Breaking News

కేంద్రంపై సమరమే

Published on Tue, 06/09/2026 - 01:37

సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’కూటమి సమరశంఖం పూరించింది. మోదీ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను గట్టిగా తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం సాగించాలని నిర్ణయించింది. నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని కూటమి నేతలు ఏకగ్రీవంగా డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ముసుగులో సాగుతున్న ఓట్ల లూటీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.

ఇండియా కూటమి సమావేశం రెండేళ్ల విరామం తర్వాత సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్విని యోగం, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలపై భవిష్యత్‌ పోరాట కార్యాచరణపై రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. విపక్షాల ఐక్యతను చాటుతూ ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో జరుగనుంది. రాబోయే పార్లమెంట్‌ వర్షాకాల సమా వేశాల్లో సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు. 

ఐక్యతను బలోపేతం చేసుకోవాలి 
మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు కూటమి ఐక్యతను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. దేశంలో రాజ్యాంగంపై దాడి కొనసాగు తోందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి పాల కులు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ధ్వజమె త్తారు. కూటమి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యా సం చేశారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, కొత్త పెట్టుబడులు రావడం లేదని, నూతన ఉద్యోగాల కల్పన జరగడం లేదని చెప్పారు.

పరీక్షల వ్యవస్థలో అక్రమాలు లక్షలాది మంది యువత ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2026 ఏప్రిల్‌ 17న డీలిమిటేషన్‌పై మోడీ ప్రభుత్వ బిల్లులను ఓడించడానికి లోక్‌సభలో ప్రతిపక్షాలు గొప్ప ఐక్యతను ప్రదర్శించాయని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌ పేరిట కోట్లాది మంది పౌరుల నుంచి ఓటు హక్కును లాగేసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.

విదేశాంగ విధానంలో ప్రభుత్వం రాజీ 
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, కొత్త పెట్టుబడులు రాకపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించిందని కూటమి నేతలు పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో ప్రైవేట్‌ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పరీక్షల వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవి నుంచి తప్పుకోవాలని కూటమి పక్షాలు పట్టుబట్టాయి. దశాబ్దాలుగా దేశం పటిష్టంగా పాటిస్తున్న సంప్రదాయ విలువల నుంచి మోదీ సర్కార్‌ పక్కకు జరిగిందని, విదేశాంగ విధానంలో పూర్తిగా రాజీ పడిందని విపక్షాలు ఆక్షేపించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు ఆగడం లేదని మండిపడ్డాయి.

హాజరైన 23 పార్టీల నేతలు 
విపక్ష కూటమి భేటీకి కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్, జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్, సీపీఐ అగ్రనేత డి.రాజా, స్వతంత్ర ఎంపీ కపిల్‌ సిబల్‌ తదితరులు హాజరయ్యారు.

శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. మొత్తం 23 పార్టీల నాయకులు ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు. 2024 జూన్‌ 1న ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఆరో సమావేశం జరిగింది. ఆ తర్వాత సోమవారం అగ్రనేతలంతా ఒకే వేదికపైకి వచ్చారు. విపక్షాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎన్సీపీ(ఎప్పీ) అధినేత శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు.

డీఎంకే, ఆమ్‌ ఆద్మీ పార్టీ గైర్హాజరు 
సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా సమావేశమైన విపక్ష కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ కీలక భేటీకి డీఎంకే, ఆమ్‌ ఆద్మీ పార్టీ హాజరు కాకపోవడం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, డీఎంకేల మధ్య దూరం పెరిగింది. ఇకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామి కాదని డీఎంకే తాజాగా ప్రకటించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ గతంలోనే ఇండియా కూటమికి దూరమైంది. కాంగ్రెస్‌ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.

రాహుల్‌కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం 
ఢిల్లీలోని అక్బర్‌ రోడ్డులో సోమవారం ఉదయం రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్‌ గాంధీకి నిలకడ లేదంటూ శరద్‌ పవార్‌ అన్నట్లుగా ఆ పోస్టర్లలో ముద్రించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోస్టర్లను చించివేశారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు.

ఐదు అంశాలపై అంగీకారం: ఖర్గే 
దేశంలో అస్థిర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ప్రజా సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్‌ చేశారు. సోమవారం ఇండియా కూటమి భేటీ అనంతరం రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్, మమతా బెనర్జీతోపాటు ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు అంశాలపై తాము అంగీకారానికి వచ్చిననట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్‌లో అక్రమాలు, ఓట్ల లూటీ, ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తికి లేఖ రాయబోతున్నట్లు చెప్పారు.

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి కేంద్రం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. ఇకపై ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తబోతున్నామని, దీనికి కూటమి పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయని ఖర్గే పేర్కొన్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో సమన్వయంతో పనిచేస్తామని, ప్రతిరోజూ ఉదయం విపక్ష నేత చాంబర్‌లో తమ భేటీ జరుగుతుందని వెల్లడించారు.  

ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ 
    2029 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేరును ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్‌) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ సోమవారం సూచించారు. బీజేపీ వ్యతి రేక కూటమి ఐక్యంగా ఉందని, రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనే భవిష్యత్‌ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామని తెలి పారు. ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి రాబోయే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పారు. అవినీతిపరులను, దోపిడీదార్లను అధికారం నుంచి దించేయడమే ప్రజల ఎజెండా అని స్పష్టంచేశారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)