సదావర్తి భూములపై ఏపీ సర్కార్కి నోటీసులు | Sakshi
Sakshi News home page

సదావర్తి భూములపై ఏపీ సర్కార్కి నోటీసులు

Published Mon, Jun 27 2016 3:28 PM

సదావర్తి భూములపై ఏపీ సర్కార్కి నోటీసులు - Sakshi

హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల అమ్మకాలకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో విచారణ జూలై 4కు వాయిదా పడింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సదావర్తి సత్రానికి తమిళనాడులో రూ.1080 కోట్ల విలువ చేసే 83.11 ఎకరాల భూమి ఉందని, దీనిని ఏపీ సర్కార్ రూ.22.44 కోట్లకే అమ్మేసిందని, దీని వల్ల ఖజానాకు భారీ నష్టం వాటిల్లందని, ఈ అమ్మకాలను రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కుమార్ వాదనలు వినిపిస్తూ, దేవాదాయశాఖకు చెందిన భూములను తమ అనుమతి లేకుండా విక్రయించడం గానీ, బదలాయించడం గానీ చేయరాదని 2005లో ఇదే హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ ఉత్తర్వుల్లో అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని కారు చౌకగా అమ్మేసిందన్నారు. దీంతో ధర్మాసనం ఆయనకు పలు ప్రశ్నలు సంధించింది.

అనంతరం ప్రభుత్వానికి ముఖ్యంగా సదావర్తి సత్రం ఈవోకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కష్ణప్రకాశ్ స్పందిస్తూ, ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపించనున్నారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇప్పటికే జరిగిన సదావర్తి సత్రం భూముల అమ్మకాలను రద్దు చేసి, దేవాలయాలు, సత్రాలు, మఠాలకు చెందిన భూములను అమ్మకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సదావర్తి సత్రం ఈవో, ఆదాయపు పన్నుశాఖ చీఫ్ కమిషనర్, పెద్దకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్ కమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చెలమలశెట్టి రామానుజయ, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి, కుమారుడు నిరంజన్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 

Advertisement
Advertisement