చంద్రమామ కథలే


హైదరాబాద్: ’పట్టు వొడుపుల చంద్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్లి చెట్టుపై నుంచి తన హామీల మూటను భుజాన వేసుకుని ఎప్పటిలాగే జనావాసం కేసి నడవసాగాడు. అప్పుడు మూటలోని వాగ్దాన భేతాళుడు లేచి ‘ఓ చంద్రమార్కా.. నీవు ఏ ప్రయోజనం ఆశించి ఇలా మాటిమాటికీ వాగ్దానాలు చేస్తున్నావో, వాటిని మళ్లీ మళ్లీ మూట కట్టి చెట్టుపై ఎందుకు వేస్తున్నావో ఏమాత్రం అర్థం కావడంలేదు. నీ మనసులో ఏముందో చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది’ అని హెచ్చరించాడు. అప్పుడు చంద్ర మార్కుడు.. ‘వాగ్దాన భేతాళా! నేను నిజం చెబితే కూడా నా తల వెయ్యి ముక్కలవుతుందని ముందే ముని శాపం ఉంది కదా’ అని మందహాసం చేశాడు. ఆ మందహాసం అర్థం కాగానే భేతాళుడు మూటతో సహా మళ్లీ చెట్టెక్కాడు.’

 


ఎన్నికలకు ముందూ తర్వాతా కోటలు దాటే మాటలు ఇచ్చిన చంద్రబాబు.. వరుసగా రెండో బడ్జెట్‌లోనూ ఆ మాటలన్నీ నీటి మూటలేనని తేల్చేశారు. ఎన్నికలకు ముందు అనేకానేక హామీలతో ప్రజలకు రంగుల కలలు చూపించిన చంద్రబాబునాయుడు.. ఏపీ సీఎం పదవి చేపట్టాక వరుసగా రెండో బడ్జెట్‌లోనూ ఏ ఒక్క వాగ్దానానికీ పూర్తి న్యాయం చేయలేదు!  ‘తొలి సంతకాల’కూ తిలోదకాలిచ్చేశారు. ‘మలి విడత’ వాగ్దానాలకూ పాతరేసేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ప్రవేశపెట్టిన 2015-16 వార్షిక బడ్జెట్‌లోనూ హామీల అమలుకు మొండి చెయ్యే చూపింది.


నిరుద్యోగ భృతి ఊసు లేదు. చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు మాట లేదు. ఎన్‌టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లను ప్రారంభం కాకముందే ఎత్తేశారు. మహాలక్ష్మి పథకం, పండంటి బిడ్డ పథకం, ఎన్‌టీఆర్ సుజల స్రవంతి.. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వేటికీ ఈ బడ్జెట్‌లోనూ కేటాయింపులు లేవు. వచ్చే ఏడాది నుంచి ఇస్తామన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులనూ ఇవ్వలేదు. ప్రత్యేక అభివృద్ధి నిధి పేరుతో సీఎం ఏకంగా రూ. 500 కోట్లు తన చేతుల్లో పెట్టుకున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా పింఛన్లు, ఫీజులు వంటి పథకాలకు అరకొర కేటాయింపులు జరిపి చేతులు దులుపుకున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి వాస్తవ అవసరాలకు.. చేసిన కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ సాగిపోయింది. రైతుల రుణ మాఫీకి రూ. 4,300 కోట్ల కేటాయింపులతో సరిపుచ్చారు.


మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ పేరుతో 1,000 కోట్లే ప్రతిపాదించారు. ప్రణాళికావ్యయం కన్నా ప్రణాళికేతర వ్యయం భారీగా ప్రతిపాదించారు. ఆర్థికమంత్రి యనమల రూ. 7,300 కోట్ల రెవెన్యూ లోటుతో 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,13,049 కోట్ల బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీకి సమర్పించారు. ఈ రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడం ఎలాగో చెప్పకుండా.. రానున్న రోజుల్లో పన్ను బాదుడు తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ద్రవ్య లోటు  17,584 కోట్లగా ఉంటుందని అంచనా వేశారు. ప్రణాళిక, ప్రణాళికేతరంలో మొత్తం రెవెన్యూ వ్యయం ఏకంగా రూ. 97,224 కోట్లగా పేర్కొన్నారు. బాబు అధికారంలో రావడానికి సంపూర్ణ సహకారాలు అందించిన జిల్లాలను విస్మరించారు. పశ్చిమగోదావరి జిల్లా రుణం తీర్చుకోలేనిదంటూ  ఇచ్చిన హామీలకు పైసా విదల్చలేదు. రాజధాని ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో హామీలను పక్కన పెట్టేశారు.

 

శ్రీకాకుళం జిల్లా

 

పర్యటనకు వచ్చినప్పుడు శ్రీకాకుళం పట్టణం చుట్టూ రూ. 114 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని, రూ. 119 కోట్లతో భూగర్భ కాల్వల నిర్మాణం చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జంపరకోట రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ఎన్నికల హామీనిచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గత బడ్జెట్‌లో ప్రకటించినట్లే మళ్ళీ భావనపాడు, కళింగపట్నం పోర్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామని తాజా బడ్జెట్‌లో ప్రకటించారే తప్ప నిర్దిష్టంగా ఎంత నిధులు కేటాయిస్తున్నారో పేర్కొనలేదు. బారువ, కళింగపట్నంలలో ఏపీటీడీసీ కొత్త సముద్రతీర విహార స్థలాల్ని ప్రారంభించినట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు.

 

పశ్చిమగోదావరి




చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లా పర్యటనలకు పశ్చిమగోదావరి నుంచి శ్రీకారం చుట్టారు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు పర్యటించారు. జన్మభూమి-మా ఊరు, పాదయాత్ర తదితర కార్యక్రమాలకు హాజరై ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చారు. జిల్లాకు 500 పడకలతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని, నందమూరు అక్విడెక్టు తొలగింపు, ఆయా నియోజకవర్గాల్లో తాగునీటి పథకాలు, రోడ్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీలు ఇచ్చారు. అయితే బడ్జెట్‌లో పశ్చిమగోదావరికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఒక్కటీ ప్రకటించకపోవడం గమనార్హం.


ప్రకాశం



 ప్రకాశం జిల్లాలో దొనకొండ, కనిగిరిలను పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఒంగోలులో వెటర్నరీ యూనివర్సిటీ, మినరల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామంటూ హామీలిచ్చారు. కానీ బడ్జెట్‌లో వాటి ఊసే ఎత్తలేదు. అయితే దొనకొండలో నో ఫ్రిల్స్ విమానాశ్రయం ప్రతిపాదన ఉన్నట్లు ప్రకటించారు.

 

వైఎస్సార్‌జిల్లా


చంద్రబాబు సీఎం అయ్యాక వైఎస్సార్ జిల్లాలో రెండు సార్లు పర్యటించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామని, మెగా ఫుడ్ పార్కు, రాజంపేటలో హార్టికల్చర్ యూనివర్సిటీ, టెర్మినల్ మార్కెట్, చేనేత కార్మికుల కోసం మైలవరంలో టెక్స్‌టైల్స్ పార్కు, ప్రొద్దుటూరులో అపెరల్ పార్కు, తాళ్ళపాక అన్నమయ్య ఒంటిమిట్ట, పెద్ద దర్గా, దేవుని కడప, గండికోటలను కలిపి పిలిగ్రిమ్ టూరిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ బడ్జెట్‌లో ఈ జిల్లానూ పూర్తిగా విస్మరించారు. కడపలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఇప్పుడు కడప నుంచి తరలించేందుకు జిల్లాల నడుమ చిచ్చు రేపుతున్నారు.

 

నెల్లూరు



ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో ఎరువుల పరిశ్రమ, టెక్స్‌టైల్స్ పార్కు, పెన్నా, కండలేరు, సోమశిల, ఉత్తర కాల్వ అభివృద్ధికి హామీలు ఇచ్చారు. నెల్లూరుకు రింగ్‌రోడ్డు నిర్మిస్తామని, పులికాట్, నేలపట్టు, మైపాడ్, పెంచలకోనలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. బడ్జెట్‌లో వీటి ప్రస్తావనే లేదు. వెంకటగిరిలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తానని ప్రకటించి దగదర్తి వద్ద ప్రతిపాదన మాత్రం ఉన్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు అభివృద్ధికి పైసా కేటాయించలేదు.

 

విజయనగరం



జిల్లాకు సంబంధించి ఏడాదిలో తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే బడ్జెట్‌లో రూ. 161.98 కోట్లు మాత్రమే కేటాయించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, నౌకాశ్రయం ఏర్పాటు చేస్తానని చెప్పినా.. బడ్జెట్‌లో ప్రతిపాదన మాత్రమే ఉందని సరిపెట్టారు. కేటాయింపులేవీ చేయలేదు.

 

విశాఖపట్నం



విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అర్ధంతరంగా నిలిచిపోయిన విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)కు రూ. 60 కోట్లు కేటాయిస్తానని హామీ ఇస్తే.. బడ్జెట్‌లో ఈ హామీని చేర్చినా ఎంత కేటాయిస్తామనేది చెప్పలేదు. లాజిస్టిక్ హబ్‌గా విశాఖను అభివృద్ధి చేస్తానని చెప్పి కనీసం ఇందుకు ప్రణాళిక కూడా ప్రకటించలేదు.


అనంతపురం



అనంతపురం జిల్లా వాసులు తమ పార్టీని ఆదరించారని చెబుతూనే సీఎం చంద్రబాబు తన బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంను ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీలు గుప్పించారు. ఈ బడ్జెట్‌లో అనంతపురం జిల్లాకు ఏ ప్రాజెక్టు మంజూరు కాలేదు. నంబూలపూలకుంటలో జాతీయ స్థాయి వేరుశనగ పరిశోధన కేంద్రం, కనగానపల్లి మండలంలో గోరు చిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తామని హామీలు ఇచ్చి శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. వాటి ఊసూ బడ్జెట్‌లో లేదు.

 

చిత్తూరు


చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరులో పలు హామీలు గుప్పించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. దానిని అనంతపురానికి తరలించారు. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తానని పదే పదే వాగ్దానం చేశారు. ఆధ్యాత్మిక కారిడార్‌గా తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంను చేస్తాననీ చెప్పారు. కానీ బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేకుండా చేశారు. కుప్పంలో ప్రాంతీయ విమానాశ్రయం అభివృద్ధి చేసే ప్రతిపాదనలున్నాయని బడ్జెట్‌లో పొందుపరిచారు.

 

కర్నూలు



కర్నూలు జిల్లాలో ప్రభుత్వాస్పత్రిని నిమ్స్ తరహాలో రాయల సీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌గా తీర్చిదిద్దుతామని, నంద్యాలలో విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసి దేశంలోనే సీడ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తామని, డోన్‌లో ధన్‌బాద్ తరహాలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ సంస్థను నెలకొల్పుతామని, ఓర్వకల్లులో పారిశ్రామిక నగరాన్ని ఏర్పాటు చేసి.. హార్డ్‌వేర్, ఐటీ అభివృద్ధి చేస్తానన్నారు.  ఓర్వకల్లు వద్ద ప్రాంతీయ విమానాశ్రయం ప్రతిపాదన ఉందని మా త్రం ప్రకటించారు.


రాజధాని ప్రాంతాల్లో హామీల ఊసూ అరకొరే...



రాజధాని ప్రాంతాలుగా ప్రకటించిన గుంటూరు, విజయవాడలలో పలుమార్లు పర్యటించిన చంద్రబాబు.. ఈ రెండు జిల్లాల్లో ఇచ్చిన హామీలకు కొద్దిగా కదలిక తెచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి, భవానీద్వీపం అభివృద్ధి, నగరం (కాల్వల) సుందరీకరణ, గన్నవరంలో ఐటీ ప్రాజెక్టులు, మచిలీపట్నంలో రూ. 20 వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు, మచిలీపట్నంలో పోర్టు విస్తరణ హామీలకు గాను.. భవానీ ద్వీపాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటం, మచిలీపట్నం పోర్టు అభివృద్ధి, గన్నవరంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల అంశాల్ని మాత్రం బడ్జెట్‌లో ప్రస్తావించారు. ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసిన చంద్రబాబు.. అధికారంలోకి  వచ్చిన తర్వాత ఆ సంగతే పట్టించుకోలేదు. గుంటూరు జిల్లాలోనూ వెనుకబడిన వినుకొండ నియోజకవర్గంలో పలు హామీలిచ్చారు. చెంతనే కృష్ణానది ఉన్న పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాలు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు పలుమార్లు సీఎంను కలిసి తాగునీటి ప్రాజెక్టు ప్రకటించాలని కోరినా ఫలితం లేదు. బడ్జెట్‌లో వీటిపై ఎలాంటి ప్రకటన లేదు. సాగర్ జలాలు రాని ప్రాంతాలకు ప్రకటించిన దొమ్మర్లగొంది ప్రాజెక్టు హామీలకే పరిమితమైంది.

 

‘జనతా వస్త్రాల పథకం’ ప్రకటన విస్మరణ

 సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో బహిరంగ సభలో పాల్గొని నిరుపేదలకు వస్త్రాలు అందించేందుకు జనతా వస్త్రాల పథకం పునరుద్ధరిస్తామని, ఈ పథకం మళ్ళీ ప్రారంభిస్తామని జన్మభూమి సభలో ప్రకటించారు. కోటి కార్డులున్న వారికి ఈ పథకం వర్తింపజేయాలంటే రూ. 600 కోట్లు ఖర్చవుతుందని వెనక్కు తగ్గారు. బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేకుండా చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు నెల్లూరులోని మత్స్యకారుల కోసం తుపాన్లు తట్టుకునేలా ఇళ్ళు నిర్మిస్తామని, ప్రత్యేకంగా మత్య్సకార హార్బర్ నిర్మిస్తామని హామీలిచ్చారు. కానీ వారి సంక్షేమాన్నీ ఈ బడ్జెట్‌లో విస్మరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top