సమరదీక్షకు పోటెత్తిన జనం

సమరదీక్షకు పోటెత్తిన జనం - Sakshi


* అన్ని జిల్లాల నుంచీ భారీ స్పందన

* చంటిపిల్లల్ని ఎత్తుకుని మరీహాజరైన మహిళలు..

* నడవలేకపోయినా వచ్చిన వృద్ధులు.. జగన్‌తో సెల్ఫీలకు యువత ఉర్రూతలు




సాక్షి, విజయవాడ బ్యూరో:  ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమరదీక్షకు జనం సమరోత్సాహంతో కదలివచ్చారు. ఎండ మండుతున్నా పట్టించుకోకుండా చంటిపిల్లల్ని ఎత్తుకుని మరీ అనేకమంది మహిళలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. నడవలేకపోయినా వృద్ధులు దీక్షలో పాల్గొనేందుకు వచ్చారు. రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, సాధారణ జనం తమ సమస్యలు జననేతకు చెప్పుకోవాలని ఎంతో ఆతృత కనబరిచారు. జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు మంగళగిరి వై-జంక్షన్‌లోని దీక్షా వేదికపైకి చేరుకున్నారు.



అప్పటికే సభ మొత్తం జనంతో నిండిపోయింది. వై-జంక్షన్‌తోపాటు సభాప్రాంగణానికి ఒకవైపునున్న జాతీయ రహదారి, మరోవైపునున్న మంగళగిరి రహదారి కూడా జనంతో కిక్కిరిసిపోయింది. దీక్ష ప్రారంభానికంటే రెండు గంటలముందు నుంచి రాత్రి 8 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి వేదికపైనే విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లేవరకూ జనం వస్తూనే ఉన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, జనం వాహనాల్లో దిగి డప్పులు, నృత్యాలతో ప్రత్యేక బ్యానర్లు ప్రదర్శించుకుంటూ ప్రదర్శనగా సభాప్రాంగణానికి వచ్చారు. వచ్చినవారందరికీ జగన్ చిరునవ్వుతో అభివాదం చేస్తూ, దగ్గరకు వచ్చిన వారితో చేయి కలుపుతూనే ఉన్నారు. యువత ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు.



 హైలెట్‌గా ప్రజాబ్యాలెట్

వంగపండు ఉష నేతృత్వంలోని కళాబృందం చంద్రబాబు దొంగ హామీలు, జనాన్ని మభ్యపెడుతున్న వైనంపై ఆలపించిన పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ‘బాబూ. ఓ చంద్రబాబూ..’ అంటూ ముఖ్యమంత్రి మోసాలపై పాడిన పాటకు జనం కేరింతలు కొడుతూ ఈలలు వేశారు. దీక్ష ప్రారంభానికి ముందు సినీనటుడు శివారెడ్డి తన మిమిక్రీతో జనాన్ని అలరించారు. సమరదీక్షలో ప్రజాబ్యాలెట్ హైలెట్‌గా నిలిచింది. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో మచ్చుకు 100 హామీలతో రూపొందించిన బ్యాలెట్ పత్రాన్ని తీసుకుని నింపేందుకు, మార్కులు ఇచ్చేందుకు అందరూ ఆసక్తి కనబరిచారు. నిరక్షరాస్యులు సైతం బ్యాలెట్‌లోని అంశాలను చదివించుకుని టిక్కులు పెట్టడం కనిపించింది.



 కార్యకర్తలే పోలీసులుగా..

 సమరదీక్షకు పోలీసులు సహాయ నిరాకరణ చేసి వదిలేయడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే వేలాదిగా వచ్చిన జనానికి మార్గనిర్దేశం చేశారు. సేవాదళ్ వాలంటీర్లు, కార్యకర్తలు పార్కింగ్ దగ్గరనుంచి జనం ఎటువెళ్లాలో చూపిస్తూ, రద్దీ ఉన్నచోట నియంత్రిస్తూ తొక్కిసలాట జరక్కుండా చూశారు. మహిళలు, పురుషులు వారికి కేటాయించిన గ్యాలరీల్లోకి వెళ్లే దారి చూపిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ తొలిరోజు సమరదీక్ష సజావుగా జరిగేలా చూశారు.



 అన్ని జిల్లాలనుంచీ భారీ స్పందన

 వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీతో పాటు 600 రకాల హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు జనమంతా తరలి రావాలన్న జగన్ పిలుపుకు అన్ని జిల్లాల నుంచీ భారీ స్పందన వచ్చింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు బస్సుల్లో తరలి వచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్షా వేదిక సందర్శకులు, మద్దతుదారులతో కిక్కిరిసిపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top