కాంగ్రెస్‌కు మోడీ ఫోబియా!

కాంగ్రెస్‌కు మోడీ ఫోబియా! - Sakshi


వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినా ఫర్వాలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినా బాధ లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ ప్రధాని కాకూడదన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు. మోడీని కాంగ్రెస్ నాయకులు, గాంధీ కుటుంబం తమ టార్గెట్‌గా పెట్టుకుని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని గత ఎనిమిదేళ్లుగా మోడీని ఏదో కేసులో ఇరికించి జైల్లో పెట్టేందుకు, అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ కుటుంబం చేయని ప్రయత్నం అంటూ లేదు.  

 

 కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక ఆంగ్ల చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూ 2014లోనే అతిగొప్ప ఇంటర్వ్యూగా బ్రహ్మాండంగా పేలుతుందనుకుంటే అదికాస్తా తుస్సుమంది. దీంట్లో కొత్త విషయం ఏమీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. తాను అంతా సవ్యం గా చేస్తున్నట్టుగానూ, ఇతరులే తప్పులు చేస్తున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. గత పదేళ్లనూ ‘స్వర్ణ దశాబ్ది’గా ఈ యువరాజావారు అభివర్ణించుకుంటున్నప్పుడు వచ్చే ఎన్నిక లలో ఓటమి గురించి గుబులెందుకోమరి? ఎవరినీ ఆకర్షించని ఈ ఇంటర్వ్యూ చాలా సాదాసీదాగా చప్పగా తేలిపోయింది.

 

 ఈ ఇంటర్వ్యూపై విమర్శల వర్షం కురి సింది. గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ... బీజేపీ ప్రధాని మంత్రిత్వ అభ్యర్థి నరేంద్రమోడీపై ధ్వజమెత్తిన రాహుల్ మాత్రం 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయంలో అప్పటి కాంగ్రెస్ నాయకుల పాత్రపై క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చేశారు. అవినీతిని పారదోలేందుకు శక్తివంచనలేకుండా పోరాడతానని అంటూనే... యూపీఏ హయాంలో అవినీతి మంత్రులపై చర్య తీసుకోవల్సిందిగా ప్రధాని మన్మోహన్‌కు తానెలా చెప్తానని, అది తన పని కాదంటూ మాట దాటవేశారు. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 200కు మించి సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కొన్ని సర్వేలలో వచ్చిన అంచనాలు కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి.

 

  2009 ఎన్నికలలో గెలిచిన స్థాయిలో 2014లో కాంగ్రెస్ సొంతంగా 206 స్థానాలలో గెలిచే అవకాశం లేదంటూ పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించిన సర్వేలూ, ప్రజానాడిని బట్టి ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. బీజేపీ, దాని మిత్రపక్షాలకు 200కు మించి సీట్లు వస్తాయనీ, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు సుమారుగా వంద స్థానాలు మాత్రమే వస్తాయని సర్వేలు అంచనా వేశాయి. ప్రాంతీయ పార్టీలకు కనీసం 150 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాలలో ఓటమి తర్వాత కాంగ్రెస్ నైతికస్థైర్యం దిగజారిపోయింది. మొన్నటిదాకా రాహుల్‌ను భావిప్రధానిగా అం దరూ భావించగా 2014 ఎన్నికల తర్వాత ఆయన ప్రధాని కాలేరన్న అభిప్రాయం క్రమంగా బలపడుతోంది.

 

 కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి ఎన్ని ఎత్తులు వేసినా ఫలితం కనిపించడం లేదు. ఓటర్లకు తాయిలాలు పంచిపెట్టి ఎలాగోలా ఎన్నికల గండం నుంచి గట్టెక్కాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆహార భద్రతా చట్టం అమలు చేస్తే ఒక ప్రభంజనం వస్తుందనీ, అది కాంగ్రెస్‌కు ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందన్న ధీమాలో వారు ఉన్నారు. 1971లో అర్హులైన పేదలకు కొన్ని కిలోల బియ్యం, గోధుమలు పంచిపెడితే అధికారం అప్పగించారు కాబట్టి ఈసారి కూడా గెలిపిస్తారన్న ఊహల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అయితే ప్రజల ముందు కాంగ్రెస్ పప్పులు ఉడకలేదు. 1971కూ, 2013కూ ఎంతో మార్పు వచ్చిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించలేదు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారు. అవినీతిరహిత పాలనకు కాంగ్రెస్ ఎప్పుడూ ప్రాధాన్యమివ్వలేదు. అన్ని రకాల ఎత్తులు వేసి విఫలమైన ఆ పార్టీ ఎదుట వచ్చే ఎన్నికలు గెలిచేందుకు ఎలాంటి విధానమూ, వ్యూహమూ లేదు.

 

 గత డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత... రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే లోక్‌సభ ఎన్నికలలో గెలవడం సులభం అవుతుందని కొంతమంది వందిమాగధులు సోనియా గాంధీ చెవిన వేశారు. దీనిపై జనవరిలో ఒక ప్రకటన చేస్తానని ఆమె చెప్పారు. అయితే సర్వేలలో రాహుల్‌కు మూడోస్థానం రావడం కాంగ్రెస్ నాయకత్వానికి దడ పుట్టించింది. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పేరు ప్రకటించాక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతే అతని రాజకీయ జీవితం దెబ్బతింటుందని భావించిన సోనియా ఆ ప్రతిపాదనను పక్కనపెట్టారు.

 

 వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినా ఫర్వాలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినా బాధ లేదు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ ప్రధాని కాకూడదన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు. మోడీని కాంగ్రెస్ నేతలు, గాంధీ కుటుంబం తమ టార్గెట్‌గా పెట్టుకుని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా మోడీని ఏదో కేసులో ఇరికించి జైల్లో పెట్టేందుకు, అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ కుటుం బం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ క్రమంలో వారు సీబీఐనీ, ఇతర అధికార యంత్రాంగాన్నీ వాడుకున్నారు. ఒకవేళ మోడీ ప్రధాని అయితే ఆయన దీనికి కక్ష తీర్చుకుంటారన్న భయం సోనియా కుటుంబాన్నీ, కాంగ్రెస్ నాయకులనూ వెంటాడుతోంది.

 

 మోడీ ఇంకా ప్రధానికాకముందే కాంగ్రెస్‌కు ఎంతో నష్టం కలిగించారు. ఆయన ప్రధాని సీట్లో కూర్చున్నాక పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు చట్టపరంగా, రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. పాత అవినీతి కుంభకోణాలపై మళ్లీ దర్యాప్తులు ప్రారంభమవుతాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే ప్రధాని పదవికి రాహుల్ పేరును ప్రకటించలేదు. అంతేకాదు... ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే మోడీ తప్ప ఎవరు ప్రధాని అయినా ఫర్వాలేదన్న ధోరణిలో ఉంది.

 

 ఎన్నికల పొత్తుల కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇపుడు లాలూ, కరుణానిధి, మాయావతి ఎవైరె నా ఆ పార్టీకి ఫర్వాలేదు. కమలనాథులను అధికారంలోకి రాకుండా చేసేందుకు చిన్నాచితకా పార్టీలతో జతకట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మాయావతి ఇదివరకే దోస్తీకి తిరస్కరించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఇస్తున్నందున టీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకుంటామని, వీలైతే ఆ పార్టీని విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ బాహాటంగానే ప్రకటించింది. తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతంలో కొన్ని సీట్లు వస్తాయని కాంగ్రెస్ ఆశిస్తోంది. అన్నాడీఎంకే, బీజేడీ వంటి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ మంతనాలు జరుపుతోంది. ఒకవేళ త్రిశంకు సభ ఆవిర్భవిస్తే బీజేపీకి అధికారం దక్కకుండా చేసేందుకు తృతీయ ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్ధమని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చెపుతున్న మాట.

 

 ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిం దిగా రాష్ట్రపతి బీజేపీ నేతలను ఆహ్వానించకుండా ఉండే పరిస్థితి కల్పించేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికలముందే బీజేపీతో చిన్నాచితకా పార్టీలు పొత్తు కుదుర్చుకోకుండా అడ్డుకోగలిగితే... ఎన్నికలయ్యాక మిగిలిన వ్యవహారాలను చక్కబెట్టవచ్చని కాం గ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం లో రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం ఉంది. ప్రజలు సత్పరిపాలన కోరుకుంటారు. ఒకవేళ వారు ఎన్నికల తాయిలాలను తీసుకున్నా నిజాయితీ, మంచి పరిపాలననే ఇష్టపడతారు. కాంగ్రెస్ ఈ పాఠాన్ని మర్చిపోయింది.     


 - డాక్టర్ పెంటపాటి పుల్లారావు

 రాజకీయ విశ్లేషకులు


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top