ఎన్నికల్లో డాన్సుల కోసం.. అమ్మాయిల అక్రమ రవాణా

ఎన్నికల్లో డాన్సుల కోసం.. అమ్మాయిల అక్రమ రవాణా - Sakshi


వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండటంతో.. డాన్సులు వేసే అమ్మాయిలకు డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో వేరే రాష్ట్రాల నుంచి అమ్మాయిలను బలవంతంగా ఇక్కడకు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి ఇలాంటి అవసరం కోసమే తీసుకొచ్చిన 32 మంది అమ్మాయిలను అలహాబాద్‌లో పోలీసులు రక్షించారు. దీన్ని బట్టి చూస్తే.. ఇక్కడ డాన్సు చేయిస్తున్న అమ్మాయిలంతా ముంబైలోని లైసెన్సుడు బార్ల నుంచి వచ్చిన డాన్స్ గర్ల్స్ మాత్రమే కాదని తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. అమ్మాయిల అక్రమ రవాణాను నిరోధించేందుకు కృషిచేస్తున్న శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన రిషికాంత్ యూపీలో ఈ వ్యవహారంపై గట్టిగా పోరాడుతున్నారు.



తాను త్వరలోనే దీనిపై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తానని, ఎన్నికల ప్రచారంలో అమ్మాయిల డాన్సులు ఏర్పాటుచేయకుండా చూడాలని కోరతానని తెలిపారు. యూపీలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న డాన్స్ ట్రూపులు చాలా ఉన్నాయన్నారు. చాలావరకు డాన్సులు రాత్రిపూటే జరుగుతాయని, అందువల్ల ఆ తర్వాత వారితో ఎలాంటి పనులు చేయిస్తున్నారనేది కూడా చెప్పలేమని.. ఈ అమ్మాయిలను ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లకు కనీసం తిండి సరిగ్గా పెడుతున్నారా, జీతాలు ఇస్తున్నారా లేదా అని పర్యవేక్షించేందుకు ఎలాంటి వ్యవస్థలు లేవని తెలిపారు.



ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఎలాంటి ఫంక్షన్లు జరిగినా వాటిలో అమ్మాయిల డాన్సులు సర్వసాధారణం. పిల్లలు పుట్టినప్పుడు, పెళ్లిళ్లలో కూడా వీటిని ఏర్పాటుచేస్తారు. అయితే ఎన్నికల సమయంలో తమ ర్యాలీలకు జనాన్ని ఆకట్టుకోడానికి రాజకీయ నాయకులు చాలా పెద్ద స్థాయిలో ఈ డాన్సులు ఏర్పాటు చేస్తారు. అలహాబాద్‌లో శక్తివాహిని సంస్థ సాయంతో పోలీసులు రక్షించిన 32 మంది అమ్మాయిల్లో 14 ఏళ్ల బాలిక కూడా ఉంది. తమతో అర్ధరాత్రి వరకు డాన్సులు చేయిస్తున్నారని, డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత విటుల వద్దకు పంపుతున్నారని కొందరు అమ్మాయిలు తెలిపారు.



ఛత్తీస్‌గఢ్ నుంచి చాలా మంది అమ్మాయిలు ఇళ్లలో పనిమనుషులుగాను, పొలాల్లో కూలీలుగాను చేయడానికి వేర్వేరు ప్రాంతాలకు వెళ్తుంటారు. ఎక్కువగా హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో పనులకోసం వీళ్లు వెళ్తారు. కానీ, ఈసారి ఎన్నికల్లో డబ్బులు ఎక్కువ వస్తాయన్న ఉద్దేశంతో యూపీ వెళ్తున్నారని బలోద్ జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ షేక్ చెప్పారు. చిన్న వయసు అమ్మాయిలు బాగా పుష్టిగా కనిపించడానికి వాళ్లకు స్టెరాయిడ్లు కూడా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంత దారుణాలకు పాల్పడుతుండటంతో దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం తక్షణం కనిపిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top