ఐదు మండలి స్థానాలకు 27న ఎన్నిక


హైదరాబాద్ / న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనమండలిలోని ఐదు ఎమ్మెల్యే కోటా స్థానాలకు ఈనెల 27న ద్వైవార్షిక ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. సభ్యులు రుద్రరాజు పద్మరాజు, సింగం బసవపున్నయ్య, గుండుమల తిప్పేస్వామి, నన్నపనేని రాజకుమారిల పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగియనుంది. దీంతో ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలతో పాటు, ఏపీ శాసనమండలికి మరో ఎమ్మెల్సీ స్థానాన్ని అదనంగా కేటాయిస్తూ.. మొత్తం ఐదు స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. పోలింగ్ అనంతరం ఓట్ల కౌంటింగ్ కూడా ఈ నెల 27న జరగనుంది. శాసనమండలిలోని మొత్తం 90 స్థానాలను రెండు రాష్ట్రాలకు విభజించినప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఏపీకి 17, తెలంగాణకు 14 కేటాయిస్తూ చట్టంలో చేర్చారు.



అయితే సభలో ఏపీకి చెందినవారు ఒకరు తక్కువగా 16 మంది మాత్రమే ఉన్నారు. తెలంగాణలో 14 మందికి గాను ఒకరు ఎక్కువగా 15 మంది ఉన్నారు. ప్రస్తుతం నాలుగు స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు రావడంతో ఏపీకి తక్కువగా ఉన్న ఒక స్థానాన్ని కూడా కలిపి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలోనే ఎన్నికైన సీనియర్ నేత పాలడుగు వెంకటరావు జనవరి 19న మరణించారు. ఆయన పదవీకాలం 2017 మార్చి ఆఖరువరకు ఉంది. ఖాళీ అయిన ఈ స్థానం గురించి శాసనమండలి ఎన్నికల సంఘానికి నివేదించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈ నేపథ్యంలో ఆ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో చేర్చలేదు. రాష్ట్ర ఎన్నికల అధికారులు దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సంప్రదింపులు జరిపారు. అయితే ఎలాంటి స్పందన రాలేదు. ఐదు స్థానాలకు ఇప్పటికే షెడ్యూలు వెలువడినందున ఇక పాలడుగు మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఇందులో చేర్చడానికి అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top