వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

వర్షంలో తడుస్తూ ప్రచారంలో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో విస్తృతంగా పర్యటించిన జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. 13 రోజుల పాటు నంద్యాల నియోజకవర్గంలో ఆయన అనేక రోడ్ షోల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. చివరి రెండు రోజుల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన రోడ్ షోల్లో పాల్గొనడమే కాకుండా వ్యక్తిగతంగా ఎంతోమందిని పలకరించారు. ప్రచారం ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఏమాత్రం విశ్రాంతి లేకుండా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కారణంగా జలుబు, జ్వరం వచ్చిందని, కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతో గురువారం పార్టీ నాయకులను కూడా పెద్దగా కలుసుకోలేదు. ఇలా ఉండగా, శుక్రవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సందేశం పంపించారు. భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధి పరంగా ఇరు రాష్ట్రాలకు విఘ్నాలు తొలగి ఇకమీదట అన్నీ విజయాలే సిద్ధించాలని ఆ సందేశంలో ఆయన కోరుకున్నారు.


