Breaking News

గాల్లో నరకం.. ఒక్క క్షణం ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం!

Published on Wed, 08/05/2026 - 12:15

ప్రశాంతంగా సాగుతున్న విమాన ప్రయాణం.. అంతలోనే ఒక్కసారిగా భారీ కుదుపులు. క్షణాల్లోనే ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. లగేజీ బిన్లు తెరుచుకున్నాయి.. క్యాబిన్‌ ప్యానెల్స్‌ ఊడిపోయాయి.. కేకలు, ఆందోళనలతో విమానం భయానక దృశ్యంగా మారింది. ఫుకెట్‌ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులకు జీవితాంతం గుర్తుండిపోయే భయాన్ని మిగిల్చింది.

ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం మంగళవారం థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణం మధ్యలో క్రూజింగ్‌ దశలో ఉన్న సమయంలో విమానం ఒక్కసారిగా తీవ్ర టర్బులెన్స్‌కు(కుదుపు) గురైంది. దీంతో గాయాల పాలైన ప్రయాణికులు.. ప్రాణభీతితో వణికిపోయారు.  

కొందరు ప్రయాణికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎలాంటి ముందస్తు హెచ్చరిక జారీ కాలేదు. హఠాత్తుగా విమానం భారీగా ఊగిపోయింది. ఒక్కసారిగా విమానం కిందకు పడిపోయినట్లు అనిపించింది. కొందరు ప్రయాణికులు సీట్ల నుంచి పైకి ఎగిరి పైభాగాన్ని ఢీకొన్నారు. క్యాబిన్‌లో లగేజీ కిందపడటం, ఓవర్‌హెడ్‌ బిన్లు దెబ్బతినడం, ప్యానెల్స్‌ ఊడిపోవడం వంటి పరిస్థితులు కనిపించాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేయగా.. కొందరు ప్రార్థనలు చేస్తూ కనిపించారు.

మేము బతకమని అనుకున్నాం
ఇటలీకి చెందిన వివియానా అనే ప్రయాణికురాలు తన అనుభవాన్ని వివరిస్తూ.. “ఒక్కసారిగా టర్బులెన్స్‌ మొదలైంది. నా సోదరి సీటు నుంచి గాల్లోకి ఎగిరిపోయింది. నా తల్లి తలకు గాయమైంది. వెనుక కూర్చున్న పలువురికి గాయాలయ్యాయి. ఓ ప్రయాణికుడి ముఖంపై రక్తం కనిపించింది. మేము చనిపోతామని అనుకున్నాం” అంటూ ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంది.

మరో ప్రయాణికుడు మాట్లాడుతూ.. తన తండ్రి సీటు నుంచి పైకి ఎగిరి విమానం పైభాగానికి తగిలి కిందపడ్డారని తెలిపాడు. తన భార్య, రెండేళ్ల చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపడి గాయపడ్డారని, ఈ ఘటన తమకు “పునర్జన్మలా అనిపించింది” అని చెప్పాడు.

వీడియోలు తీయొద్దన్నారు
ఈ ఘటనపై విమానంలో ప్రయాణించిన కంటెంట్‌ క్రియేటర్‌ శిల్పి జైన్‌ సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేశారు. విమానం కూలిపోతుందేమోనని భయపడ్డామని, ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయొద్దని సిబ్బంది కోరారని, ఎయిర్‌లైన్‌ ప్రతిష్ఠ దెబ్బతింటుందని చెప్పినట్లు ఆరోపించారు. ల్యాండింగ్‌ తర్వాత కూడా వెంటనే వైద్య సాయం అందలేదని, కొంతమంది ప్రయాణికులు సహాయం కోసం వేచి చూడాల్సి వచ్చిందని శిల్పి జైన్‌ పేర్కొన్నారు. 

17 మందికి గాయాలు
ఈ ఘటనలో మొత్తం 17 మంది గాయపడగా.. వారిలో నలుగురు క్యాబిన్‌ సిబ్బంది ఉన్నారు. విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయిన తర్వాత గాయపడిన వారిని వైద్య పరీక్షల కోసం తరలించారు. కొందరిని ఆస్పత్రుల్లో చేర్చారు. ఎయిర్‌ ఇండియా స్పందిస్తూ.. ప్రయాణ సమయంలో కొద్దిసేపు తీవ్ర టర్బులెన్స్‌ ఎదురైందని, ప్రయాణికులు, సిబ్బందికి అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపింది. తీవ్రమైన ప్రాణాపాయం లేదని పేర్కొంది. 

ఘటనపై స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు.. ఢిల్లీలోని ఆసుపత్రికి వెళ్లి గాయపడిన ప్రయాణికులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

టర్బులెన్స్‌ ఘటనలు పెరుగుతున్నాయా?
ఇది ఇటీవలి కాలంలో నమోదైన మరో తీవ్రమైన టర్బులెన్స్‌ ఘటన. 2026లోనే ఆస్ట్రేలియా నుంచి హాంకాంగ్‌ వెళ్తున్న క్యాథే పసిఫిక్‌ విమానం తీవ్ర టర్బులెన్స్‌కు గురై 10 మంది గాయపడ్డారు. అంతకుముందు 2025లో డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం తీవ్ర టర్బులెన్స్‌ కారణంగా అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. ఆ ఘటనలో 25 మంది వరకు గాయపడ్డారు. వాతావరణ మార్పులు, గాలి ప్రవాహాల్లో అనూహ్య మార్పుల కారణంగా తీవ్రమైన టర్బులెన్స్‌లు మరింత తరచుగా ఎదురవుతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. 

ప్రయాణికులకు మరోసారి హెచ్చరిక
ఈ ఘటన మరోసారి విమానంలో ఉన్నప్పుడు సీటు బెల్ట్‌ ధరించడం ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. సాధారణంగా విమానం గాల్లో ఉన్నప్పుడు చిన్న కుదుపులు సహజమే అయినా.. ఇలాంటి ఆకస్మిక టర్బులెన్స్‌లు ఊహించని ప్రమాదాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని నిమిషాల గందరగోళం.. 145 మందికి పైగా ప్రయాణికుల జీవితాల్లో మాత్రం మరచిపోలేని భయానక అనుభవంగా మిగిలిపోయింది.

Videos

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

Photos

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)