సీసీఏఎంలకు భద్రత ఎలా..


సాక్షి, ముంబై: ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేస్తోన్న ‘క్యాష్ అండ్ కాయిన్ ఆపరేటెడ్ యంత్రాలు సెంట్రల్ రైల్వేకు తలనొప్పిగా పరిణమించాయి. చోరీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఈ యంత్రాలకు 24 గంటలూ భద్రత కల్పిస్తేనే వాటిని పంపిణీ చేస్తామని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. నగదు ద్వారా టికెట్లు కొనుగోలు చేయడంవల్ల ఈ యంత్రాల్లో పెద్ద మొత్తంలో డబ్బు చేరే అవకాశముంటుంది. దీంతో ఈ యంత్రాల భద్రతా అంశం తెరమీదకు వచ్చింది. సీసీటీవీ కెమెరాల పహారా, 24 గంటలూ భద్రత సిబ్బంది ఉంటున్న ఏటీఎంల నుంచే డబ్బులు చోరీ అవుతున్నాయి.



కొన్ని చోట్ల ఏకంగా ఏటీఎం యంత్రాలనే ఎత్తుకుపోతున్నారు. ఇలాంటి సందర్భంలో రైల్వే స్టేషన్ల బయట అక్కడక్కడ ఇలాంటి నగదు వేస్తే టికెటు వచ్చే యంత్రాలను భద్రత సిబ్బంది లేకుండా ఎక్కడపడితే అక్కడ అమర్చడం ప్రమాదకరమని వాటిని పంపిణీ చేసే కంపెనీలు స్పష్టం చేశాయి.



 లోకల్ రైళ్ల టికెట్ కౌంటర్ల వద్ద క్యూ, చిల్లర నాణేల బెడద తగ్గించేందుకు రైల్వే పరిపాలన విభాగం ఇదివరకే సీవీఎం, ఏటీవీఎం లాంటి ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. కాని అందులో డబ్బులు నిల్వ ఉండవు గనుక అవి చోరీకి గురయ్యే అవకాశం లేదు. కాని  క్యాష్ అండ్ కాయిన్ ఆపరేటెడ్ యంత్రాల్లో నగదు నిల్వ ఉంటుంది. దీంతో దొంగల నుంచి వీటికి ప్రమాదం పొంచి ఉంది. కాగా వాటి నిర్వహణ బాధ్యతను రైల్వే సదరు యంత్రాల పంపిణీ కంపెనీలకే అప్పగించింది. కాని చోరీ ఘటనలను దృష్టిలో ఉంచుకుని వాటి బాధ్యతలు స్వీకరించేందుకు కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. అక్కడ 24 గంటలు భద్రత సిబ్బంది నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి.



 కాని ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోంచించాలని రైల్వే అధికారులు సదరు కంపెనీలకు సూచించారు. జన సంచారం, పోలీసులు విధులు నిర్వహించే చోట వాటిని ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. కాని అలాంటి ప్రాంతాలు లోకల్ రైల్వే పరిధిలో చాలా తక్కువ చోట్ల ఉన్నాయి. దీంతో ఈ యంత్రాల ఏర్పాటు ప్రక్రియ కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top