ఏటా మూడు పంటలు పండే తమ విలువైన భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని, దీనిపై స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు కొందరు ఇటీవల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసి విన్నవించారు.
జనసేన అధ్యక్షుడికి రైతుల వినతి
సాక్షి, హైదరాబాద్: ఏటా మూడు పంటలు పండే తమ విలువైన భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని, దీనిపై స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు కొందరు ఇటీవల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసి విన్నవించారు.
భూములు ఇవ్వబోమన్న రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. గత సాధారణ ఎన్నికల్లో మీరు చెప్పిన మేరకు టీడీపీ, బీజేపీలకు ఓటు వేశామని గుర్తుచేస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులపై స్పందించాలని కోరారు. అన్యాయం ఎక్కడ, ఎప్పుడు జరిగినా ప్రశ్నిస్తానని చెప్పిన మీరు ఇంతమంది ప్రజలు, రైతులు, కూలీలకు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించక పోవటం మంచిది కాదని రైతులు అన్నారు. వారు చెప్పినందంతా విన్న పవన్.. రాజకీయాల గురించి 2017 వరకు మాట్లాడనని, అయితే ప్రజల ఇబ్బందులపై సరైన సమయంలో స్పందిస్తానన్నారు. పవన్‌ను కలిసిన వారిలో యర్రబాలెం, ఉండవల్లి గ్రామాలకు చెందిన రైతు ప్రతినిధులు ఉన్నారు. కాగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పవన్ ప్రాంతాల వారీగా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిసింది.