ఇండియా చిప్‌.. ఇంకెప్పుడు?

Published on Mon, 08/03/2026 - 05:25

‘చంద్రయాన్‌–3’విజయాన్ని కోట్ల మంది భారతీయులు సంబరంగా ఆస్వాదించారు. కానీ అందులోని ఇబ్బందికర వాస్తవాల్ని కొందరే అర్థం చేసుకున్నారు. అదేంటంటే ఉపగ్రహంలోని కీలక ఎల్రక్టానిక్‌ వ్యవస్థల్లో వాడిన చాలా సెమీకండక్టర్‌ చిప్‌లు ఇప్పటికీ మన దగ్గర పరిమితంగానే తయారవుతున్నాయి. ఉపగ్రహంలోనే కాదు. మనం వాడే స్మార్ట్‌ ఫోన్లు... ల్యాప్‌టాప్‌లు.. టీవీలు.. కార్లలో కూడా!.  సెమీ కండక్టర్‌ చిప్‌ అంటే ప్రతి ఆధునిక యంత్రానికీ మెదడు. చాలా రకాల చిప్‌లను ఇండియా డిజైన్‌ చేస్తోంది. కానీ తయారు చేయటంలేదు. అందుకే... స్వదేశీ చిప్‌ మన కల. మరి సాకారానికి ఎన్నేళ్లు పడుతుంది? ఎంతవరకూ వచ్చాం? ఇంకెంత దూరం?

సాక్షి, బిజినెస్‌
మనిషి చేసిన అద్భుతం... సెమీకండక్టర్‌ చిప్‌. వందల కోట్ల ట్రాన్సిస్టర్లు.. మైక్రోస్కోపిక్‌ స్విచ్‌లు.. కాంతిని మించిన వేగంతో లెక్కలు.. సైజు మాత్రం వేలిగోటి కన్నా స్వల్పం!. ఇదీ... చిప్‌ స్వరూపం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు డిజిటల్‌ ప్రపంచం యావత్తూ ఈ చిప్‌ల చుట్టూనే తిరుగుతోంది. చిప్‌ కనక లేకుంటే ఫోన్లు.. ఇంటర్నెట్‌.. ఏఐ.. ఎలక్ట్రిక్‌ వాహనాలు.. శాటిలైట్లు.. ఆధునిక రక్షణ వ్యవస్థలు.. ఏవీ లేనట్టే. టెక్నాలజీకి గుండె లాంటి ఈ చిప్‌లను 21వ శతాబ్దపు ఇంధనంగా ఎకనమిస్టులు పోలుస్తున్నది ఇందుకే. సెమీకండక్టర్‌ టెక్నాలజీని నియంత్రించే దేశాలకు ఆర్థికంగా, వ్యూహాత్మంగా అత్యంత ప్రాధాన్యమిస్తున్నది కూడా ఇందుకే.  

ఇండియా వెనకబడిందెక్కడ? 
భారత్‌లో టెకీల సంఖ్య తక్కువేమీ కాదు. వాళ్లలో ఎన్‌విడియా, ఇంటెల్, క్వాల్‌కామ్, ఏఎండీ వంటి చిప్‌ దిగ్గజాల దగ్గర పనిచేస్తున్న వాళ్లూ ఎక్కువే. పైపెచ్చు చిప్‌ డిజైన్లో ఇండియాకు మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న అనేక చిప్‌ల డిజైన్‌లో భారతీయుల పాత్ర ఎంతో కీలకం. మరి తయారీ మాత్రం తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లోనే ఎందుకు జరుగుతోంది? నిజానికి చిప్‌ డిజైన్‌ కష్టమైనదే. కానీ వాటి తయారీ ఇంకా కష్టం. ఆధునిక సెమీకండక్టర్‌ ఫ్యాక్టరీ నిర్మించాలంటే ఆ టెక్నాలజీలో దశాబ్దాల అనుభవం కావాలి. బిలియన్ల కొద్దీ డాలర్లు కావాలి. అత్యాధునిక యంత్రాలు.. అత్యంత స్వచ్ఛమైన నీరు.. నిరంతరాయ విద్యుత్‌... వందలకొద్దీ అనుబంధ పరిశ్రమలు కావాలి. ఎందుకంటే ఒక్క ధూళి కణం కూడా మొత్తం చిప్‌ను దెబ్బతీయగలదు మరి!!. అందుకే అతికొద్ది దేశాలే ఈ తయారీ సామర్థ్యాన్ని సాధించగలిగాయి.  

కోవిడ్‌తో మారిన పరిస్థితి... 
కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన సమయంలో... చిప్‌ల కోసం కొద్దిమందిపై ఆధారపడితే ఎలా ఉంటుందో ప్రతి దేశానికీ తెలిసొచ్చింది. చిప్‌ల కొరతతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఆటోమొబైల్‌ ఉత్పత్తి ఆగిపోయింది. ఎల్రక్టానిక్స్‌ దొరకటం కష్టమైంది. దేశాలు కళ్లు తెరిచాయి. అమెరికా చిప్స్‌ చట్టం తెచ్చింది. యూరప్‌ సొంత సెమీకండక్టర్‌ పాలసీలు ప్రకటించింది. చైనా ఒకవంక ఎగుమతులను నియంత్రిస్తూనే పెట్టుబడులు పెంచింది. భారత్‌ కూడా చిప్‌ల డిజైన్‌కే పరిమితం కాకూడదని నిర్ణయించుకుంది. తయారీలోకి అడుగుపెట్టే ప్రణాళికలు ప్రకటించింది. చిప్‌ల తయారీ రాత్రికిరాత్రే సాధ్యం కాదు కాబట్టే.. ఇండియా దశలవారీగా ముందుకు వెళుతోంది. డిజైన్‌... తయారీ... ప్యాకేజింగ్‌... ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తి అనేవి ఒక్కొక్కటిగా సాధించడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈ ప్రక్రియలు ఒకదానికొకటి దన్నుగా నిలుస్తాయి. 

అడుగులు పడుతున్నాయి... 
దాదాపుగా అంతర్జాతీయ చిప్‌ డిజైన్‌ కంపెనీలన్నిటికీ ఇండియాలో ఇంజనీరింగ్‌ సెంటర్లున్నాయి. వాటిలోని మన టెకీలు స్మార్ట్‌ఫోన్లు, ఆటోమొబైల్స్, కమ్యూనికేషన్‌ పరికరాలు, ఏఐకి ప్రాసెసర్లు డిజైన్‌ చేస్తున్నారు. కానీ డిజైన్‌ పూర్తయ్యాక విదేశాల్లో తయారవుతున్నాయి. ఆ తయారీ చిత్రాన్ని మార్చడానికి దేశంలోనే తొలి కమర్షియల్‌ సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ ప్లాంట్‌ను టాటా ఎల్రక్టానిక్స్‌ సంస్థ గుజరాత్‌లో నిర్మిస్తోంది. తైవాన్‌కు చెందిన పీఎస్‌ఎంసీ దీనికి టెక్నాలజీ అందిస్తోంది. ఆటోమొబైల్స్, పారిశ్రామిక యంత్రాలు, కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌లో వాడే 28ఎన్‌ఎం మెచ్యూర్‌– నోడ్‌ చిప్స్‌ను తయారు చేస్తారు. దీంతోపాటు టాటా సంస్థ అస్సాంలో సెమీకండక్టర్‌ ప్యాకేజింగ్‌ ప్లాంట్‌నూ నిర్మిస్తోంది. 

అంటే గుజరాత్‌లో తయారయ్యే చిప్‌లను అస్సాంలో ప్యాకింగ్‌ చేస్తారన్న మాట. గుజరాత్‌లోనే అమెరికా మెమొరీ చిప్స్‌ దిగ్గజం మైక్రాన్‌ కూడా భారీ ప్లాంట్‌ నిర్మిస్తోంది. ఇక్కడ మైక్రాన్‌ సంస్థ సిలికాన్‌ వేఫర్స్‌ తయారీ బదులు వాటి అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. చెన్నైకి చెందిన ‘సీజీ పవర్‌’కూడా జపనీస్‌ కంపెనీ రెనెసాస్‌ ఎలక్ట్రానిక్స్, థాయ్‌లాండ్‌ సంస్థ స్టార్స్‌ మైక్రోతో జట్టుకట్టి గుజరాత్‌లో చిప్‌ ‘ఓశాట్‌’ప్లాంట్‌ను నిర్మించింది. చిప్‌ల టెస్టింగ్, ప్యాకేజింగ్‌ వంటివి చేసే ఈ ప్లాంట్‌లో వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ఇప్పటికే ఆరంభమైంది. మరోవైపు చైనా దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో హెచ్‌సీఎల్‌ సంస్థ జట్టుకట్టి... డిస్‌ప్లే డ్రైవర్‌ చిప్స్‌ తయారీ ప్లాంటును నిర్మిస్తోంది. ఆటోమొబైల్స్, స్మార్ట్‌ఫోన్లు, టీవీల్లోని డిస్‌ప్లే స్క్రీన్లను ఈ చిప్‌లు నియంత్రిస్తాయి.  

డబ్బుకన్నా... టెక్నాలజీ ముఖ్యం 
భారత్‌లో సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌ తయారీ చేపడతామని గతంలోనే వేదాంతా గ్రూప్‌– ఫాక్స్‌కాన్‌ ప్రకటించాయి. కానీ వారికి సరైన టెక్నాలజీ భాగస్వామి దొరకలేదు. దీంతో ఫాక్స్‌కాన్‌ తప్పుకుంది. ప్రాజెక్టు మూలనపడింది. నిజానికి సెమీకండక్టర్‌ ఫ్యాక్టరీకి డబ్బులకన్నా టెక్నాలజీ ప్రధానం. పెట్టుబడులు ఎలాగైనా వస్తాయి. కానీ టెక్నాలజీ మాత్రం కొందరి దగ్గరే ఉంది. ఉదాహరణకు చిప్‌ల తయారీకి అవసరమైన డిజైన్‌ సాఫ్ట్‌వేర్‌లో (ఈడీఏ టూల్స్‌) కెడెన్స్, సినాప్సిస్, సీమెన్స్‌ వంటి అతికొద్ది సంస్థలదే ఆధిపత్యం.

తయారీకి అత్యంత కీలకమైన లిథోగ్రఫీ యంత్రాలను నెదర్లాండ్స్‌కు చెందిన ఒక్క ఏఎస్‌ఎంఎల్‌ సంస్థే తయారు చేస్తోంది. తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంసీ, దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ వంటి సంస్థలు తయారీ ప్రక్రియలో పట్టు సా«ధించడానికి కొన్ని దశాబ్దాలు శ్రమించాయి. మరి ఇంత క్లిష్టమైన టెక్నాలజీని రాత్రికి రాత్రే కొనుగోలు చేయాలంటే సాధ్యమా? అందుకే భారత్‌ ఈ ప్రక్రియను సొంతంగా ఆది నుంచీ మొదలుపెట్టడం... పునరావిష్కరించడం వంటి ప్రయత్నాలు చెయ్యకుండా అంతర్జాతీయ దిగ్గజాలతో జట్టుకడుతోంది.  

భారత్‌లో ‘చిప్‌’తయారవుతుందా? 
నిజానికి భారత్‌లో చిప్‌ తయారు చేయడానికి, దాన్ని ‘భారతీయ చిప్‌’అనడానికి చాలా తేడా ఉంది. విదేశీ టెక్నాలజీతో... విదేశీ సంస్థల భాగస్వామ్యంతో... వాటి లైసెన్సింగ్‌ ఒప్పందాల ప్రకారమే దేశంలో తొలుత చిప్‌లు తయారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదేమీ అసహజం కాదు కూడా. ఎందుకంటే భారత్‌లో తొలి మారుతీ కారు తయారయ్యింది సుజుకీ సంస్థ టెక్నాలజీతోనే. ఏళ్లు గడుస్తున్న కొద్దీ భారత ఇంజనీరింగ్‌ సామర్థ్యాలు పెరిగాయి. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీ సంస్థలు కూడా కార్ల తయారీలోకి ప్రవేశించాయి. ఇపుడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ ఉత్పత్తిదారులలో ఒకటిగా ఎదిగింది. సెమీకండక్టర్‌ పరిశ్రమ కూడా ఇదే తరహాను అనుసరించే అవకాశముంది. ఎందుకంటే సెమీకండక్టర్‌ వ్యవస్థను నిర్మించడానికి తైవాన్‌ దాదాపుగా నాలుగు దశాబ్దాలు శ్రమించింది.

వేల మంది సప్లయర్లు, యంత్రాల తయారీదారులు, కెమికల్‌ కంపెనీలు, పరిశోధక సంస్థలు సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది కూడా. భారత్‌ ఇపుడు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ అవకాశాలైతే అపారం. ఏఐ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, 5జీ, రోబోటిక్స్, ఆధునిక రక్షణ వ్యవస్థలకు రానున్న దశాబ్దాల్లో వందల కోట్ల అదనపు చిప్‌లు అవసరమవుతాయి. డిమాండ్‌ పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ భారత్‌ డిజైన్‌– తయారీ– ప్యాకేజింగ్‌– రీసెర్చ్‌లతో కూడిన పూర్తిస్థాయి చిప్‌ ఇన్‌ఫ్రాను నిర్మించగలిగితే అది ప్రపంచంలో అత్యంత ప్రధానమైన టెక్నాలజీ హబ్‌గా మారుతుంది. 

ఇదీ... రోడ్‌ మ్యాప్‌ 
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే... భారతదేశంలో 2027–28లో సెమీకండక్టర్ల తయారీ వాణిజ్యపరంగా మొదలయ్యే అవకాశముంది. అది కేవలం ఆరంభమే. అంతర్జాతీయ సంస్థలతో పోటీపడే స్థాయిలో సెమీకండక్టర్‌ పరిశ్రమను నిర్మించాలంటే మరో దశాబ్దానికి పైనే పడుతుంది. కాకపోతే తొలిసారిగా భారత్‌ ఈ రంగంలో వీక్షకుడి స్థాయి నుంచి ఆటగాడి స్థాయికి చేరుకుంది. ట్రాక్‌పై అడుగుపెట్టింది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే త్వరలోనే ఫోన్లమీదే కాకుండా ఫోన్లలోని చిప్‌పై కూడా ‘మేడిన్‌ ఇండియా’అని చూడొచ్చు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)