దేశంలో సం‘కుల’ సమరం!

దేశంలో సం‘కుల’ సమరం!

  •       చిత్తూరు ఎమ్మెల్యే, మేయర్ మధ్య తారస్థాయికి చేరిన విభేదాలు

  •      అభివృద్ధి పనుల్లో సంప్రదించడంలేదని ఎమ్మెల్యే సత్యప్రభ మండిపాటు

  •      కమిషనర్ బదిలీ వ్యవహారంలోనూ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు

  •      ఇటీవల ఎమ్మెల్యే ఇఫ్తార్ విందుకు మేయర్ వర్గం గైర్హాజరు

  •      మేయర్ వైఖరిపై లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

  • తెలుగుదేశంలో సం‘కుల’ సమరం మొదలైంది. అధికారం చేపట్టిన అనతికాలంలోనే చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ కఠారి అనూరాధ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అభివృద్ధి పనుల్లో తనను సంప్రదించడం లేదని మేయర్‌పై సత్యప్రభ ఆగ్రహంగా ఉండగా.. అభివృద్ధి విషయంలో ప్రతి చోటా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని మేయర్ భర్త కఠారిమోహన్ మండిపడుతున్నారు. ఈ విషయంలో తలెత్తిన వివాదాలు చినికిచినికి లోకేశ్‌కు ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లాయి. దీన్నిబట్టే చిత్తూరులో ఇద్దరు ‘మహిళా సారథుల’ మధ్య వర్గపోరు ఏ స్థాయిలో నడుస్తుందో ఇట్టే తెలుస్తోంది.             

     

    సాక్షి, చిత్తూరు: చిత్తూరు కేంద్రలోని కీలక అధికార పీఠాలను ముగ్గురూ మహిళలే అధిరోహించారు. ఎమ్మెల్యేగా డీకే.సత్యప్రభ, మేయర్‌గా కఠారి అనురాధ, జెడ్పీ చైర్‌పర్సన్‌గా గీర్వాణి అధికార పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇన్నాళ్లు ఏ కార్యక్రమానికి వెళ్లినా ముగ్గురూ కలిసే వెళ్లేవారు. ముగ్గురూ మహిళలే కావడంతో ‘పీఠం మహిళలకు..పెత్తనం మగాళ్లకు’ అనే రీతిలో పాలన సాగుతోంది. జెడ్పీ చైర్‌పర్సన్ వ్యవహారాలను భర్త చం ద్రప్రకాశ్, మేయర్ నిర్ణయాలను ఆమె భర్త కఠారి మోహ న్, ఎమ్మెల్యే సత్యప్రభకు అండగా బద్రీనారాయణ, ఆయన తనయుడు శ్రీనివాస్‌తో పాటు టీడీపీ సీనియర్ నేత దొరబాబు పర్యవేక్షిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చిత్తూరు పాలన వీరి చేతులమీదుగానే నడుస్తోం ది. ఈ అంశమే వివాదాలకు కారణమైంది. అయితే ప్రస్తు తం ఎమ్మెల్యే, మేయర్ మధ్యనే వివాదం నడుస్తోంది.

     

    వివాదానికి బీజం ఇక్కడే

     

    దొడ్డిపల్లె సబ్‌స్టేషన్‌లో సిఫ్ట్ ఆపరేటర్ పోస్టు కోసం ఎమ్మెల్యే, మేయర్ చెరో వ్యక్తిని సిఫార్సు చేస్తూ ఎస్‌పీడీసీఎల్ అధికారులకు లేఖలు రాసినట్టు తెలిసింది. ఎమ్మె ల్యే, ఎంపీలు సిఫార్సు చేసిన వారికే ప్రాధాన్యమిస్తామని అధికారులు చెప్పారు. అయినప్పటికీ మేయర్ తన లేఖ ను వెనక్కు తీసుకోలేదని, దీంతో సత్యప్రభ మండిపాటుకు గురయ్యారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అక్క డి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. అలాగే చిత్తూరు అభివృద్ధి కోసం డీకే.సత్యప్రభ 21 అంశాలతో ఓ నివేదికను తయారు చేసుకుని సీఎం చంద్రబాబును కలిశారు. దీనికి సీఎం ఆమోదముద్ర వేసి, జాబితాలోని అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా చూడాలని ఆదేశించారు.



    ఈ క్రమంలో చిత్తూరు కార్పొరేషన్‌కు సంబంధించి కలెక్టర్, ఎమ్మెల్యే సత్యప్రభ కమిషనర్ రాజేంద్రప్రసాద్‌ను పిలిచి సమీక్ష నిర్వహించారు. దీనిపై మేయర్ భర్త కఠారి మోహన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమకు తెలీకుండా సమావేశానికి ఎలా వెళ్లారని కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.



    అలాగే కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించిన సమావేశంపై మేయర్‌ను ఆహ్వానించక పోవడం, కమిషనర్‌ను పిలవడంపై ఎమ్మెల్యేపై కఠారి మోహన్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కమిషనర్‌ను బదిలీ చేయించాలని మోహన్ గట్టిగా ఉన్నట్టు సమాచారం. కమిషనర్‌ను బదిలీ చేయించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సత్యప్రభ అదేస్థాయిలో స్వరం వినిపించినట్టు తెలిసింది.

     

    మరింత వివాదం రేపిన రూ.5 కోట్ల పనులు

     

    కార్పొరేషన్‌లో శానిటేషన్, వాటర్ ట్యాంకర్లు, పైపులైన్ల తో పాటు పలు పనులకు సంబంధించి రూ.5 కోట్ల టెండర్లను శేఖర్‌బాబు అనే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేందుకు మేయర్ వర్గం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే మంచినీళ్ల సరఫరా టెండర్‌ను దక్కించుకున్న శేఖర్‌బాబుకు తక్కిన పనులు ఈనెల 11న జరగబోయే పాలకవర్గ సమావేశంలో దక్కనున్నాయి.



    ఈ పనులు శేఖర్ బినామీగా కఠారి మోహన్ దక్కించుకుంటున్నారని కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.5 కోట్ల పనులు తమకు తెలీకుండా, తమ ప్రమేయం లేకుండా ఎలా కట్టబెడతారని ఎమ్మెల్యే వర్గం ప్రశ్నించినట్టు తెలిసింది. తమతో చర్చించి నిర్ణయం తీసుకోకుండా ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడగా, తమ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల్లో మీ జోక్యం ఏమిటని ఎమ్మెల్యేపై అదేస్థాయిలో మోహన్ స్పందించినట్టు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది.



    ఈ క్రమంలో గత నెల 27న ఎమ్మెల్యే తన ఇంట్లో ‘ఇఫ్తార్ విందు’ను ఏర్పాటు చేశారు. దీనికి జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు టీడీపీలోని అన్ని వర్గాలు హాజరయ్యాయి. అయితే మేయర్ వర్గం పూర్తిగా గైర్హాజరైంది. ఈ క్రమంలో రెండురోజుల కిందట నారా లోకేశ్‌ను సత్యప్రభ కలిసి మేయర్‌పై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. 5 నెలల పాటు వేచి చూద్దామని లోకేశ్ సూచించినట్టు టీడీపీ జిల్లా కార్యదర్శి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.



    తమ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను సామరస్యంగా చేసుకుంటూ పోతుంటే ఎమ్మెల్యే ఇలా తమపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారని, అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని మోహన్ టీడీపీ నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. రెన్నెళ్లలోనే విభేదాల నడుమ పాలన సాగిస్తున్న వీరు ఐదేళ్ల పాటు ఎలా కలిసి ప్రయాణం సాగిస్తారో వేచి చూడాల్సిందే!

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top