దేవ దేవా..

దేవ దేవా..


ఎస్వీయూ ప్రీ పీహెచ్‌డీ ఫలితాల్లో రిజిస్ట్రార్ జోక్యం  

రెక్టార్ అనుమతి లేకుండా  తుది జాబితా

అర్హతలేని వారిని అందలం ఎక్కించేందుకే..

సంతకం చేసేందుకు నిరాకరించిన రెక్టార్

రాజకీయ ఒత్తిడితో ఎట్టకేలకు పట్టువిడుపు

రిజిస్ట్రార్ తీరుపై వ ర్సిటీ వర్గాల మండిపాటు


 

తిరుపతి తుడా: ఎస్వీయూలో ఓ ఉన్నతాధికారి పరీక్ష ఫలితాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రీ పీహెచ్‌డీలో అర్హత లేని వారికి అందలం ఎక్కించేందుకు ఫలితాల్లో గోల్‌మాల్ చేసి ఏకపక్షంగా విడుదల చేశారు. రెక్టార్ అనుమతి లేకుండా ఫలితాలు విడుదల చేయడం వర్సిటీలో చర్చనీయాంశమైంది. వర్సిటీలో రెక్టార్ ఆమోదం లేనిదే ఎలాంటి ఫలితాలు వెలువడవు. రెక్టార్‌కు ఎలాంటి సంబంధం లేకుండా, కనీసం సంతకం లేకుండా లేకుండా రిజిస్ట్రార్ మేడసాని దేవరాజులు ప్రీ పీహెచ్‌డీ ఫలితాలు వెలువరించారనే ఆరోపణలు కోడై కూస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం కిందట వర్సిటీ ప్రీ పీహెచ్‌డీ ఫలితాలను ప్రకటించారు. రెక్టార్‌ను పక్కన పెట్టి ఫలితాలు విడుదల చేశారని తెలియడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెక్టార్ సంతకం లేకుండా, కనీసం ఆయన అనుమతి కూడా పొందకుండా ప్రీ పీహెచ్‌డీ ఫలితాలను విడుదల చేయడం వర్సిటీ చరిత్రలో ఇదే మొదటిసారి .



ఫలితాలపై అనుమానాలు



ప్రీ పీహెచ్‌డీ ఫలితాల్లో రిజిస్ట్రార్ ఆచార్య దేవరాజులు జోక్యం చేసుకోవడంతో రెక్టార్ ఆచార్య జయశంకర్ ఫలితాల విడుదలకు  నిరాకరించారని తెలుస్తోంది. అర్హతలేని వారికి పట్టం కట్టేందుకే రిజిస్ట్రార్ ఫలితాలను తన వద్దకు తెప్పించుకుని తుది జాబితా తయారు చేశారని సమాచారం. తయారు చేసిన ఫలితాలపై రెక్టార్ సంతకం పెట్టేం దుకు నిరాకరించారని తెలుస్తోంది. రెక్టార్ ప్రమేయం లేకుండానే రిజిస్ట్రార్ ఏకపక్షంగా ఫలితాలను విడుదల చేసినట్టు సమాచారం. ఫలితాలు విడుదల చేశాక రెక్టార్ సంతకం లేదని, ఫలితాలు చెల్లే పరిస్థితి లేదని ఎగ్జామినేషన్‌కు చెందిన మరో అధికారి చెప్పడంతో తప్పును సరిదిద్దే ప్రయత్నం చేశారు.   సంతకం చేయాలని రెక్టార్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఎంతకీ సంతకం చేయకపోవడంతో ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా సోమవారం సంతకం పెట్టించారని సమాచారం. రిజిస్ట్రార్ తీరుపై వర్సిటీ వర్గాలు మండి పడుతున్నాయి. తన వారు, సిఫార్సులు తీసుకొచ్చిన వారిని అందలం ఎక్కించేందుకే ఇలా వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. తనకు పదవి రావడానికి సహకరించిన వారికి కృత జ్ఞతగా ఇలా వ్యవహరించారని వర్సిటీ వర్గాల సమాచారం.

 

వీసీకి తలనొప్పి ..




రిజిస్ట్రార్ దేవరాజులుకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో వర్సిటీలో ఆయన చెప్పిందే వేదంగా మారింది. ప్రీ పీహెచ్‌డీ ఫలితాల విడుదలలో రెక్టార్ ప్రమేయం లేకుండానే రిజిస్ట్రార్ ఏకపక్షంగా వ్యవహరించినా వీసీ ఏమీ చేయలేక పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హత లేని వారికి ఫలితాల్లో అందలం ఎక్కించారని ఫిర్యాదులు అందినా పట్టించుకోవడానికి సాహసం చేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను చెప్పింది వినకుంటే రాజకీయ ఒత్తిళ్లతో తన పంతం నెగ్గేలా రిజిస్ట్రార్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 

 అందరితో చర్చించే విడుదల చేశా..



 వీసీ, రెక్టార్‌లతో చర్చించే ప్రీ పీహెచ్‌డీ ఫలితాలను విడుదల చేశా. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో తొందరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నాను. ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. కావాలనే కొందరు దుష్పచారం చేస్తున్నారు.  ఫలితాల్లో రెక్టార్ సంతకం ఉంది.

 -ఆచార్య మేడసాని దేవరాజులు,

 రిజిస్ట్రార్, ఎస్వీయూ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top