డిపోలో దెయ్యాలను తరిమేయడానికి క్షుద్రపూజలు?

డిపోలో దెయ్యాలను తరిమేయడానికి క్షుద్రపూజలు?


మాయలు, మంత్రాలు, తంత్రాలు, చేతబడులు, కాష్మోరా.. ఇలాంటి అన్నింటికీ పుట్టినిల్లు లాంటి రాష్ట్రం.. కేరళ. అక్కడ అధికారంలో ఉన్నది వామపక్షాల కూటమి ప్రభుత్వమే అయినా.. రాష్ట్రంలోని ఉత్తరాది ప్రాంతంలో గల కాసర్‌గోడ్ జిల్లాలో ఉన్న ఓ సర్కారీ బస్సు డిపోలో.. దెయ్యాలను తరిమేసేందుకు పూజలు జరిగాయి. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో.. ఎక్కడలేని వివాదం మొదలైంది. కేఎస్‌ఆర్టీసీ డిపోలో అక్టోబర్ 22న ఈ తాంత్రిక పూజలు జరగడంతో.. ఎవరో వాటిని వీడియో తీశారు. అది కాస్తా ఇప్పుడు బయటపడి, టీవీ చానళ్లలో కూడా ప్రసారమైంది. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ (విజిలెన్స్)ను ఆదేశించినట్లు కేఎస్ఆర్టీసీ సీఎండీ ఆంటోనీ చాకో తెలిపారు.



అయితే అక్కడ కేవలం ఆయుధపూజ మాత్రమే చేశారని అధికారులు చెబుతున్నారు. అలాగే, అది కేవలం అక్కడి ఉద్యోగులు చేసిందే తప్ప.. ఆర్టీసీకి దాంతో సంబంధం లేదని, ఆయుధ పూజలను తాము ఆపలేమని అన్నారు. జిల్లా రవాణాశాఖ అధికారి కూడా ఆ పూజలు జరిగిన సమయంలో అక్కడే ఉన్నట్లు చెప్పగా.. పూజ సమయంలో సాధారణంగా అధికారులందరూ కూడా పాల్గొంటారని చెబుతున్నారు. తరచు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటికి కారణం డిపోలో ఉన్న దెయ్యాలేనని ప్రచారం జరగడంతో వాటిని తరిమేసేందుకే ఆ పూజలు చేయించామని.. అవి కూడా జిల్లా రవాణా అధికారి సమక్షంలోనే జరిగాయని ఆర్టీసీ ఉద్యోగి ఒకరు తన పేరు బయట పెట్టొద్దంటూ చెప్పారు. అది ఆయుధపూజ కానే కాదని.. ఓ తాంత్రికుడితోనే చేయించామని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top