. అంతే...అప్పుడే జడేజాను ఆ వ్యక్తి నెట్టేశాడు.


దాంతో అదుపు తప్పిన జడేజా అసలేం జరుగుతోందంటూ తిరిగి చూడబోయాడు. దీనికే జడేజాకు జరిమానా వేశారు. రిఫరీ తీసుకున్న ఈ నిర్ణయం నన్ను చాలా బాధించింది. ఈ కేసులో ఎన్నో విషయాలు పట్టించుకోలేదు. క్రీడా స్ఫూర్తి గురించి చెబుతూ జరిగిందేమిటో పట్టించుకోకపోతే ఎలా. జడేజా ఒక్క మాట అనలేదు. దూకుడు చూపించలేదు. అందుకే ఆ శిక్ష పట్ల బాధ పడుతున్నా. అవతలివాడు తిడితే నా మ్యాచ్ ఫీజు పోవడం ఏమిటి? ఇలా అయితే రేపు మైదానంలో మౌనంగా ఉండమని మా ఆటగాళ్లకు చెబితే వారు వింటారా! నేను కూడా శిక్షపై అప్పీల్ చేయాలనే కోరుకుంటున్నా’.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top