తొలగిస్తారా? తొలగించమంటారా? : ఎంపీ నాని

తొలగిస్తారా? తొలగించమంటారా? : ఎంపీ నాని

  • తొలగిస్తారా? తొలగించమంటారా?

  • శనైశ్చరస్వామి ఆలయ నిర్వాహకులతో ఎంపీ నాని

  • ఊరిబయట స్థలాలిస్తాం.. అక్కడే నిర్మించుకోండంటూ బేరం

  • బెదిరించైనా స్థలాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం

  •  

    విజయవాడ : నగరంలోని ప్రముఖ ఆలయమైన శనైశ్చరస్వామి దేవస్థానాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇక్కడి దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిని పూర్తిగా తొలగిస్తే.. ఊరిబయట కోరిన గ్రామాల్లో స్థలాలు ఇస్తామని, అక్కడ ఇదే దేవాలయాన్ని నిర్మించుకోవచ్చని నిర్వాహకులను ప్రలోభ పెడుతున్నారు. అందులో భాగంగానే శుక్రవారం ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తన కార్యాలయానికి ఆలయ నిర్వాహకులను పిలిపించుకున్నారు.


    సేకరించిన వివరాల ప్రకారం గుడి వల్ల పార్కింగ్‌కు ఇబ్బంది ఉందని, గొల్లపూడిలో స్థలం కేటాయిస్తాం.. వెళ్లిపోతారా అని నాని నిర్వాహకులను ప్రశ్నించారు. ఇక్కడి ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు అనుమతిస్తే ఊరిబయట మీరు కోరిన గ్రామాల్లో స్థలాలు ఇస్తామని అక్కడ ఇదే దేవాలయాన్ని నిర్మించుకోవచ్చంటూ చెప్పారు. గుడిని తప్పనిసరిగా తీసివేయాలని, మీకు మీరుగా తీస్తారా? మమ్మల్ని తొలగించమంటారా? అని ప్రశ్నించారు.


    అవసరమైతే పుష్కరాలు ముగిశాక రాజీవ్‌గాంధీ పార్కుకు సమీపంలో తగిన స్థలం కేటాయించి గుడి నిర్మాణం చేయిస్తామని చెప్పారు. శనైశ్చరస్వామి ఆలయం జోలికి రాబోమని తొలుత హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు మాటమార్చడంతో అవాక్కైన నిర్వాహక కమిటీ దీనికి సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో శనైశ్చరాలయాన్ని పూర్తిగా కూల్చివేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

     

    గోశాల కనుమరుగు?

    గోశాలలోని 150 గోవులకు ప్రస్తుతం ఇంద్రకీలాద్రి గోడ పక్కగా ఇరుగ్గా ఉండే ప్రదేశాన్ని మాత్రమే ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ ప్రదేశాన్ని కూడా తీసుకుని, గోశాలను కొత్తురు తాడేపల్లికి తరలించేందుకు ఎంపీ కేశినేని శ్రీనివాస్, కలెక్టర్ బాబు.ఎ రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. గోశాల వెనుకవైపు ఇంద్రకీలాద్రిపై కొన్ని ఇళ్లు ఉన్నాయి. వారికి ఎన్టీఆర్ హయాంలో బీఫారం పట్టాలు ఇచ్చారు.


    ఈ పట్టాల యజమానులకు ఒక్కొక్కరికి గజం రూ.53 వేలు చొప్పున దుర్గగుడి నుంచి ఇప్పించి వాటిని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఆ ఇళ్లు తొలగించేటప్పుడే గోశాలను పూర్తిగా తొలగిస్తారని మల్లికార్జున పేటలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. గోశాలలోని ఒక వర్గం ఇప్పటికే నాయకుల బెదిరింపులకు లొంగిపోయింది. వీరితోనే చర్చలు జరిపి గోశాలను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. గోశాలను పూర్తిగా కొత్తూరు తాడేపల్లికి తరలించాలంటూ ఇప్పటికే నిర్వహకులపై ఒత్తిడి తెస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top