ఆషాఢస్య ప్రథమ దివసే...

ఆషాఢస్య ప్రథమ దివసే... - Sakshi


కావ్యం/ మేఘసందేశం: మళ్లీ ఆషాఢ మాసం వచ్చింది. ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలున్నాయి. ఆషాఢమంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్లు వంచవలసిన కాలం. సన్యాసులకు చాతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం. అత్తాఅల్లుళ్లు ‘ఒకే గడప దాటకూడని వేడుక’ వేళ వివాహ మహోత్సవాలకు విరామం. విరహోత్కంఠ విజృంభించే విషమ సమయం.

 

 కాళిదాస మహాకవి మేఘసందేశ కావ్యం కథ ఆషాఢంలో మొదలవుతుంది. ఒకానొక యక్షుడు భార్య మీద నిరంతర ధ్యాసతో తన విధులు నిర్లక్ష్యం చేసి తన ప్రభువైన కుబేరుడి వల్ల శాపం పొందాడు. ఒక సంవత్సరంపాటు అలకానగరం నుంచి బహిష్కృతుడై ఎక్కడో దక్షిణాన దూరంగా పూర్వం సీతాదేవి తన భర్తతో వనవాసం చేస్తూ గడిపిన రామగిరి ఆశ్రమాల ప్రాంతంలో కాలం గడపవలసి వచ్చింది. దుర్భరమైన భార్యావియోగ భారంతో ఎనిమిది నెలలు ఎలాగో గడిపేశాడు. ఇంతలో ఆషాఢం వచ్చి ఆకాశం మేఘావృతమైంది. ఇక యక్షుడు తన విరహ వేదన భరించలేకపోయాడు.

 

 తస్మిన్-అద్రౌ, కతిచిత్-అబలా విప్రయుక్తః స కామీ

 నీత్వా మాసాన్ కనక వలయ భ్రంశ రిక్త ప్రకోష్ఠః

 ఆషాఢస్య ప్రథమ దివసే మేఘం - అశ్లిష్ట సానుం

 వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ.

 ఆ రామగిరి మీద అబలా విప్రయోగాన్ని భరిస్తూ ఆ ప్రేమైక జీవి విరహ తాపం వల్ల కృశించిపోయి, బంగారు చేతి అందె జారిపోవడం వల్ల బోసిపోయిన ముంజేతితో కొన్ని మాసాలు గడిపిన తరువాత, ఆషాఢమాసంలో తొట్ట తొలిరోజున కొండ కొమ్మను పట్టుకుని నిలిచిన మబ్బు కనిపించింది. ఆ మేఘం- వంగి తన దంతాలతో గుట్టలను ఢీకొంటూ ఆడుకుంటున్న ఏనుగులా ఉంది. మేఘాన్ని చూస్తే ఏ పడుచువాడికైనా ప్రేయసి ధ్యాసే మనసు నిండా పరుచుకుంటుంది గదా. ఇక భార్యావిరహంతో తల్లడిల్లుతున్న యక్షుడిమాట చెప్పేదేముంది?

 

 పైగా అతగాడికి మరో బెంగ. అక్కడెక్కడో అలకాపురంలో తనలాగే విరహాగ్నితో కాగిపోతున్న తన భార్య మాటేమిటి? ఆమెకు కూడా అక్కడ మేఘాలోకనంతో గుండెగొంతుకలోన కొట్టాడుతుంటుంది కదా! అసలే సుకుమారి. అందులో విరహిణి. ఆపైన ఆషాఢమాసం. రాబోయేవి శ్రావణ, భాద్రపదాలు. అసలు ఆమె ప్రాణమన్నా నిలుపుకో గలుగుతుందా? భయంతో యక్షుడి మనసు కల్లోలమైంది. ఒక వెర్రి ఆలోచన వచ్చింది. ఎదురుగా కనిపిస్తున్న మేఘం ఎలాగూ ఉత్తరంగా ప్రయాణిస్తున్నది. చల్లగా ఆకాశమార్గంలో  పోయిపోయి కొద్ది రోజులలో అలకా నగరం చేరుకొంటుంది. తన ప్రియురాలికి ఊరటనిచ్చి ఉసురు నిలిపే సందేశం ఆ ఆషాఢమేఘం ద్వారానే పంపితే?

 

 అచేతనమై కేవలం ధూమ, జ్యోతి, సలిల, మరుతాల సమూహమైన మేఘం ఎక్కడా! గ్రహింపూ, కాళ్ళు చేతులూ, వాక్కూ ఉన్న మనుషుల ద్వారా పంపించాల్సిన ప్రేమ సందేశం ఎక్కడా? ఈ రెంటికీ పొంతన లేదేమోనని ఆ ప్రేమార్తుడికి సందేహం కూడా కలగలేదు. అప్పటికప్పుడే కొండమల్లెలు కోసి, వాటితో మేఘుడిని పూజించి, ప్రార్థించాడు.

 ‘ఓ మేఘుడా! అసంతృప్తులకు నువ్వే శరణు కదా. నా ప్రియురాలికి నా సందేశం చేరవేసి పుణ్యం కట్టుకోవయ్యా మిత్రమా! నువ్వు వెళ్ళాల్సింది అలకానగరం. వెళ్ళవలసిన త్రోవ నేను వివరంగా చెప్తాను. ఎనిమిది నెలలెలాగూ గడిచాయి, మరో నాలుగు నెలల్లో నేను వచ్చేస్తున్నానని నా భార్యకు చెప్పు. నేనూ తన కోసం తపిస్తున్నానని చెప్పు.

 

  కంటికి కునుకు లేక కలలో కూడా ఆమెను దర్శించలేక పోతున్నానని చిత్తరువు కూడా కానరాక అలమటిస్తున్నానని చెప్పు. విరహతప్తమైన నా శరీరంతో అంతే తప్తమైన ఆమె శరీరాన్నీ నా అశ్రువులతో ఆమె అశ్రువులనూ నా నిట్టూర్పులతో ఆమె నిట్టూర్పులనూ కలపటం ప్రస్తుతం మనసు ద్వారా సాధ్యం! ఏం చేస్తాం యిది విధి! అయినా దిగులు పడవద్దని నా మాటగా చెప్పు. భాగ్య చక్ర భ్రమణంలో కింది దశ తరవాత పైదశ వచ్చి తీరుతుంది. మళ్ళీ  మనం గువ్వల జంటలా కాలం గడిపే మంచిరోజులు వస్తాయని గుర్తు చెయ్యి!’ అని వేడుకొంటాడు. ఆషాఢంలో యక్షుడి విరహవేదన పాఠకుడి చేత కంటతడి పెట్టిస్తే కాళిదాస కవి పదాల పోహళింపూ, శయ్యా సౌందర్యం, వర్ణనా చమత్కృతీ శ్రావణ మేఘాలలా రసానంద బాష్పవర్షమే కురిపిస్తాయి. అందుకే ఆషాఢం వచ్చిందన్నా, ఆషాఢమేఘం కానవచ్చిందన్నా ఆ మేఘాల నడిమధ్యలో కవికుల గురువు ‘కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారత్ ప్రమత్తః....’ అంటూ కమనీయమైన కావ్యగానం చేస్తూ కళ్ళముందు నిలుస్తాడు. ఆ మబ్బుకు ఆ వైపు రామగిరి అడవులలో ఒంటరిగా, దీనంగా నిలిచిన యక్షుడూ, ఈ వైపు చంద్రిక కోసం చాతక పక్షిలా అలకాపురంలో అమాయకంగా ఎదురుచూస్తున్న అన్నుల మిన్నా మనోగోచరమౌతారు.

 - ఎం. మారుతి శాస్త్రి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top