Breaking News

సీమకు తలమానికం తిరునగరి

Published on Tue, 02/24/2026 - 00:58

చరిత్రను తెలుసుకోవడం అంటే గతాన్ని గుర్తుచేసుకుని భవిష్యత్తును నిర్ణయించు కోవడం. గతం లేనిదే వర్తమానం ఉండదు, వర్తమానం లేని భవిష్యత్తును ఊహించుకోలేము.  ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి నగరానికి ఘనమైన నేపథ్యం ఉన్నది. అలాంటి తిరుపతికి అంకురార్పణ జరిగి నేటికి 896 సంవత్సరాలు. తిరుపతి నగరానికి అనుకుని ఉన్న ప్రస్తుత తిరుచానూరులోని వేంకటేశ్వర స్వామి ఆలయం, పార్థసారథి ఆలయం చోళుల కాలంలో రూపొందితే, అటుపిమ్మట పద్మావతి అమ్మవారి ఆలయం వెలసింది. శ్రీ శుకమహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకుని తపస్సు చేసిన కారణంగా తిరుశుకనూరుగా పిలిచే వారనీ, అటుపిమ్మట కాలక్రమంలో తిరుచానూరుగా మారిందనీ అంటారు. నారాయణవనం కేంద్రంగా పాలన సాగించిన ఆకాశ రాజు కుమార్తె పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నారు. వివాహమనంతరం 6 నెలల దీక్షా కాలాన్ని శ్రీనివాస మంగాపురంలో గడిపారు. దీక్షా కాలం తర్వాత శ్రీనివాసుడు తిరుమల వెళ్ళారు. ఆకాశరాజు సోదరుడు తొండమాన్‌ చక్రవర్తి కాలంలో శ్రీనివాస మంగాపురం ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. 

ఆధ్యాత్మిక అనుబంధమే పునాది
చారిత్రక ఆధారాల ప్రకారం, 1130 ఫిబ్రవరి 24న రామా నుజాచార్యుల నిర్ణయం మేరకు గోవింద రాజపురం ఆగ్రహారం నిర్మాణానికి పునాది వేశారు. అంటే నేటి తిరుపతి... గోవింద రాజపురంగా పునాది వేసుకుంది. అటు పిమ్మట గోవిందరాజ ఆలయం, దాని చుట్టూ అగ్రహారం నిర్మాణం నారాయణవనం రాజ్య పాలకుడు గట్టురాజు చేపట్టారు. తర్వాత 100 సంవత్సరాలకు ఇది తిరుపతిగా రూపాంతరం చెందింది. తిరుమల శ్రీవారి ఆలయ గోపురం, శ్రీనివాస మంగాపురంతో సహా అనేక ఆలయాలకు గోపురాలు, అభివృద్ధి పనులు యాదవ రాజుల కాలంలో జరిగాయి. అందుకే టీటీడీ ఆలయాలలో యాదవులకు తొలి దర్శన అవకాశం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.

తిరుపతి రూపుదిద్దుకుంటున్న ప్రారంభంలో తాళ్ళపాక వాసుల కృషి మరువలేనిది. శ్రీవారి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో అన్నమయ్య కీర్తనలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే తాళ్ళపాకకు చెందిన తాతయ్య తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వెలిసిన గంగమ్మ ఆలయానికి ఆద్యులు. అందుకే ఈ ఆలయాన్ని తాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయం అని అంటారు. తాళ్ళపాక వాసులు శ్రీనివాస మంగాపురం ఆలయ అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నట్లు చెపుతారు. తాతాచార్య వంశస్థులు తాతయ్య గుంట గంగమ్మ ఆల యానికి ఆద్యులు. వీరికి తొలి తీర్థం ఇస్తారు. తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు ఏడుసార్లు తిరుపతి పర్యటన చేశారు. తిరుపతి, తిరుమల, తాను పర్యటించిన నాగలాపురం, నారాయణవనంలో ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి తల్లి నాగులాంబ పేరుతో నాగులాపురం ఆలయాన్ని నిర్మించారు.

మహానగరంగా మార్చే అవకాశం
తిరుపతి, తిరుమల అంటూ ప్రస్తుతం పిలుచుకుంటున్నాం. కానీ చరిత్రను పరిశీలిస్తే రెండూ వేరు వేరు కాదని అర్థం చేసు కోవచ్చు. తిరుపతి నగరం స్వతంత్రం వచ్చే వరకు నార్త్‌ ఆర్కాట్‌ జిల్లా పరిధిలో ఉన్నది. నేటి కొండను పురాణాలలో వెంగడం అని పిలిచేవారు. పులికాట్‌ పరిసరాలను పాలించిన ప్రాంతానికి వెంగో రాష్ట్రం అన్న పేరు కూడా ఉంది. తిరుపతి, తిరుమలపై తమిళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో తిరుపతి గానే పిలిచేవారు. తిరు అంటే శ్రీ అని అర్థం. పతి అంటే శ్రీనివాసుడు యజమాని అని. ఆ రకంగా శ్రీనివాసుడి అజమాయిషీలో తిరుపతి ఉంటుంది. ఎంత బాగుంది ఈ పిలుపు! చాలా కాలం వరకు తమిళంలో మేల్‌ తిరుపతి, కీల్‌ తిరుపతి (కింద తిరుపతి, పైన తిరుపతి) అని పిలిచే వారు. క్రమేణా కొండ అర్థం వచ్చేలా తిరుమలగా మారింది. 

తిరుపతిని అభివృద్ధి చేయడం అంటే శ్రీనివాసుడి అజమాయిషీలో ఉన్న ఆధ్యాత్మిక నగరాన్ని అభివృద్ధి చేయడమే. చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం తెలియనివారు తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వెచ్చిస్తే అనవసర వివాదం చేస్తుంటారు. ఏపీ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన పరిశీలనలో రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు, ఉన్నవన్నీ గ్రామీణ పరిధి దాటని పట్టణాలు అని పేర్కొంది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతోంది అనడానికి మంచి నగరాలుండటం ఒక కొలమానం. వెనుకబడిన రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం కూడా లేకపోతే ఇక అభివృద్ధికి ఆస్కారం ఎక్కడిది? ఈ వెలితిని తీర్చి మహానగరంగా మార్చగలిగే అవకాశం తిరుపతికి ఉన్నది. తిరుపతి నగరానికి అనుకుని చెన్నై, బెంగళూరు మహా నగరాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, భూమి సమస్య ఆ రెండు నగరాలకు ప్రతిబంధకంగా మారింది. 

ఆ ప్రతిబంధకమే తిరుపతి నగర అభివృద్ధికి అవకాశంగా మారుతుంది. తిరుపతి చుట్టూ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో పాటు... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు ఉన్నాయి. చెన్నై నగరానికి సమీపంలో మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన శ్రీసిటీ ప్రత్యేక అర్థిక మండలి ఆసియా ఖండంలోనే అత్యంత విజయవంతం అయిన సెజ్‌గా మారింది. వాతావరణ సమతుల్యత అదనపు అనుకూలత. అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తిరుపతిని అత్యంత సౌకర్యవంతమైన నివాస యోగ్య నగరంగా గుర్తించాయి. తిరుపతి నగర పాలక సంస్థ తీర్మానం చేసినట్లు... చంద్రగిరి, కళ్యాణి డ్యామ్, వడమాల పేట, రాయలచెరువు, ఐఐటీ వరకు తిరుపతిని గ్రేటర్‌గా మార్చి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే అనతి కాలంలోనే మరో హైదరాబాద్‌గా మారుతుంది.

తొలి దర్శనం నుంచి ప్రథమ పౌరురాలి వరకు...
వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను ప్రస్తావించడానికి ఇది సరైన సమయం. విజయనగర రాజుల తర్వాత యాదవ రాయలు తిరుపతి ఆలయాల అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించారు. శ్రీవారి ఆలయం ముందు భాగాన గొల్లమండపం నిర్మించి, గోవుల పెంప కంతో శ్రీవారి నైవేద్యానికి ఆ పాలను వినియోగించే వారని అంటారు. వివిధ కొలనులను వారి హయాంలోనే నిర్మించినట్లు ఆధారాలు కనిపిస్తాయి. దైవ దర్శనంలో కోనేటి స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో  తెలిసిందే. అందుకే శ్రీవారి ఆలయాలలో తొలి దర్శనం యాదవ వంశస్థులకు ఇస్తారు. అయితే ఈ సంప్ర దాయానికి సాధికారత ఇచ్చింది మాత్రం జగన్‌ గారే. 

అదే సామాజిక వర్గానికి చెందిన శిరీష యాదవ్‌ను తిరుపతి నగరానికి తొలి మేయర్‌గా చేసిన ఘనత కూడా జగన్‌కే దక్కుతుంది. అది కూడా జనరల్‌ మేయర్‌ స్థానంలో బీసీలకు ఇవ్వాలనే నిర్ణయమూ, తిరు పతి అంకురార్పణలో కీలక భూమిక పోషించిన యాదవ సామాజిక వర్గానికి రాజకీయ గుర్తింపు ఇవ్వడమూ సముచిత నిర్ణయం. ఎంతో స్ఫూర్తినిచ్చే తిరుపతి నగర ఆవిర్భావ చారిత్రక సత్యాన్ని తన అధ్యయనం ద్వారా అందించిన చరిత్రకారుడు దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించి ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించిన నాటి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి అభినందనీయులు. 

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)