అదే నా కల: దినేశ్ కార్తీక్ | Sakshi
Sakshi News home page

అదే నా కల: దినేశ్ కార్తీక్

Published Thu, Jul 20 2017 4:06 PM

అదే నా కల: దినేశ్ కార్తీక్

ముంబై: దినేశ్ కార్తీక్.. ప్రతిభ ఉన్న క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత క్రికెట్ జట్టులో తీవ్ర పోటీ నెలకొనడంతో దినేశ్ కార్తీక్ కు పెద్దగా అవకాశాలు రావడం లేదనేది వాస్తవం. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత్ జట్టులో ఎట్టకేలకు చోటు దక్కించుకున్న దినేశ్.. అక్కడ ఆకట్టుకున్నాడు. ఆ పర్యటనలో భాగంగా నిర్ణయాత్మక ఐదో వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన దినేశ్, ఆపై జరిగిన ఏకైక ట్వంటీ 20లో 48 పరుగులు నమోదు చేశాడు. దాంతో మూడేళ్ల తరువాత తన పరిమిత ఓవర్ల పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నట్లయ్యింది.

అయితే తనకు టెస్టుల్లో కూడా తిరిగి ఆడాలని ఉందనే విషయాన్ని దినేశ్ కార్తీక్ స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టెస్టులు ఆడాలని ఉంది. ప్రస్తుతం వన్డే, ట్వంటీ 20ల్లో స్థానం దక్కించుకున్నట్లే టెస్టులు కూడా తిరిగి ఆడాలని అనుకుంటున్నా. వైట్ డ్రెస్ వేసుకుని కోహ్లి నాయకత్వంలో ఆడాలనేది నా కల. జట్టుకు ఏ రకంగా ఉపయోగపడగలను అనేది మాత్రమే నాకు తెలుసు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎటువంటి ఒత్తిడికి లోనుకావడం లేదు. నాకిచ్చిన పనిని సరిగ్గా చేయడంపైనే దృష్టి పెట్టా. 2019 వరల్డ్ కప్ లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా'అని కార్తీక్ తెలిపాడు.

2010లో చివరిసారి దినేశ్ కార్తీక్ టెస్టుల్లో కనిపించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన దాదాపు ఏడేళ్ల నాటి టెస్టు మ్యాచ్ లో దినేశ్ నిరాశపరచడంతో అప్పట్నుంచి తిరిగి ఆ ఫార్మాట్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇదిలా ఉంచితే, తాజాగా శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టులో దినేశ్ కార్తీక్ కు చోటు దక్కలేదు.

Advertisement
Advertisement