నిరుపేద ధనికురాలు!

నిరుపేద ధనికురాలు!


తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి పెడితే, విలాసంగా ఖర్చుపెట్టే కొడుకులనెందరినో చూశాం. చేతికి అంది వచ్చిన కొడుకులు వృద్ధాప్యంలో చక్కగా చూసుకుంటుంటే, నిశ్చింతగా గడిపే తల్లిదండ్రులూ మనకు తెలుసు. అయితే, అండగా ఉంటాడనుకున్న కొడుకు కాస్తా అకస్మాత్తుగా చనిపోతే అతని సంపాదనను అనుభవించకుండా, దానితో ఒక ధర్మసత్రం కట్టించి, తాను మాత్రం ఎప్పటిలా కూరగాయలమ్ముకుంటూ పొట్టపోసుకుంటోంది ఓ వృద్ధమాత. ఈ తల్లి గుండెచప్పుళ్లు విందాం...

 

‘ముప్పైఏళ్ల నాటి మాట.. కట్టుబట్టలతో బేల నుంచి జైనథ్‌కు వచ్చినం... నీడలేక పశువుల కొట్టంలో బతికినం.. వెంకటి పుట్టిన సంది దేవుడు ఎత్తుకున్నడు.. కూరగాయలమ్మి చదివిపిచ్చినం.. బయట దేశం (కెనడా)ల కొలువన్నడు.. నీ ఇష్టం బిడ్డా అన్నం.. కానీ దేవుడు ఇంత పని చేస్తడనుకోలేదు.. కొడుకే పోయిండు.. ఆ లక్షలు నా కెందుకు.. మా పేరు నిలబెట్టినందుకు.. వాని పేరు నిలబెట్టాలనుకున్నా...’ అని చెప్పుకొచ్చింది ఈ మాతృమూర్తి తానుబాయి. ఆరుపదులకు పైబడ్డా, కొడుకు సంపాదించిన దాంతో కృష్ణా రామా అని కాలక్షేపం చేయకుండా, కొడుకు సంపాదన అంతటినీ వెచ్చించి, జైనథ్ లక్షీ్ష్మనారాయణ స్వామి దేవాలయం ఆవరణలో సత్రం కట్టించి అందరికీ ఆదర్శంగా నిలిచింది తానుబాయి. అసలు తానుబాయి అంటే చుట్టుపక్కల తెలియని వారుండరు.

 

దాయాదుల పోరు భరించలేక బేల మండలానికి చెందిన తానుబాయి తన భర్త మారుతితో కలిసి 30 ఏళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని జైనథ్‌కు వలస వచ్చింది. మారుతి ఓ రైతు వద్ద పాలేరుగా చేరగా, తాను మాత్రం గ్రామంలో కూరగాయలమ్ముతూ కుటుంబ పోషణలో భర్తకు తోడుగా నిలిచింది. ఉండటానికి గూడు లేకపోవడంతో ఓ పశువుల కొట్టంలో నివసిస్తూ కాలం వెళ్లబుచ్చింది. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వెంకటేశ్వర స్వామికి మొక్కుకోగా పుట్టిన మగనలుసుకు వెంకటి అని పేరు పెట్టుకుని ఆశలన్నీ అతని మీదే పెట్టుకుని పెంచి పెద్ద చేసింది. కూరగాయలమ్ముతూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ ముగ్గురు ఆడపిల్లలకూ పెళ్లిళ్లు చేసింది.

 

రెక్కలు ముక్కలు చేసుకుని మరీ కొడుకును పెద్ద చదువులు చదివించింది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వెంకటి ఎంతో కష్టపడి ఎంబీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరాడు. ఈ విషయం తెలిసిన ఆ నిరుపేద దంపతులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే ఈ సంతోషం తానుబాయికి ఎక్కువ రోజులు మిగలలేదు. కొడుకు చేతికందిన కొద్దిరోజులకే భర్త హఠాన్మరణం ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కొడుకు వెంకటి ఉద్యోగ రీత్యా ముంబాయిలో పనిచేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఉన్నతోద్యోగం కోసం కెనడా వెళ్లాడు.



కొడుకు ఉన్నతిని చూసి ఎంతో సంతోషపడింది తానుబాయి. అయితే ఇంతలోనే ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు ఆ తల్లి సంతోషాన్ని తుడిచేసింది. కెనడాలో జరిగిన ఓ ప్రమాదంలో వెంకట్ మృత్యువాత పడటంతో ఈ తల్లికి కడుపుకోత మిగిలింది. భర్త మరణించిన కొద్ది కాలానికే కొడుకు కూడా దూరమవడంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి ఆమెకు ఏడాది పట్టింది.

 

కొడుకు పేరు కలకాలం గుర్తుండేలా చేయాలనుకుంది ఆ తల్లి. తాను రెండు గదులున్న పెంకుటింటిలో తలదాచుకుంటూ, తన కొడుకు సంపాదన అంతటినీ కూడగట్టి ఆలయ ఆవరణలో ధర్మసత్రాన్ని నిర్మించాలని తలపెట్టింది. తల్లి నిర్ణయాన్ని వెంకట్ తోబుట్టువులు మనస్పూర్తిగా స్వాగతించారు. అవసరమైతే తాము కూడా ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమన్నారు. ఆడపిల్లల మాటల ఆసరాతో కొండంత బలం వచ్చిన తానుబాయి ఆ డబ్బును ఆలయానికి విరాళంగా ఇచ్చి ఊరుకోలేదు. దగ్గరుండి మరీ రెండంతస్తుల ధర్మసత్రాన్ని కట్టించింది.

 

లక్ష్మినారాయణస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ భవనాన్ని ఆలయానికి అంకితం చేసింది. ఆమె కట్టించిన ఈ ధర్మసత్రం వ్రతాలు, పూజలు చేసుకునేందుకు వచ్చే తమలాంటి ఎందరో భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటోందని భక్తులు పేర్కొంటున్నారు. ఆలయం పక్కనకూరగాయలమ్ముతూ జీవనం కొనసాగిస్తున్న ఈ నిరుపేదరాలు ఆశయంలో మాత్రం అదనంత ధనికురాలే! అందరికీ ఆదర్శనీయురాలే!

 - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top