భారత్‌ను గెలిపించిన మిథాలీ | Sakshi
Sakshi News home page

భారత్‌ను గెలిపించిన మిథాలీ

Published Mon, Feb 8 2016 2:23 AM

భారత్‌ను గెలిపించిన మిథాలీ

* చివరి వన్డేలో టీమిండియా విజయం  
* ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్

హోబర్ట్: బ్యాటింగ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్ (113 బంతుల్లో 89; 12 ఫోర్లు) చెలరేగడంతో... ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో దక్కించుకుంది. బెల్లెరివ్ ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 231 పరుగులు చేసింది. అలెక్స్ బ్లాక్‌వెల్ (60; 7 ఫోర్లు), ఎలీస్ పెర్రీ (50; 3 ఫోర్లు), జెస్ జొనాసేన్ (32 నాటౌట్)లు రాణించారు.

భారత బౌలర్లలో శిఖా పాండే 3, రాజేశ్వరి 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 47 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది ఓపెనర్లలో వేద కృష్ణమూర్తి (12) విఫలమైనా... సృ్మతి మందన (52 బంతుల్లో 55; 7 ఫోర్లు) ఆకట్టుకుంది. వన్‌డౌన్‌లో చక్కని సమన్వయంతో ఆడిన మిథాలీ...

సృ్మతితో కలిసి రెండో వికెట్‌కు 58; హర్మన్‌ప్రీత్ కౌర్ (22; 2 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపర్చింది. చివర్లో పూనమ్ రౌత్ (24 నాటౌట్), శిఖా పాండే (17) సమయోచితంగా ఆడటంతో భారత్ విజయం ఖాయమైంది. మిథాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

Advertisement
Advertisement