‘కోడి’తే కోట్లే..!


* గోదావరి జిల్లాల్లో మొదలైన కోడి పందేల జాతర

* ముహూర్తం చూసుకుని మరీ బరిలోకి

* కిక్కిరిసిన భీమవరం ప్రాంతాలు

* పోలీసుల ఆంక్షలను లెక్కచేయని వైనం

* రూ.400 కోట్లు దాటనున్న పందేరం

* 3 రోజులూ రేయింబవళ్లూ పందేల జాతరే


 ఏలూరు, సాక్షి ప్రతినిధి: ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంకుల సమరానికి బరులు సిద్ధమయ్యాయి. పందెం రాయుళ్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లలా తర్ఫీదు ఇప్పించిన కోడిపుంజులను గోదాల్లోకి దింపారు. పండగ రోజున వినోదం పేరుతో జరిగే ఈ పందేలకు సోమవారం ముహూర్తం చూసుకుని మరీ తెరలేపారు. ఈసారి పందేలను జరగనిచ్చేది లేదని పోలీసులు చేసిన హడావుడి పైస్థాయి నుంచి ఒత్తిడి ముందు దూదిపింజలా ఎగిరిపోయింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో  పందేలు నిరాటంకంగా జరిగీఖపోతున్నాయి. కోడి పందేలకు పెట్టింది పేరైన పశ్చిమగోదావరి జిల్లాలో అయితే ఎప్పటిమాదిరిగానే పందేల పందేరం జూద మహాసభలను తలపిస్తున్నాయి. పండుగ మూడు రోజులూ రేయింబవళ్లూ పందేలు నిరాటంకంగా జరగనున్నాయి. 

 

 లక్షల్లో పందేలు.. కోట్లలో లావాదేవీలు..

 *    పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరం, భీమవరం పట్టణంలోని ప్రకృతి ఆశ్రమం, భీమవరం మండలంలోని వెంప రాష్ర్టంలోనే భారీగా పందేలు జరిగే ప్రాంతాలుగా గుర్తింపుపొందాయి.

*     వెంపలో సోమవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ముహూర్తం పెట్టి మరీ పందేలను ఆరంభించారు.

*     నిడమర్రు మండలం ఫత్తేపురంలో ఏకంగా 30 ఎకరాల చెరువును ఎండబెట్టి బరిని సిద్ధం చేశారు.

*     ఐ.భీమవరంలోనే ఈ 3 రోజుల్లో రూ.100 కోట్లకుపైగా సొమ్ములు చేతులు మారతాయని అంచనా. ప్రకృతి ఆశ్రమం, వెంపలో రూ.60 నుంచి రూ.70 కోట్ల మధ్య లావాదేవీలు జరుగుతాయని చెబుతున్నారు. వెంపలో సోమవారం సాయంత్రం ఒకే పందెం రూ.12 లక్షలకు జరిగింది.

 *    నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంతోపాటు దాదాపు జిల్లాలోని ప్రతి మండలంలోనూ 10 నుంచి 15 చోట్ల పందేల బరులు ఏర్పాటయ్యాయి. ఉండి మండలం మహదేవపట్నం, జువ్వలపాలెంలోనూ భారీ పందేలు జరుగుతాయి. ఏలూరు సమీపంలోని కాళ్లచెరువు, కొప్పాక, దుగ్గిరాల ప్రాంతాల్లోనూ భారీ పందేలు వేస్తున్నారు.

*  తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి, ఐ.పోలవరం మండలం పెదమడి, కేశనకుర్రు, ఆత్రేయపురం, మెట్ట ప్రాంతంలోని జగ్గంపేట, కిర్లంపూడి ప్రాంతాల్లో కూడా పందేల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు

*  మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో మూడు రోజులు కలిపి రూ.300 కోట్లకుపైగా పందేలు జరుగుతాయని అంచనా వేస్తున్నా, అదికాస్తా ఇప్పుడు రూ.400 కోట్లు దాటుతుందంటున్నారు.

 

 ఇవే పందెం కోళ్లు..

 ఈక రంగును బట్టి పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా డేగ, కాకి రకాలుంటాయి. ఆ తర్వాత నెమలి, పర్ల ఎక్కువగా కనిపిస్తాయి. చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి పలు రకాల కోళ్లుంటాయి. కోడి రంగు, సూర్యుని వెలుగుని బట్టి పందెం రాయుళ్లు రంగంలోకి దిగుతారు.  కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తున్నారు. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం. వీటిల్లో ఎత్తుడు దింపుడు పందేలకు ఎక్కువ క్రేజ్ ఉంటోంది. కోళ్లను తీసుకొచ్చిన వారు కాసే పందేల కంటే వాటిని చూడడానికి వచ్చేవారు కాసే పందేలే వందరెట్లు ఎక్కువగా జరుగుతున్నాయి.

 

 తెలుగు వారి ‘లాస్‌వేగాస్’.. ఐ.భీమవరం

 ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వగ్రామమైన ఐ.భీమవరం కోడిపందేలకు సంబంధించి ‘తెలుగు వారి లాస్‌వేగాస్’ అన్న ఖ్యాతి పొం దింది. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు రూ.70 కోట్ల పందేలు జరుగుతాయని అంచనా. పందేలను చూడ్డానికి వచ్చే వారి తాకిడి ఎక్కువగా ఉం డడంతో భీమవరం పరిసర ప్రాంతాల్లో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ రూములన్నీ 4 నెలల క్రితమే  బుక్ అయిపోయాయి. హోటళ్ల నిర్వాహకులు ఒక్కో రూమ్‌కు రూ. 12 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నారు. భీమవరం చుట్టుపక్కల 200 అతిథిగృహాలు సైతం నిండిపోయాయి.

 

  రూములు దొరకని వారు రాజమండ్రి, ఏలూరు, తణుకు, విజయవాడ తదితర పట్టణాల్లో హోటళ్లు బుక్‌చేసుకుని అక్కడి నుంచి వస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ జిల్లాలతోపాటు కోస్తా జిల్లాల నుంచి సాధారణ వ్యక్తులతోపాటు ప్రజాప్రతినిధులు, రాజ కీయ, పారిశ్రామిక, సినీ రంగాల ప్రముఖులు కూడా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో సోమవారం ఉదయం నుంచి భీమవరం పట్టణం స్తంభించింది. ప్రకృతి ఆశ్రమానికి వెళ్లే రోడ్డు ఖరీదైన కార్లతో నిండిపోయి ముందుకువెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

 

 కత్తి కడితే కనకవర్షమే...

-   కోడికి కత్తి కడితే పందేల నిర్వాహకులకు కనకవర్షమే. నిర్వాహకులు ఒక పందెం సొమ్ములో 10 శాతాన్ని కేవులు(తీతలు)గా వసూలు చేస్తారు. ఒక్కో బరిలో రోజుకు తీతలే రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆ సొమ్ము నుంచే నాయకులకు, పోలీసులకు వాటాలు అందుతుంటాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేల బినామీలే స్వయంగా పందేలు నిర్వహిస్తుండడం గమనార్హం. పశ్చిమలో ఒక ఎమ్మెల్యే ఏటా ఈ సీజన్‌లో పందేల నిర్వాహకుని అవతారం ఎత్తుతున్నారంటే ఏ స్థాయిలో గిట్టుబాటు అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

 

 ‘కత్తుల’ వెనక విషపు క్రీనీడ

-    సంప్రదాయం పేరుతో సాగే కోడిపందేలలో డబ్బే పరమావధిగా మారింది. తరతరాలుగా వస్తున్న పందేలలో పాటించే నీతికి ఎప్పుడో తిలోదకాలిచ్చారు. కాలికి కట్టిన కత్తితో ప్రత్యర్థి పుంజును చిత్తు చేయగలిగిన పుంజునే విజయం వరించడం న్యాయం. అయితే, ఇప్పుడు త్వరగా పందేలు పూర్తిచేసేందుకు, అడ్డదారుల్లో గెలిచేందుకు కత్తులకు విషరసాయనాలు పూసేందుకు కొందరు పూనుకుంటున్నారు. అలాగే బరిలో దిగే కోళ్లకు స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్లు ఇష్టానుసారం వినియోగిస్తుండడం కలవరానికి గురిచేస్తోంది.

 

 పందేలు.. ప్రత్యక్ష ప్రసారం

 నిడదవోలు పాత పటిక ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటుచేసిన బరుల్లో భారీస్థాయిలో టెంట్లు, స్టేడియం తరహాలో గ్యాలరీలు, వీఐపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటుచేశారు. ప్రధానంగా పందేలను దగ్గరనుంచి వీక్షించే వీలులేని వారికోసం ఎల్‌సీడీలు ఏర్పాటుచేసి మరీ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారు. సుమారు 400 కార్లు పార్కింగ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ గార్డులతో వీఐపీ గ్యాలరీలకు భద్రత కల్పిస్తున్నారు. సినీనటులు తనీష్, వెన్నెల కిషోర్, ఆదర్శ్ తదితరులు పందేలను తిలకించేందుకు వచ్చారు.    - న్యూస్‌లైన్, నిడదవోలు

 

 చేతులెత్తేసిన పోలీసులు..

 ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ పందేలు జరగనివ్వమని పోలీసులు జారీ చేసిన హెచ్చరికలు ఉత్తిదేనని మరోసారి తేటతెల్లమైంది. ఉన్నతాధికారులు పందేలను ఆపడానికి విశ్వప్రయత్నం చేసినా పైస్థాయిలో ఒత్తిడి రావడంతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఏలూరు రేంజి ఐజీ విక్రమ్‌సింగ్ మాన్ పందేలను ఆపేందుకు భారీ కసరత్తు చేశారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో పం దేలు జరిగే ప్రాంతాలను ముందే గుర్తించి బరులను స్వాధీనం చేసుకోవడం, అటువెళ్లే దారుల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో ఈసారి పందేలు జరగవేమోనని సోమవారం ఉదయం వరకు జూదగాళ్లు ఆందోళన చెందారు. ఐతే మంత్రులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఉదయం 11 గంటల నుంచి పోలీసులు బరుల నుంచి పక్కకు వెళ్లిపోవడంతో పందేల పందేరం మొదలైంది.

 

 బరిప్రియులకు ఒకరోజు ‘బోనస్’

 ఈ ఏడాది కోడి పందేలను నిలిపివేయాలంటూ పలువురు లోకాయుక్తతోపాటు, హైకోర్టును ఆశ్రయించడంతో పందెంరాయుళ్లు తొలుత కొంత దిగాలుపడ్డారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ పండుగ తరువాతే ఆరంభించడంతో వారి ఉత్సాహం కట్టలు తెగిన గోదావరే అయింది. అంతేకాకుండా ఈ ఏడాది సంక్రాంతి పండుగ రోజులపై.. భోగి 13 తేదీయా, లేక 14నా అనే సందేహం నెలకొనడంతో పందెం ప్రియులకు బోనస్‌రోజూ వచ్చి చేరింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top