చికిత్స వివరాలు ఇవ్వాల్సిందే

చికిత్స వివరాలు ఇవ్వాల్సిందే - Sakshi


ప్రైవేటు వైద్యశాలలు తమ దగ్గర చికిత్స చేయించుకున్న రోగులకు చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలా కూడదా అనే ప్రశ్నకు జవాబు... ఇవ్వాల్సిందే. చట్టం ప్రకారం రోగులకు తమ చికిత్స వివరాలు తెలుసుకునే సమాచార హక్కు ఉంది.

 

 వైద్య చికిత్స చేసుకున్న రోగులకు వారి చికిత్స వివరాలు తెలుసుకునే హక్కు ఉంది. ఇది చాలా మౌలికమైన హక్కు. ఒక కోణం నుంచి చూస్తే జీవన హక్కులోనూ, మరొక కోణం నుంచి చూస్తే అభివ్యక్తి హక్కు లోనూ ఇది అంతర్భాగం. మనకు మూడు రకాల వైద్యశా లలు ఉన్నాయి.

 

     1.    ప్రభుత్వ వైద్యశాలలు.. ఇవి సమాచార హక్కు చట్టం కిందికి నేరుగా వస్తాయి. కనుక ఇక్కడ చికిత్స చేయించుకున్న వారందరికీ తమ చికిత్స సమాచారం కోరే హక్కు ఉంది.

     2.    ప్రభుత్వ సాయం పొందిన ప్రైవేటు వైద్యశాలలు: సమాచార హక్కు చట్టం సెక్షన్ 2 (హెచ్) ప్రకారం ప్రభుత్వ సాయం పొందిన ప్రైవేటు  వైద్యశాలలు  కూడా ప్రభుత్వ సంస్థలవుతాయి. రోగులకు చికిత్స సమాచారం పూర్తిగా ఇవ్వవలసిందే.

     3.    ప్రైవేటు వైద్యశాలలు: ప్రభుత్వ సాయం ఏ మాత్రం లేని పూర్తి ప్రైవేటు వైద్యశాలలకు సమాచార హక్కు చట్టం వర్తించదు. కాని సెక్షన్ 2(ఎఫ్) సమాచార హక్కు చట్టం కింద చికిత్స సమాచారం ఇవ్వవలసిన బాధ్యత ఉంటుంది. వినియోగదారుల చట్టం, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం, దాని కింద చేసిన నియమాల ప్రకారం, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ద్వారా సమాచారం రప్పించే అధికారం సమాచార కమిషన్‌కు ఉంది. వైద్యశాలలయినా మామూలు వైద్యులైనా సరే చికిత్స జరిగిన మూడు రోజుల లోగా ఇచ్చితీరాలి.

 ప్రైవేటు వైద్యశాలలు తమ దగ్గర చికిత్స చేయిం చుకున్న రోగులకు చికిత్సకు సంబంధించిన సమాచా రాన్ని ఇవ్వాలా కూడదా అనే ప్రశ్నకు జవాబు... ఇవ్వా ల్సిందే. అది సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ సంస్థ అయినా కాకపోయినా రోగుల నుంచి వేలు లక్షల రూపాయలు గుంజిన ప్రైవేటు వైద్య దుకాణాలు విని యోగదారులైన రోగులకు సమాచారం ఇవ్వాలని వినియోగదారుల చట్టం నిర్దేశిస్తున్నది.

 

 ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం సెక్షన్ 20ఏ, సెక్షన్ 33 (ఎం) ప్రకారం కేంద్ర ముందస్తు అనుమతితో రూపొందించిన వృత్తిపరమైన నియమ నిబంధనలలో 1.3.1 ప్రకారం ప్రతి వైద్యుడు వైద్యశాలలో చికిత్స చేసిన రోగుల వైద్య  చికిత్స వివరాలను చికిత్స మొద లైన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు నిర్ణీత రూపంలో భద్రపరచాలి. రోగి గానీ అతని అధీకృత ప్రతి నిధిగానీ కోరితే 72 గంటలలోగా వాటి ప్రతులను ఇవ్వా లని 1.3.2 నిర్దేశిస్తున్నది.

 

 రాజప్పన్ వర్సెస్ శ్రీచిత్ర తిరునాల ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎల్‌ఆర్ 2004 (2) కేరళ 150) కేసులో ఈ రెండు నిబంధనలు కలిపి చదివితే, రోగి కోరిన వెంటనే 72 గంటలలోగా చికిత్స సమాచారం అంటే వైద్యుడు సూచించిన రోగ నిర్ధారణ పరీక్షలు, నిర్దేశించిన పరిశోధనలు, వాటి నివేదికలు, పరిశోధనానంతర రోగనిర్ధారణ, తరువాత ఇచ్చిన సూచనలు, సలహాలు, సంపూర్తిగా ఇవ్వాల్సిన చట్టపర మైన బాధ్యత వైద్యుడిపైన ఉంటుందని తీర్పు ఇచ్చింది.  ఏ సందర్భంలో కూడా వైద్యశాలలో పనిచేసే వైద్యుడికి రోగి సమాచారం ఇవ్వకుండా మినహాయింపు ఇచ్చే నియమాలేవీ లేవని, మూడో అనుబంధంలో వివరిం చిన విధంగా చికిత్స సమాచారం పూర్తిగా ఇవ్వాలని స్పష్టంగా నిర్దేశించిందని కేరళ హైకోర్టు వివరించింది. వైద్యులపైనే ఈ బాధ్యత ఉంటుందని, వైద్యశాలపై ఉండదంటూ కొన్ని అన్యాయ అన్వయాల ఆధారంగా నిపుణులైన లాయర్లు లేవదీసే వాదనలు సమాధానంగా కేరళ హైకోర్టుపై వివరణ ఇచ్చింది.

 

 ఈ చికిత్స వివరాలు ఇస్తే రోగులు వైద్యశాలపైన, వైద్యులపైన కోర్టుల్లో కేసులు వేసి ఈ పత్రాలు కూడా సమర్పిస్తారని వైద్యశాలల తరఫు న్యాయవాదులు వాదించారు. ఆ కారణంగా వైద్యచికిత్స వివరాలు ఇవ్వ కూడదనే వాదం సమంజసంగా లేదని, ఒకవేళ సరైన చికిత్స చేసి ఉంటే కోర్టు కేసులకు భయపడే అవసరం ఉండబోదని కేరళ హైకోర్టు వివరించింది. చికిత్స వివరాలకు సంబంధించి సంపూర్ణమైన పారదర్శకత అవసరమనీ, ఈ కేసులో తన కూతురి చికిత్స వివరాలు అడిగిన తండ్రికి పూర్తిగా ఇచ్చి తీరాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.

 

 ఎన్నో హైకోర్టులు, వినియోగదారుల న్యాయ స్థానాలు ఈ విధమైన తీర్పులే ఇచ్చాయి. వైద్య సేవలు, రోగాలకు చికిత్సలు అన్నీ వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ వీపీ శాంత (1995(6) ఇఅఔఉ 273) కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే చట్ట ప్రకారం రోగులకు తమ చికిత్స వివరాలు తెలుసుకునే సమాచార హక్కు ఉంది. ఈ హక్కును అమలుచేసే అధికారం, సమాచార హక్కు సెక్షన్ 2(ఎఫ్)ను అనుసరించి ప్రైవేటు వైద్యశాలల నుంచి కూడా ఆ సమాచారం తెప్పించే అధికారం సమాచార కమిషన్‌కు ఉంది. ప్రభు త్వ వైద్యశాలల నుంచి రోగులు చికిత్స సమాచారం తెలుసుకొనే హక్కును నేరుగా సమాచార హక్కుచట్టం కింద కూడా పొందే వీలు కల్పించారు.  

 

ఫలానా వైద్యశాల సహ చట్టం కింద ప్రభుత్వ సంస్థ అవుతుందా కాదా అనే ప్రశ్న తలెత్తినపుడు ఒకవేళ ప్రభుత్వం నుంచి వారికి గణనీయమైన ఆర్థికసాయం ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అందితే లేదా ప్రభుత్వం వారి నియంత్రణ ఆ వైద్యశాలపై ఉంటే వాటిని ప్రభుత్వ సంస్థలుగా పరిగణించి సమాచార హక్కు కింద సమాచారం ఇప్పించవచ్చునని చట్టం వివరిస్తున్నది. డాక్టర్లు, రోగులు అర్థం చేసుకుని అమలు చేయవలసిన బాధ్యత హక్కు ఇది.

 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)

 professorsridhar@gmail.com

 - మాడభూషి శ్రీధర్

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top