ఆకుపచ్చ సూర్యదయం

ఆకుపచ్చ సూర్యదయం


‘‘చెప్పుకోవడానికి ఏమీ లేదని మొదటే అన్నావు. నీ నిజాయితీ నాకు నచ్చింది. అందుకే అడుగుతున్నాను. నీ బలహీనతని ఒప్పుకున్నంత హుందాగా, నా బలహీనతనీ, ఉద్యమంలో బలహీనతనీ – ఏమైనా నీకు కనిపిస్తే– నిరభ్యంతరంగా చెప్పవచ్చు.’’ అన్నాడు రామరాజు.‘‘చచ్చిన పాముని ఇంకా కొట్టకండి స్వామి! అంతమాటెందుకు?’’ అన్నాడు మల్లు. ఒక్కొక్కమాటే చెబుతున్నట్టు చెప్పాడు రామరాజు.‘‘నిన్ను బాధపెట్టాలని కాదు మల్లన్నా! నువ్వు ఉద్యమానికి దూరంగా వెళుతున్నా దాని జాడ నీ వెంటే  ఉంటుంది.



 అది నువ్వు కాదనుకున్నా వీడేది కాదు. కానీ బయట నీవు మరింత బాధ్యతగా, మరింత జాగరూకతతో ఉండాలి. నిన్ను నేను ఉద్యమం నుంచి వేరు చేయగలను కానీ, కొండవాళ్ల నుంచి కాదు.  ఉద్యమంతో బంధం తెగిపోయినా కూడా నీవు వేసే ప్రతి అడుగు ఉద్యమం దిశనీ, ఇందరి జీవితాలనీ, ఒక పెద్ద ఆశయాన్నీ శాసిస్తుందని మరచిపోకు. నీవు ఉద్యమంలో లేకున్నా కూడా పవిత్ర జీవితం గడపడం మనిషిగా నీ విధి. ఇదే.. నీకు నేను చివరిగా చెప్పేది.’’



7

ఇప్పుడు తను ఉద్యమకారుడు కాదు. అడవితల్లిని ఆదుకోవడానికి కొండవాళ్లు సాగిస్తున్న పోరులో భాగస్వామి కాడు. ఈ మాటలు తలుచుకుంటే గుండె కెలుకుతున్నట్టనిపించింది మల్లుకి. బగతలంటే యుద్ధవీరుల కులమని నమ్ముతారంతా. తానేమో యుద్ధాన్ని మధ్యలో విరమించాడు.



ఆ దేవుడు... స్వామి... శ్రీరామరాజు సాంగత్యం ఇక తనకి లేదు. ఈ వాస్తవం మరీ మరీ కలచివేస్తోంది.  తన కారణంగా, తన ప్రవర్తన కారణంగా ఆయన ఎంత క్షోభ పడ్డాడోననిపించింది కూడా. కొర్రు దిగి చచ్చిపోవాలన్నంత ఆవేశం వచ్చింది మల్లుకి. ఇప్పుడు తను ఏమిటి? మల్లు అనే ఈ జీవి గమ్యం ఏమిటి? రామరాజు చివరి హెచ్చరికగా చెప్పిన మాటలు అర్థం కావడానికి రెండు రోజులు పట్టింది మల్లుకి. తన కోసం వెయ్యి కళ్లతో వెతుకుతున్నారు పోలీసులు.



తను చచ్చిపోవచ్చు. ఫర్వాలేదు. కానీ తన నోటి నుంచి ఏమీ రాకూడదు కదా! రామరాజు చివరి హెచ్చరికలోని అంతరార్థం అది కాదూ!తనెవరో గుర్తు పట్టని మారుమూల పల్లెల్లో గడిపాడు. పగలంతా చిన్న చిన్న గుహలలో బతికాడు. రాత్రి వేళ అడవిలో తిరిగాడు. కానీ ఇదంతా నాలుగైదు రోజులే. ఇలాంటి జీవితం మల్లు నైజానికే వ్యతిరేకం. తను ఉద్యమంలో లేడన్న బాధ నెమ్మదిగా సద్దుమణిగింది. అతడికి ఇప్పుడు ఏ నైతిక నిర్బంధమూ లేదు. ఏ కట్టుబాటూ లేదు.



ఆ పగటి వేళ బయటకు వచ్చి రెండు చోట్ల ఈత చెట్లు ఎక్కి కల్లు తీసుకుని ఒక పొదలో కూర్చుని కడుపారా తాగాడు. సాయంత్రం దాకా నిద్రపోయాడు.

చీకటి పడుతుండగా లేచి అంతాడ బయలుదేరాడు. నేరుగా వెళ్లి పాత మిత్రులని కలిశాడు. ఆ ముగ్గురు మిత్రులు అతడిని హఠాత్తుగా చూసేసరికి బిత్తరపోయారు. మల్లును ఊరికి దూరంగా తీసుకుపోయి అక్కడ పశువుల కొట్టం అటక మీద జొన్న గడ్డి వెనక దాచారు.నెమ్మదిగా చర్చ నడింపాలెం మీదకి మళ్లింది. మల్లు స్వగ్రామం బట్టిపనుకుల పక్కనే ఉంది. ఇంకో పక్కన ఉంది నల్లగొండ.



‘‘ఒరేయ్‌! మీ ఒదిన్ని చూడాల్సిందేరా! ఆ బాధ్యత మీకే అప్పగిస్తున్నాను. ఇవాళ రాత్రికి వెళతాను. నాలుగు డ్రాములు సారా, కణుజు మాంసం, కల్లు తెచ్చే బాధ్యత మీదే. ఈ సాయం చేసి పెట్టండ్రా!’’ అన్నాడు గుటకలు వేస్తూ మల్లు. పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టయింది ఆ ముగ్గురు మిత్రులకీ. ఒప్పుకుంటే ఒక గొడవ, లేకపోతే ఒక గొడవ. ఇవన్నీ ఎలా ఉన్నా, సాధ్యం కాదంటే ఇక మిన్నకుండిపోయేవాడు కాదు మల్లు.సరే అన్నారు భయంభయంగా. అటక దిగిపోతుంటే ఒక మిత్రుడు బయటకే అనేశాడు, ‘‘అందరిదీ పిట్టల వేట. ఈడిది బొట్టెల వేట.’’



ఒదిన అంటే మల్లు కట్టుకున్న భార్య కాదు. ఉంపుడుగత్తె. ఒక కొండదొర కూతురు. ఈ సంబంధం ఆ చుట్టుపక్కల వాళ్లు ఎవరికీ ఇష్టం లేదు.  ఆమె పేరు సుమర్ల సింకుబుల్లి. అంతా చితుకులమ్మ అని పిలుస్తారు. ఒక జొన్న చేను పక్కనే ఉంది చితుకులమ్మ ఇల్లు. చేను మధ్యలోనే ఉంది మంచె. మల్లు కోసం పెళ్లి కూడా మానేసింది. ఇరవైరెండు సంవత్సరాల ప్రాయంతో పిటపిటలాడుతున్న యువతి చితుకులమ్మ. రాత్రి ఎనిమిదిగంటల ప్రాంతం. చలి అందుకుంటోంది. తల మీద నుంచి గొంగడి కప్పుకుని  లాంతరు పట్టుకుని మంచె నిచ్చెన దగ్గరకి వచ్చిందామె. తరువాత పైకి ఎక్కి జంతువుల జాడ కోసం లాంతరు పైకి ఎత్తి చుట్టు పక్కల ఒకసారి పరిశీలించింది. నిజానికి జంతువుల జాడ కోసం కాదు, మల్లు రాకను పసిగట్టడానికి ఎవరైనా నక్కి ఉన్నారేమో గమనించడానికే.



మళ్లీ ఇంట్లోకి  వెళ్లి తలుపులు వేసుకుంది. వెనక తలుపు గడియ తీసి ఉంచింది.ఊరివాళ్లు ఎవరైనా సమాచారం అందిస్తారేమోనని బాగా భయపడుతోందామె. ఇప్పటికే ఒకసారి వచ్చి మల్లు గురించి అడిగివెళ్లారు పోలీసులు, ఊరి మునసబు.  కానీ మల్లు వస్తున్నాడనగానే ఇవన్నీ మరచిపోవడమే కాదు,  శరీరంలో మొదలైన కాంక్షకు కూడా ఆమె లొంగిపోయింది. పోలీసుల దాడుల గురించి వింటుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. కానీ మల్లు వస్తున్నాడని చెప్పగానే కలిగిన పులకరింత ఆ భయాన్ని తాత్కాలికంగా అణచేసింది.



కానీ, నల్లగొండ మునసబు ద్వారా ఈ సమాచారం పోలీసులకి  చేరిపోయింది.  కృష్ణదేవిపేట పోలీసు శిబిరంలో ఉన్నాడు కీరన్స్‌. సాయంత్రం ఏడు గంటల ప్రాంతం సమాచారం తెలియగానే ఇంటెలిజెన్స్‌ ఎస్‌ఐ రాధాకృష్ణతో మాట్లాడాడు కీరన్స్‌. ఇరవైముగ్గురు సాయుధ బలగాలతో హుటాహుటిన బయలుదేరారు. రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతం. చలి పెరిగింది. ఎక్కడో దుమ్ములగొండి అరిచింది. దానికి కీచురాళ్లు రెండు లిప్తల పాటు సంగీతం ఆపీ మళ్లీ ఆరంభించాయి. అప్పుడే నడింపాలెంలో చితుకులమ్మ ఇంటి వెనక గుమ్మం దగ్గర నెమ్మదిగా పిలుపు, ‘‘చితుకులు!’’ఒక్క ఉదుటున వెళ్లి తలుపు తీసిందామె. ఎదురుగా మల్లుదొర. మెడలో కండువా పట్టుకుని ఒక్క ఉదుటున లోపలికి లాగి తలుపు వేసింది.



‘‘తలుపు తీసే ఉందిగా! మళ్లీ పిలవడం ఎందుకు?’’ అంది కంగారుగా. ‘‘అంత కంగారు దేనికే నా ముద్దుల బొట్టె?’’ అన్నాడు మల్లు.‘‘కంగారు కాదేంటి?’’ అంటూనే అతడి గుండెల మీద వాలిపోయింది.ఎముకలు విరిగిపోయేటట్టు కౌగిలించుకుంటూ అన్నాడు మల్లు, ‘‘ఇందుకేనే నిన్ను మర్చిపోలేను. నీ దగ్గర ఓ పాలి తొంగున్నాక, ఇంక చస్తే మాత్రం ఏంటే!’’ అన్నాడు, తమకంతో. ‘‘అబ్బ! ఎంత మోటో!’’ అంది, బొంగురు గొంతుతో మరింత కవ్విస్తూ. ‘‘రాయే... మంచం ఎదురుచూస్తాంది!’’ అంటూ అలవోకగా ఎత్తుకుని పక్క గదిలోకి నడిచాడు మల్లు.

∙∙

పదిన్నర గంటలవుతుండగా మొదట కీరన్స్, రాధాకృష్ణ గుర్రాల మీద నడింపాలెం శివార్లకి చేరారు. కృష్ణదేవిపేట –శరభన్నపాలెం దారిలోనే ఉంది, ఆ చిన్న పల్లె.

వాటి అలికిడి గురించి తెలియకుండా ఊరి బయటే ఒక పొద వెనుక కట్టేశారు. తమ జాడ కూడా ఎవరూ గమనించకుండా అక్కడే ఒక చెట్టు మొదట్లో ఆ చిమ్మ చీకటిలో నిలబడ్డారు. మిగిలిన 23 మంది గుర్రాల మీదే వస్తున్నారు.



వాళ్ల రాక కోసమే ఈ ఇద్దరు వేచిఉన్నారక్కడ. అప్పుడే.... రెండు లాంతర్లు శరభన్నపాలెం మార్గం నుంచి చితుకులమ్మ ఇంటి వైపు రావడం కనిపించింది. ఒక్క నిమిషం కీరన్స్‌ గుండె జల్లుమంది. చీకట్లో బాగా గమనించిన తరువాత వస్తున్నవాళ్లు ఇద్దరేనని నమ్మకం కుదిరింది. అప్పుడు కొంచెం బెదురు తగ్గింది. వాళ్ల చేతుల్లో ఉన్న ఇత్తడి గిన్నెలు లాంతరు గుడ్డి వెలుతురులో కూడా లీలగా మెరుస్తున్నాయి. అంత బాగా తోమారు.



వాళ్లు కూడా ముసుగులు కప్పుకుని నెమ్మదిగా చడీచప్పుడూ కాకుండా వస్తున్నారు. ఆ లాంతర్లు కొన్ని అడుగులు దాటిన తరువాత కీరన్స్‌ రాధాకృష్ణ చెవిలో చెప్పాడు, వాళ్లనే అనుసరించమని.రాధాకృష్ణ వాళ్ల వెంటే నెమ్మదిగా వెళ్లాడు.సరిగ్గా పది నిమిషాలకే ఇరవైమూడు గుర్రాలు చీకట్లో నడుస్తూ రావడం కనిపించింది. గబగబా ముందుకు వెళ్లి కొద్దిదూరంలోనే వాళ్లని ఆపేసి, గుర్రాలు దిగమని సైగ చేశాడు కీరన్స్‌.



అంతా గుర్రాలు అక్కడే కట్టేసి, తుపాకులు పట్టుకుని  కీరన్స్‌ని అనుసరించారు. అప్పటికే రాధాకృష్ణ చితుకులమ్మ ఇంటికి కొంచెం దూరంలో అసహనంగా కదులుతూ కనిపించాడు. ‘‘దొరికినట్టే!’’ చీకట్లో గుసగుసలాడుతూ అన్నాడు రాధాకృష్ణ. కీరన్స్‌ అనుమతి కోసం చూడకుండానే రాధాకృష్ణ పదిమంది సాయుధులని విడదీసి, ఆ ఇంటికి ఇరవై గజాల దూరంలో గుండ్రంగా చెట్ల పొదల చాటున మాటు వేయించాడు. ఒక్కొక్క సాయుధుడి మధ్య  పది పన్నెండడుగుల దూరం ఉంది.



పథకం అర్థమైంది కీరన్స్‌కి. చాలా చురుకుగా కదులుతున్నాడు రాధాకృష్ణ.ఆ రెండు లాంతర్లతో ఆ ఇంటికి వెళ్లినవాళ్లు ఎక్కువ సేపు ఉండరు. లోపల ఉండేది కొన్ని నిమిషాలే కూడా. ఆ కొద్ది సమయంలోనే ఇదంతా పూర్తి చేసేశాడు. నలుగురిని వీధి గుమ్మం దగ్గర తుపాకులు బారు పెట్టి నిలబెట్టేశాడు. కీరన్స్‌ని తన వెంట రమ్మన్నాడు. ఆ ఇద్దరూ, మిగిలిన సాయుధులు ఇంటి వెనుక వైపు Ðð ళ్లి దడి చాటున నక్కారు.



రాధాకృష్ణ అనుకున్నట్టే వాళ్లు నక్కిన రెండు నిమిషాల కల్లా ఆ ఇద్దరు పెరటి గుమ్మం తెరుచుకుని లాంతర్లతో సహా నెమ్మదిగా బయటకు అడుగు పెట్టబోతూ అటూ ఇటూ చూశారు. ఎవరూ లేరని నిర్ధారించుకుని గడప దాటారు. వెనకాలే నెమ్మదిగా మూసుకున్నాయి తలుపులు. ఆ ఇద్దరు పదడుగులు వేశారు. అంతే, రాధాకృష్ణ, ఇంకో సాయుధుడు తటాల్న వెనక నుంచి పీక మీదుగా కుడి చేయి వేసి బంధించారు, తలొకడిని.



ఈ హఠాత్పరిణామానికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంకో పక్క ఊపిరి అందడం లేదు ఆ ఇద్దరికీ.రాధాకృష్ణ అంతేవేగంగా రివాల్వర్‌ తీసి తన చేతిలో బందీ అయి ఉన్నవాడి కణత మీద పెట్టి, చిన్న గొంతుతో  ఒకటే ప్రశ్న వేశాడు, ‘‘లోపల మల్లు దొరే కదా!’’అతడు పెనుగులాడబోయాడు. రెట్టించిన కసితో, చేతి పట్టును మరింత బిగిస్తూ చెవిలో అన్నాడు రాధాకృష్ణ ‘‘చెప్పరా... నా కొడకా.... చచ్చిపోతావ్‌!’’  బలంగా తీస్తున్న ఊపిరి మధ్య అన్నాడు అతడు,



 ‘‘ఔ......ను....దొర!’’

అంతే, చేయి వదిలి అతడిని బలం కొద్దీ బూటుకాలితో తన్నేసి, ‘‘మూవ్‌!’’ గట్టిగా అరిచాడు రాధాకృష్ణ. వెంటనే నాలుగు బ్యాటరీలైట్లు వెలిగాయి. ఆ వెంటనే పెరటి తలుపుల మీద ఒక్కసారిగా అరడజను తుపాకీ మడమలు మోదాయి. రెండోసారి మోదాయి. తరువాత ఒక సాయుధుడు బూటుకాలితో బలంగా తన్నాడు. తలుపులు ఊడి వెనక్కి పడ్డాయి.ఒక్కసారిగా లోపలికి చొరబడ్డారంతా. ఇదంతా చూసి చితుకులమ్మ స్పృహ కోల్పోయి, కింద పడిపోయింది.



‘‘జాగ్రత్త! వీడు అత్యంత ప్రమాదకారి!’’ గట్టిగా హెచ్చరించాడు రాధాకృష్ణ పెద్ద గొంతుతో. ముందు గదిలో లేడని తేలిపోయింది. లోపలి గదిలోకి వెళ్లారు ఇద్దరు.

ఒక కత్తి, ఒక కండువా అక్కడే పడి ఉన్నాయి. ఆ సంగతే చెప్పారు గట్టిగా.కీరన్స్, రాధాకృష్ణ లోపలికి వెళ్లారు.అంతలోనే అటక మీద ఏదో చిన్న శబ్దం.రాధాకృష్ణ, కీరన్స్‌ ఒక్కసారే పైకి చూశారు. వెంటనే బ్యాటరీలైట్ల కాంతి కూడా పడింది. మరు లిప్తలో తుపాకులు గురి పెట్టడం కూడా జరిగిపోయింది. చేయి ఎత్తితే అందేటంత ఎత్తులోనే ఉంది అటక.



ఎవరో ఒక సాయు«ధుడు తుపాకీ బాయ్‌నెట్‌తో అటకని పొడిచాడు. అటక ఎంత మేర ఉందో అంత మేరకు బాయ్‌నెట్లు దిగిపోతున్నాయి. మిగతా చోట్ల నుంచి దుమ్ము రాలితే, ఒక్కచోట నుంచి మాత్రం ధాన్యపు గింజలు రాలడం కనిపించింది. మొదట మామూలు ధాన్యం సన్న ధారగా పడింది నేల మీద. చిన్న కుప్పగా తయారైంది.. తరువాత ఎర్రటి ధాన్యం గింజలు రాలడం మొదలైంది.... రక్తంతో తడిసిన ధాన్యం. ఒకరకమైన పైశాచికత్వంతో గట్టిగా, కర్కశంగా అరిచాడు రాధాకృష్ణ, ‘‘దిగిరారా! దిగు....!’’.



అంతా ఉత్కంఠతో చూస్తున్నారు. ఐదు నిమిషాలు గడిచిపోయాయి.అప్పుడు కీరన్స్‌ అరిచాడు, ఎదురుగా ఉన్న ఆ సాయుధ జమేదార్‌ నారాయణ కురూప్‌ని చూసి, ‘‘కురూప్‌! పైకి ఎక్కు. అవసరమైతే కాల్చేయ్‌! ఒక మూలగా వేసి ఉంది నిచ్చెన. ధైర్యంగా పైకి ఎక్కాడు కురూప్‌.మలయాళంలో ఏదో అరిచాడు. తుపాకీ మడమతో గుద్దిన Ô¶ బ్దం వినిపించింది.

అంతా ఐదారు నిమిషాలు.



మొదట కురూప్‌ నిచ్చెన దిగాడు. తరువాత మల్లు.పంచె మొలకి అడ్డదిడ్డంగా చుట్టి ఉంది. ఒళ్లంతా ధాన్యం, దాని నూగు. తలంతా ధాన్యపుగింజలు.చిన్న చిన్న గడ్డి పోచలు. అటక మీద వడ్లగింజల గరిసెలో దూరాడు.మెట్ల మధ్యలో ఉండగానే ఫెడీమని తన్నాడు కురూప్‌. వెల్లకిలా పడిపోయాడు మల్లు. నేల మీద పడుతుంటే మంచం తలకి కొట్టుకుంది బలంగా.  వెంటనే తుపాకుల మడమలన్నీ కొద్ది సేపటి క్రితం తలుపుల మీద ఎంత క్రూరంగా నర్తించాయో, అంతే క్రూరంగా మల్లు ఒంటి మీద నర్తించాయి.



బాధని పంటి బిగువున భరిస్తూ, పెనుగులాడుతున్నాడు మల్లు.కొంత కసి తీరిన తరువాత నిలబెట్టి చేతులు విరిచి వెనక్కి కట్టేశారు. కుడి పిరుదుకు కొంచెం కింద బాయ్‌నెట్‌ చేసిన గాయం నుంచీ, పగిలిన పెదవి నుంచీ నెత్తురు రుతోంది.నెట్టుకుంటూ బయటకు నడిపించుకొచ్చారు.  రాత్రి ఒంటి గంట అయి ఉంటుంది. అప్పటికప్పుడు ఎవరిదో రెండెడ్ల బండి కట్టించి అందులో ఎక్కించారు, చేతులతో పాటు కాళ్లు కూడా కట్టేసి.దెబ్బల బాధకి మల్లు పెద్దగా మూలుగుతుంటే బండి కదిలింది.

8

‘‘స్వామీ! కొంప మునిగిపోయింది!’’ కొండలయ్యగొంది ఆశ్రమంలోకి చొరబడి గట్టిగా అరిచాడు ఆ ఆగంతకుడు.ఉదయం ఐదు గంటల ప్రాంతం. చీకటి తొలగిపోలేదు.అప్పటికే లేచి రామరాజు స్నానానికి బయలుదేరుతున్నాడు.‘‘రాత్రి మల్లు నడింపాలెంలో ఉంపుడుగత్తె ఇంట్లో దొరికిపోయాడు. అర్ధరాత్రి కృష్ణదేవిపేట తీసుకువచ్చారు.’’ అన్నాడతడు కంగారుగా. ‘‘అబ్బా!’’ఏదో ముల్లు బలంగా గుచ్చుకున్నట్టు అన్నాడు రామరాజు. ‘‘అతడిని హింసిస్తారు తప్పదు. కానీ ప్రాణాలు తీసే సాహసం చేయరు.



 సరే, వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేద్దాం!’’ అన్నాడు మళ్లీ.కొన్ని నిమిషాలలోనే తుపాకులతో, ఆహార పదార్థాలు, ఇతర సామగ్రితో ఆశ్రమం బయటకు వచ్చేశారు అంతా. దాదాపు డెబ్బయ్‌ మంది. ఒక్క నిమిషం ఆలోచించి, ఎర్రేసుకి సైగ చేశాడు రామరాజు.రెండు కాగడాలు వెలిగించి  ఆ రెండు ఆశ్రమాల మీదకు విసిరేశాడు.  లేచిన మంటలు, సూర్యోదయం ఆ ప్రాంతాన్ని మరింత ఎర్రగా మార్చాయి.

9

‘‘వీడెవడ్రా లండన్‌ జూలో గెడ్డం వేలాడే బోర్నియన్‌ పందిలా ఉన్నాడు!’’ అన్నాడు స్వెయిన్,  కృష్ణదేవిపేట గ్రామ చావడి దగ్గరున్న చెట్టుకు కాళ్లు పైకి, తల కిందకి చేసి వేలాడదీసిన మల్లును చూసి. బెల్ట్‌లతో, లాఠీలతో చితకబాదుతున్నారు. నోరు విప్పడం లేదు మల్లు. కానీ దెబ్బలకి బాధతో విలవిల్లాడుతున్నాడు. జనమంతా చూసి హడలిపోయారని నిర్ధారించుకున్న తరువాత పోలీసు స్టేషన్‌లోపలికి తీసుకు వెళ్లారు. అప్పుడప్పుడు కొద్దిగా నీళ్లు, రెండు ముద్దలు పెడుతున్నారు.



నాలుగు రోజులలో కొన్ని వందల దెబ్బలు కొట్టేశారు. రూపు మారిపోయాడు మల్లు.ఒకరోజు బాగా పొద్దుపోయిన తరువాత చెప్పడానికి తన దగ్గర ఏమీ లేదని, తనని రాజు బహిష్కరించాడని చెప్పాడు మల్లు. కానీ అధికారులు నమ్మలేదు.పదిరోజుల పాటు హింసించారు. సహనం చచ్చిపోయింది తెల్ల అధికారులకి. పచ్చి మిరపకాయలు నూరి ఆ ముద్దలని పది సార్లైనా గుదంలో దూర్చి ఉంటారు.కిందంతా అక్షరాలా కాల్చిన ఇనుప చువ్వ దూర్చినంత బాధ.



‘‘ఇవాళ రాజు అనుచరుల గురించి నాకు చెప్పాలి. లేకపోతే నువ్వు చావాలి.’’ అంటూ ముఖం మీద పిడిగుద్దులు గుద్దడం మొదలుపెట్టాడు కీరన్స్‌. ముక్కులో నుంచి రక్తం వస్తోంది. పెదవులు మళ్లీ పగిలాయి. ఇక తట్టుకోలేక చెప్పేశాడు మల్లు.‘అవన్నీ.... పూజపెట్టెలో ఉంటాయి.’’ అదేమిటో కూడా చెప్పాడు మల్లు. మల్లును అక్కడ నుంచి నర్సీపట్నం, ఆ తరువాత విశాఖపట్నం జైలుకీ పంపించారు.



10

‘‘ఊళ్లో ఒక్క మనిషి కూడా లేకుండా ఖాళీ చేసి వెళ్లిపోయారు!’’సెల్యూట్‌ చేసి సంభ్రమాశ్చర్యాలతో చెప్పాడు ఎస్‌ఐ అనంతప్ప శెట్టి. గూడెంలో ఏర్పాటు చేసిన పోలీసు శిబిరంలోనే సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ హోదాలో ఉన్నాడు అనంతప్ప. హ్యూమ్‌కి కూడా విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. అతడు ఆ శిబిరానికి అధిపతి.గూడెం అంటే ఎనభైయ్‌ ఏళ్ల నుంచి జరుగుతున్న మన్యపోరాటాలలో వెన్ను చూపకుండా నిలబడింది. కానీ ఇప్పుడు ఎందుకు ఖాళీ చేసినట్టు? రామరాజు ఉద్యమం చల్లారిపోతోందనడానికి ఇది సూచనా?

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top