'మార్క్' ఆఫ్ ఇండియా!

'మార్క్' ఆఫ్ ఇండియా!


(త్రిపురనేని గోపీచంద్: 8 సెప్టెంబర్ 1910-2 నవంబర్ 1962- తండ్రి రామస్వామి నుంచి ప్రశ్నించడం నేర్చుకుని సమాధానాన్ని అన్వేషిస్తూ నదిలా అనేక రూపాలు సంతరించుకున్నాడు. హేతువాది, నాస్తికుడు, కమ్యూనిస్ట్, రాయిస్ట్, సోషలిస్ట్, ప్రవాహాలతో సంగమించి అరవిందుడి తాత్వికతలో లీనమైనారు. గోపీచంద్ సాహిత్య పురస్కారాన్ని మార్క్ టుల్లీ స్వీకరిస్తున్న సందర్భంగా-)




 'తాము వాడుకునేందుకు ప్రకృతి ఉంది. ఎంత బాగా వాడుకోగలిగితే అంతగా సక్సెస్ అయినట్లు. తమకు ఉపయోగపడనిది ఎందుకూ పనికి రానిదే, అని భావిస్తారు పాశ్చాత్యులు. భారతీయుల దృష్టిలో ప్రకృతి, అమ్మ. తాము సంతానం. సమస్త ప్రాణుల్లో తామొక చిన్న అంశ. ఒక్క మాటలో: పాశ్చాత్యులకు ప్రకృతి భోగ వస్తువు. భారతీయులకు పూజనీయం' అంటారు సర్ విలియమ్ మార్క్ టుల్లీ, విఖ్యాత ఫొటోగ్రాఫర్ రఘురాయ్ పుస్తకానికి రాసిన ముందుమాటలో!




 ఢిల్లీ నుంచి బీబీసీ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన మార్క్ టుల్లీ 'ఇండియా: ద రోడ్ ఎహేడ్'నాన్ స్టాప్ ఇండియా' 'ఇండియాస్ అనెండింగ్ జర్నీ' 'ద హార్ట్ ఆఫ్ ఇండియా' లాంటి పుస్తకాలు రచించారు. ఆయనను రెండు ప్రపంచాలూ గౌరవిస్తాయి. 'తనకు అంగీకారం కానప్పటికీ ఒక అభిప్రాయాన్ని సావధానంగా వినడం సంస్కారి లక్షణం' అన్న అరిస్టాటిల్ సూక్తికి సమకాలీన ప్రపంచంలో మార్క్ టుల్లీ ఒక ఉదాహరణ.

 అంతటి సంస్కారికి ఒక పదం అంటే ద్వేషం. ఏమిటది? పరదేశీ లేదా ప్రవాసి (ఎక్స్‌పాట్రియట్)! ఇంగ్లండ్‌లో ఇండియాలో తరచూ తనను 'పరదేశీ' అంటారని ఆయన నొచ్చుకుంటారు. ఇంతకీ ఆయనెవరు?




 ఈస్టిండియా కంపెనీ హయాంలో ఆయన ముత్తాత బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు. 1857లో భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నుంచి తప్పించుకుని, గంగాయాన్‌తో కోల్‌కతా చేరాడు. మాతామహుడు ఇప్పటి బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి జనపనార తెచ్చి కోల్‌కతాలో అమ్మేవాడు. ఇండియాలో పుట్టిన తల్లిదండ్రులకు మార్క్ 1935లో టోలీగంజ్‌లో జన్మించాడు. ఆ గ్రామం తర్వాత కోల్‌కతాలో కలసిపోయింది. తన నానమ్మ బెంగాలీ డ్రైవర్‌తో కూడా మాట్లాడనిచ్చేది కాదు. బెంగాలీ సేవకుల భాష అనేది. అప్పట్లో యూరోపియన్ సొసైటీ క్లాస్ సిస్టమ్‌తో విడిపోయి ఉండేది. ఐసీఎస్ అధికారులు బ్రాహ్మణుల్లా ఉన్నతులు. సైన్యంలో పనిచేసేవారు క్షత్రియుల వలె ద్వితీయులు. టుల్లీ కుటుంబం వైశ్యుల వలె తృతీయులు. పదవ ఏట ఇంగ్లండ్ వెళ్లాడు. అక్కడ చదువుకుని, ప్రీస్ట్ అవుదామనుకుని, కాలేక, బీబీసీ కరస్పాండెంట్‌గా తాను పుట్టిన కోల్‌కతాకు వచ్చాడు. ఆ తర్వాత ఢిల్లీకి. అలా భారత దర్శనం మొదలైంది. ఇండియాలో పుట్టి పెరిగిన వ్యక్తిగానే కాదు ఇండియా గురించి కాదనలేని రీతిలో చెప్పగలిగిన ఇండియన్‌గా ప్రపంచం ఆయనను గౌరవిస్తుంది. ఇండియాతో ఆయన సంబంధం 50 ఏండ్లకు పైగా. అల్లుడు భారతీయుడు. కోడలు భారతీయురాలు. బెంగాలీ, హిందీలో మాట్లాడే అసంఖ్యాక స్నేహితులు అతని సంపద.  




 బి.బి.సి పాలసీలో మార్పును తెచ్చినప్పుడు టుల్లీ వ్యతిరేకించాడు. వార్తల గురించి మార్కెటింగ్ నిపుణులు, వ్యూహకర్తలు నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదన్నారు. ఎవరు వింటారు? ఇంగ్లండ్ అమెరికా కౌగిలిలోకి పోతోందని, ఫ్రాన్స్ వలె తన సామాజిక, సాంస్కృతిక ప్రత్యేకతలను నిలుపుకోలేకపోతోందని, ఇండియాలో సైతం ఆ ధోరణులు కన్పిస్తున్నాయని చెబుతారు. పాదముద్రలు లేని దారులు, కార్లు చెత్తచెత్తగా నిండిన నగరాలు, పూర్వస్మృతులను సమాధిచేసి వెలసే భవనాలు చూస్తే విచారం వేస్తుందంటారు. తన చిన్నతనంలో రెండు విడిపోయిన జాతులను చూశానని, ఇప్పుడు ఈ రెండు జాతుల మధ్య స్నేహం పెంచడమే తన బాధ్యత అంటాడు మార్క్‌టుల్లీ.

 పున్నా కృష్ణమూర్తి

 ఇండిపెండెంట్ జర్నలిస్ట్; 7680950863

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top