Breaking News

మానవత్వంపై పాక్‌ దాడి 

Published on Sat, 06/07/2025 - 04:57

కాట్రా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మానవత్వంపై, కశ్మీర్‌ గుర్తింపుపై దాడి చేసిందని నిప్పులు చెరిగారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడం, కశ్మీర్‌  ప్రజల జీవనోపాధిపై దెబ్బకొట్టి నోటిదగ్గర ముద్ద లాగేసుకోవడమే పాకిస్తాన్‌ అసలు లక్ష్యమని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో రియాసీ జిల్లాలోని కాట్రాలో పర్యటించారు. 

రూ.46,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. 272 కిలోమీటర్ల ఉధంపూర్‌–శ్రీనగర్‌–బారాముల్లా రైల్వేలింక్‌(యూఎస్‌బీఆర్‌ఎస్‌) ప్రాజెక్టులో భాగమైన చినాబ్‌ రైల్వే బ్రిడ్జితోపాటు అంజి వంతెన ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. త్రివర్ణ పతాకం చేతబూని చినాబ్‌ బ్రిడ్జిపై కాసేపు నడిచారు. అనంతరం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించారు. చినాబ్, అంజి వంతెనలపై వందేభారత్‌ రైలులో ప్రయాణించారు. 

పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా కాట్రాలో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మన పొరుగు దేశం మానవత్వం, సామాజిక సామరస్యం, ఆర్థికాభివృద్ధికి ముమ్మాటికీ వ్యతిరేకమని ఆరోపించారు. పేదలు పిడికెడు అన్నం తినడం కూడా ఆ దేశానికి ఇష్టం లేదని విమర్శించారు. పర్యాటక రంగం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా ప్రజల మధ్య ఐక్యత పెంచుతుందని తెలిపారు. పర్యాటక రంగాన్ని నాశనం చేసి, కశ్మీర్‌ ప్రజల పొట్టకొట్టాలని చూసిందని పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..  

జమ్మూకశ్మీర్‌లో శాంతి సౌభాగ్యాలు  
‘‘రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులతో జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి. జమ్మూకశ్మీర్‌ ప్రగతిని అడ్డుకోవడానికి పాకిస్తాన్‌ పదేపదే కుట్రలు సాగిస్తోంది. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తుండడం పొరుగు దేశానికి కంటగింపుగా మారింది. అందుకే పహల్గాంలో దాడులకు పాల్పడింది. ఇక్కడ పర్యాటక రంగం కుప్పకూలితే స్థానికులు ఉపాధి కోల్పోతారు. 

పర్యాటకంపై వచ్చే ఆదాయంతో జీవిస్తున్న పేద కుటుంబాలు రోడ్డున పడతాయి. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు అదిల్‌ హుస్సేన్‌ షా ధైర్యంగా ఎదుర్కొంనేందుకు ప్రయత్నించాడు. గుర్రంపై పర్యాటకులను తీసుకెళ్తూ వచి్చన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకొనే ఆ యువకుడు ముష్కరుల దాడిలో బలైపోవడం నన్ను కలచివేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు ఆపరేషన్‌ సిందూర్‌తో గట్టిగా బుద్ధి చెప్పాం. ఇకపై ఆపరేషన్‌ సిందూర్‌ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్‌కు సిగ్గుచేటైన పరాజయమే గుర్తుకొస్తుంది.  

బడి పిల్లలపై బాంబు దాడులా?  
పహల్గాంలో ఉగ్రవాద దాడి జరగ్గానే వేగంగా స్పందించాం. మనం తీసుకున్న చర్యలను పాకిస్తాన్‌ సైన్యం గానీ, ఉగ్రవాద ముఠాలు గానీ ఊహించలేకపోయాయి. పాకిస్తాన్‌ భూభాగంలోకి ప్రవేశించి, ఉగ్రవాదులు మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను నిమిషాల వ్యవధిలోనే శిథిలాలుగా మార్చేశాం. దశాబ్దాలపాటు నిర్మించుకున్న స్థావరాలను నేలమట్టం చేశాం. మన సైనిక శక్తిని తట్టుకోలేక పాకిస్తాన్‌ సైన్యం ఆక్రోశంతో పూంచ్‌తో పాటు సరిహద్దు జిల్లాల్లో దాడులకు దిగింది. స్కూల్‌కు వెళ్లే పిల్లలపై బాంబులు విసిరింది. స్కూళ్లు, ఆసుపత్రులు, ఆలయాలు, మసీదులు, గురుద్వారాలపై దాడులకు పాల్పడింది. మన దేశంలో ప్రజలంతా బాధితులకు అండగా నిలిచారు. పాకిస్తాన్‌ దాడుల్లో మరణించినవారి కుటుంబాలను ఆదుకుంటాం. ఉద్యోగాలు కలి్పస్తాం. ఆర్థిక సాయం అందిస్తాం. బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం చెల్లిస్తాం.  

యువత కలలు సాకారం  
జమ్మూకశ్మీర్‌లో ప్రజలు గతంలో ఉగ్రవాదానికి అలవాటు పడిపోయారు. ఎంతో మంది తమ కలలు వదిలేసుకోవాల్సి వచ్చింది. హింసాకాండను అంతా తమ తలరాత అనుకున్నారు. కానీ, కేంద్రంలో మా ప్రభుత్వం వచి్చన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూకశ్మీర్‌ యువత మళ్లీ కలలు కంటున్నారు, వాటిని సాకారం చేసుకుంటున్నారు.

 జనంతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు, సందడితో వెలిగిపోతున్న షాపింగ్‌ మాల్స్, సినిమా హాళ్లను ప్రత్యక్షంగా చూస్తూ సంబర పడుతున్నారు. ఇక్కడ ఎంబీబీఎస్‌ సీట్లు 500 నుంచి 1,300కు చేరాయి. పహల్గాం లాంటి దాడులతో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. జమ్మూకశ్మీర్‌ యువత కలలను ఛిద్రం చేయాలనుకుంటే అంతకంటే ముందు మోదీని ఎదుర్కోవాలన్న సంగతిని ప్రత్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. 

ఉగ్రవాదానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలని జమ్మూకశ్మీర్‌ యువత నిర్ణయించుకున్నారు. ఉధంపూర్‌–శ్రీనగర్‌–బారాముల్లా రైల్వే లైన్‌ ప్రాజెక్టు నూతన, సాధికార జమ్మూకశ్మీర్‌కు ప్రతీక. భారత నవశక్తికి ఉదాహరణ. చినాబ్, అంజి వంతెనలు జమ్మూకశ్మీర్‌ సౌభాగ్యానికి గవాక్షాలుగా నిలుస్తాయి. ఇక్కడి మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి ప్రయాణంలో కీలక మైలురాళ్లు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి అని తరచుగా అంటుంటాం. రైల్వే ప్రాజెక్టుతో అది వాస్తవ రూపం దాలి్చంది’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.  

ఇంజనీరింగ్‌ అద్భుతం.. చినాబ్‌ వంతెన 
→ జమ్మూకశ్మీర్‌లో చినాబ్‌ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చి బ్రిడ్జిగా రికార్డుకెక్కింది. రూ.1,486 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్లలో ఈ వంతెన నిర్మించారు.  

→ ఇదొక ఇంజనీరింగ్‌ అద్భుతంగా అని చెప్పొచ్చు. చినాబ్‌ నదీ గర్భం నుంచి దీని ఎత్తు 359 మీటర్లు. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కంటే 35 మీటర్లు అధికం.

→ చినాబ్‌ బ్రిడ్జి పొడవు 1.32 కిలోమీటర్లు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, బాంబు పేలుళ్లు, భీకర గాలులను తట్టుకోగలదు. 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించవచ్చు. ఈ వంతెన నిర్మాణానికి 2002లో అనుమతి లభించింది. 2017లో పనులు                మొదలయ్యాయి.  

→ ఈ వంతెన నిర్మాణం కంటే ముందే 26 కిలోమీటర్ల అప్రోచ్‌ రోడ్లు, 400 మీటర్ల పొడవైన సొరంగం నిర్మించారు.  

→ చినాబ్‌ బ్రిడ్జితో జమ్మూ, శ్రీనగర్‌ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. దీని జీవిత కాలం 120 ఏళ్లు.  

తీగల వంతెన అంజి బ్రిడ్జి  
→ అంజి వంతెనకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. చినాబ్‌ బ్రిడ్జి తర్వాత ఇది రెండో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి. ఇండియాలో అత్యంత ఎత్తయిన కేబుల్‌ రైల్వే బ్రిడ్జి ఇదే. నదీ గర్భం నుంచి దీని ఎత్తు 196 మీటర్లు. 2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైంది. 

→ చినాబ్‌కు ఉప నది అయిన అంజి నదిపై నిర్మించారు. ఇది తీగలతో అనుసంధానమైన వంతెన. నిర్మాణానికి పూర్తిగా ఉక్కు ఉపయోగించారు.  

→ దీని మొత్తం పొడవు 725 మీటర్లు. ప్రధాన వంతెన పొడవు 473 మీటర్లు. 82 మీటర్ల నుంచి 295 మీటర్ల పొడవైన 96 ఉక్కు తీగలతో ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యింది.      

ఆయనకు ప్రమోషన్, నాకు డిమోషన్‌  
జమ్మూకశ్మీర్‌కు సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రధాని మోదీని కోరారు. కాట్రా సభలో ఆయన మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తారు. గతంలో పూర్తిస్థాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తాను ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. 

‘‘2014లో మోదీ తొలిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూకశ్మీర్‌కు వచ్చారు. కాట్రా రైల్వే స్టేషన్‌ ప్రారంభించారు. అప్పట్లో నేను జమ్మూకశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నా. మోదీ ప్రస్తుతం మూడోసారి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో మనోజ్‌ సిన్హా రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉండేవారు. ఆయన ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎదిగారు. మనోజ్‌ సిన్హాకు ప్రమోషన్, నాకు డిమోషన్‌ లభించాయి. నాకు త్వరలో పదోన్నతి కలి్పస్తారని ఆశిస్తున్నా’’ అని ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు