రియల్ దందాకు.. సలాం!


సాక్షి ప్రతినిధి, కర్నూలు : రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సాగునీటి శాఖ అధికారులు సలాం చేస్తున్నారు. రియల్‌దందాకు సహకరించేందుకు వీలుగా ఏకంగా కర్నూలు-కడప (కేసీ) కెనాల్ నుంచి పొలాలను సాగునీరు అందించే ఫీల్డ్ చానల్‌ను మూసేశారు. ఇందుకోసం ఆధునీకరణ అనే పేరును తెరమీదకు తెచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఫీల్డ్ చానల్‌ను మూసివేయడంతో కర్నూలు గ్రామంలో సర్వే నెంబరు 62లో ఉన్న వ్యవసాయ భూములకు సాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా వ్యవసాయ భూములు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాకుండా.. ఈ సర్వే నెంబరులోని వ్యవసాయ భూమికి ఫీల్డ్ చానల్ ద్వారానే దారి ఉండేది. ఫీల్డ్ చానల్ మూతపడిపోవడంతో.. ఈ సర్వే నెంబరులోని వ్యవసాయ భూములకు దారిని కూడా రియల్ దందాదారులు మూసివేశారు. దారి కావాలంటే సెంటు భూమికి రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వక్ఫ్ భూమిని ఆక్రమించుకున్న ధనలక్ష్మీ నగర్ రియల్ ఎస్టేట్ దందాదారులు.. వ్యవసాయ భూమికి నీళ్లు కూడా లేకుండా చేశారు.

 

 బీళ్లుగా మారిన వ్యవసాయ భూములు

 వాస్తవానికి సుంకేసుల రోడ్డులోని కర్నూలు గ్రామంలోని సర్వే నెంబరు 62తో పాటు 215లోనూ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములకు కేసీ కెనాల్ నుంచి ఫీల్డ్ చానల్ ద్వారా సాగునీరు సరఫరా అయ్యేది. అయితే, ఈ సర్వే నెంబర్ల పక్కనే 64 సర్వే నెంబరులో ఉన్న వక్ఫ్ భూములను ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఈ భూములకు దారి లేకుండా చేసేందుకు పథకం పన్నారు.

 

 ఇందులో భాగంగా కేసీ కెనాల్ నుంచి ఈ భూములకు సాగునీరు అందించే ఫీల్డ్ చానల్‌ను ఆధునీకరణ పేరుతో మూసివేయించారన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సర్వే నెంబర్లలోని వ్యవసాయ భూములకు ఈ ఫీల్డ్ చానల్ మీదుగానే దారి ఉండేది. ఈ దారి నుంచే రైతులు తమ బండ్లలో పొలాలకు వెళ్లేవారు. అయితే, ఈ ఫీల్డ్ చానల్‌ను సాగునీటిశాఖ అధికారులు మూసివేశారు. దీంతో క్రమంగా ఈ ప్రాంతాల్లో రైతులు తప్పనిసరిగా పంటలను వేసుకోకుండా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములు కాస్తా పనికిరాకుండా పోయాయి.

 

 వీటి ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారడంతో ఇప్పుడు సర్వే నెంబరు 62లో మాత్రమే వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి ఫీల్డ్ చానల్ మీదుగా ఉన్న దారిని కూడా వక్ఫ్‌భూమిని కాజేసిన రియల్ ఎస్టేట్ దందాదారులు ఆక్రమించేశారు. దీంతో ఈ పొలానికి సాగునీరు లేదు. దారి లేకుండా మూసుకుపోయింది. అయితే, ఈ ఫీల్డ్ చానల్ కింద వ్యవసాయ భూములకు ప్రత్యామ్నాయ సాగునీరును అందిస్తున్నామంటూ సాగునీటిశాఖ అధికారులు చెబుతుండటం విశేషం. ఇక్కడ ఎక్కడా ప్రత్యామ్నాయ సాగునీరు లేకపోవడం గమనార్హం.

 

 పొంతనలేని సమాధానాలు..

 కేసీ కెనాల్ ఆధునీకరణ చేయాలన్న ఉద్దేశంతోనే ఫీల్డ్ చానల్‌ను మూసివేశామని సాగునీటిశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఫీల్డ్‌చానల్ ద్వారా ఉన్న ఆయకట్టులో ఉన్న భూముల్లో హాస్పిటల్స్, అపార్టుమెంట్లు వెలిశాయని.. మిగిలిన వ్యవసాయ భూములకు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సాగునీరు అందిస్తున్నామని సాగునీటిశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఇక్కడ ఇప్పటికీ ఉన్న వ్యవసాయ భూమికి ప్రత్యామ్నాయ సాగునీరు అందించడం లేదు. ఫీల్డ్ చానల్ ఉన్న స్లూయిస్‌కు కూడా అడ్డుకట్ట వేశారు. వీటికి సాగునీటిశాఖ అధికారులు సరైన సమాధానం మాత్రం చెప్పడం లేదు.

 

 సెంటుకు రూ.5 లక్షలు కట్టండి

 సుంకేసుల రోడ్డులోని సర్వే నెంబరు 64లో ఉన్న వక్ఫ్ భూములను ఆక్రమించుకున్న రియల్ దందాదారులు.. మరో కొత్త దందాకూ శ్రీకారం చుట్టారు. ఫీల్డ్ చానల్ మూసివేయడంతో దారి మూసుకుపోయిన వ్యవసాయ భూములు ఉన్న రైతులకు దారి కావాలంటే తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దారి కావాలంటే.. సెంటుకు రూ.5 లక్షలు చెల్లించాలని రైతులను డిమాండ్ చేస్తున్నారు. వక్ఫ్ భూమితో పాటు తమకు ఉన్న దారిని ఆక్రమించేసి.. ఇప్పుడు మళ్లీ తమనే డబ్బులు డిమాండ్ చేయడం దారుణమని రైతులు వాపోతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top