Breaking News

తలొగ్గుతారా? తయారు చేస్తారా?

Published on Tue, 06/17/2025 - 00:19

పరిస్థితి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇరాన్‌ ఎదుట మిగిలిన మార్గాలు రెండే! అమెరికా, ఇజ్రాయెల్‌ల ఒత్తిడికి లొంగిపోయి జీవించటమా? లేక స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవించటం కోసం అణ్వాయుధాలను తయారు చేసుకోవటమా? అణ్వస్త్ర తయారీని ఇరాన్‌ కోరుకోవటం లేదు. అటువంటి సామూహిక హనన శక్తి గల ఆయుధ ఉత్పత్తి ఇస్లాం బోధనలకు విరుద్ధమనే సైద్ధాంతిక వైఖరి తీసుకున్న ఇరాన్‌ అధినేత అయతొల్లా ఖొమేనీ ఆ మేరకు ఆదేశాలు ఎన్నడో జారీ చేశారు. అణుశక్తిని శాంతియుత అవసరాల కోసమే ఉపయోగించగలమని పలుసార్లు ప్రకటించారు. కానీ అమెరికా శిబిరానికి మౌలికంగా ఇరాన్‌ పట్లనే శత్రుత్వం ఉంది. అక్కడ అణు పరిశోధనలన్నవి సాకు మాత్రమే!

అమెరికా అండతోనే...
ఒకసారి ఇటీవలి పరిణామ క్రమాన్ని చూద్దాం. అణు పరిశోధ నలు, వాటి పరిమితుల విషయమై ఇరాన్, అమెరికాల మధ్య ఖతార్‌లో అయిదు విడతల చర్చలు జరిగాయి. ఆరవ విడత ఈ నెల 15న జరగాల్సి ఉండగా, రెండు రోజుల ముందు 13న ఇజ్రాయెల్‌ దాడులు మొదలయ్యాయి. దాడుల గురించి తమకు ముందే తెలుసు నని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జూన్‌ 14న స్వయంగా ప్రకటించారు. తాము అమెరికాతో సమన్వయం చేసుకునే దాడులు చేస్తున్నా మని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ అంతకుముందు 13 నాడే అన్నారు. 

తమ ఇంటెలిజెన్స్‌ సమాచారంతో, తాము సరఫరా చేస్తున్న ఆయుధాలతోనే దాడులు సాగుతున్నాయని ట్రంప్‌ 14న వెల్లడించారు. దాడులకు రెండు రోజుల ముందే అమెరికా ప్రభుత్వం పశ్చి మాసియా ప్రాంతంలోని తమ పౌరులకు, దౌత్య కార్యాలయాలకు జాగ్రత్తలు చెప్పి, తమ సైనిక స్థావరాలకు తగు హెచ్చరికలు చేసింది. అయినా తమకు దాడులతో నిమిత్తం లేదని వాదిస్తున్నది.

దీన్ని బట్టి కొన్ని ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి.  పాల స్తీనాతో ముడిబడిన చర్యలకు ఇరాన్‌ మిత్ర సంస్థలు ఇతర భూభాగాల నుంచి దాడులకు పాల్పడుతుండటం, వాటిపై ఇజ్రాయెల్‌ ప్రతి చర్యలు కొత్తవి కాదు. అవి ఎట్లున్నా, అణు పరిశోధనల విషయమై ఇరాన్‌ – అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి ఈ 15 నాటి ఆరవ విడతలో ఫలించే అవకాశం ఉందని ట్రంప్‌ సైతం కొద్ది రోజులుగా అంటూ వస్తున్నారు. 

ఇదంతా నెతన్యాహూకు తెలిసినదే. అటువంటపుడు చర్చలకు సరిగ్గా రెండు రోజుల ముందు దాడులే మిటి? ఈ ప్రశ్నలపై నిపుణుల నుంచి రెండు అభిప్రాయాలు విన వస్తున్నాయి. ఒకటి, అమెరికా–ఇరాన్‌ చర్చలను, ఒకవేళ పరిష్కారం కుదిరే అవకాశం ఉంటే దానిని భంగపరచటం కోసమే ఇజ్రాయెల్‌ ఆ పని చేసిందన్నది. రెండు, ముందస్తు దాడులతో ఇరాన్‌ను భయపెట్టి చర్చలతో దారికి తెచ్చుకోవటం ట్రంప్‌ ఎత్తుగడ అన్నది. ఈ రెండింటిలో దేనికి అదిగా నిజం కాగల అవకాశాలు ఉన్నాయి కూడా. ఇరాన్‌తో రాజీ ఇజ్రాయెల్‌కు ఎంత మాత్రం ఇష్టం లేనిది. 

అందుకోసం వారు అమెరికానైనా ధిక్కరించగలరు. ఎందుకంటే, పాలస్తీ నాకు నిజమైన మిత్ర దేశంగా మిగిలింది ఆ ప్రాంతంలో ఇరాన్‌ ఒక్కటే. వేర్వేరు అరబ్‌ దేశాలను అమెరికా ద్వారా మిత్రులుగా మార్చుకుంటున్నా, ఎంత మాత్రం రాజీ పడనిది ఇరాన్‌ మాత్రమే. కనుక దానిని ధ్వంసం చేయాలి. అమెరికాకు సంబంధించి, ఇజ్రా యెల్‌తో వైరాన్ని వదిలి, పాలస్తీనా కోసం పట్టుబట్టనట్లయితే సరి పోతుంది. ఆ విధంగా ఇజ్రాయెల్, అమెరికాల  మధ్య కొద్దిపాటి వ్యత్యాసం ఉంది.

వైఖరుల్లో తేడా!
అణుశక్తి విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇరాన్‌ అణుశక్తి పరిశో ధనలు ఒక పరిమితికి లోబడి జరగాలని, అణ్వాయుధాల ఉత్పత్తికి అవసరమయ్యే యురేనియం 90 శాతం శుద్ధి జరగరాదని 2016లో ఇరాన్‌కు, అమెరికా తదితర దేశాలకు మధ్య అంగీకారం కుదిరింది. అందుకు బదులు ఇరాన్‌పై ఆంక్షలు సడలించాలన్నారు. కానీ రెండేళ్ల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్‌ కూడబలుక్కోవటంతో ఆ ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకుంది. 

అప్పుడు కూడా అధ్యక్షుడు ట్రంప్‌. అప్పటినుంచి ఈ ఏడేళ్లుగా అణు రాజకీయం నడుస్తూనే ఉంది.  అణ్వస్త్రాల కోసం యురేనియంను 90 శాతానికి, అంతకన్నా మించి శుద్ధి చేయవలసి ఉంటుంది. శాంతియుత అవసరాలకు అంత కులోపు అయితే సరిపోతుంది. ఇరాన్‌ కేంద్రాల్లో ప్రస్తుతం శుద్ధి 60 శాతంగా ఉంది. ఆ మాట ఇరాన్‌ ప్రభుత్వం చెప్పటమే కాదు అణుశక్తి సంస్థ కూడా ధ్రువీకరించింది. 

అయినప్పటికీ ఇజ్రాయెలీ నిఘా సంస్థలు మాత్రం తొమ్మిది అణ్వస్త్రాలకు కావలసినంత శుద్ధి ఇప్పటికే జరిగిపోయిందనీ, త్వరలో పదిహేనింటికి జరుగుతుందనీ ప్రచారం మొదలు పెట్టాయి. గమనించదగినదేమంటే అమెరికా మాత్రం ఈ మాట నేటికీ అనటం లేదు. ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేయ కూడదనేది ఒక్కటే తమ షరతని ప్రకటిస్తోంది. 

ఈ విషయమై ఇజ్రాయెల్, అమెరికా వైఖరుల మధ్య తేడా కనిపిస్తుంది. కనీసం శాంతియుత ప్రయోజనాల కోసమైనా సరే ఇరాన్‌ పరిశోధనలు ససేమిరా చేయరాదని, స్వయంగా శుద్ధి చేయక పోవటమేగాక, పరిమిత శుద్ధి గల ఇంధనాన్ని అయినా ఇతరుల నుంచి దిగుమతి చేసుకునేందుకు వీలు లేదన్నది ఇజ్రాయెల్‌ వాదన. ట్రంప్‌ వైఖరిలో ఇతర అంశాలకు సంబంధించి వలెనే ఇందులోనూ చంచలత్వం కనిపిస్తుంది. ఒకవేళ ఖతార్‌ చర్చలు సాగి ఉంటే అంగీ కారం ఏదైనా కుదిరేదేమో తెలియదు. 

అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయబోమని మాత్రం ఇరాన్‌ స్పష్టం చేస్తోంది. తాము జోక్యం చేసుకుని ఏదైనా మధ్యే మార్గానికి ప్రయత్నించగలమని రష్యా కూడా అంటున్నది. ఇపుడు అకస్మాత్తుగా ఇజ్రాయెల్‌ దాడులు చేయటంతో, అందుకు అమెరికా తోడ్పడినట్లు ట్రంప్‌ మాటలలోనే కనిపిస్తుండటం వల్ల, తాము చర్చలకు 15న వెళ్లబోవటం లేదని ఇరాన్‌ ప్రకటించింది. అదే సమయంలో, ఇది శాశ్వత బహిష్కరణ అనక పోవటం గమనించదగ్గది. ఇరాన్‌ నిజాయతీని, దౌత్య మార్గంలో పరిష్కారానికి కట్టుబడటాన్ని అది చెప్తున్నది.

రహస్య అణు కేంద్రాలు?
అయితే, ఇరాన్‌ అణుశుద్ధి అణ్వస్త్ర తయారీ గురించి చెప్పు కోవలసినవి మరికొన్ని ఉన్నాయి. యురేనియం శుద్ధి 90 శాతం మేర ఇప్పటికే జరిగిందనేందుకు ఎటువంటి ఆధారాలూ అమెరికన్ల వద్ద సైతం లేవు. అణు ఇంధన సంస్థ కూడా ఆ మాట అనటం లేదు. కానీ, ఇరాన్‌ తమకు చూపకుండా దాచి పెడుతున్న విభాగాలు కొన్ని ఉన్నాయని ఆ సంస్థ అంటున్నది. ఆ మాట నిజం కాదని ఇరాన్‌ కూడా ఖండించటం లేదు.  

ఇజ్రాయెల్‌ దాడుల దరిమిలా ఒక కొత్త విషయం వెల్లడించారు. అది, ఎవరికీ తెలియని మరొకచోట కూడా శుద్ధి కేంద్రం నిర్మిస్తున్నామని! ఇవన్నీ నిజమైనా, చివరకు వారు అణ్వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారనుకున్నా, ఇజ్రాయెల్, అమెరికా సహా ఎన్నో దేశాలకు భారీ సంఖ్యలో అణ్వస్త్రాలు ఉన్నపుడు, తన రక్షణ కోసం ఇరాన్‌ మాత్రం ఎందుకు తయారు చేసుకోరాదన్నది మౌలికమైన ప్రశ్న. 

ఉత్తర కొరియా ఉదాహరణ ఇపుడు మరోసారి చర్చకు వస్తున్నది. అదే విధంగా ఇరాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నట్లయితే దాడికి ఇజ్రాయెల్, అమెరికాలు సాహసించగలవా? అణువ్యాప్త నిరోధక ఒప్పందాలను ఉల్లంఘించి, ఇజ్రాయెల్‌ అణ్వస్త్ర తయారీకి రహస్యంగా సహకరించింది అమెరికా, యూరప్‌లు కాదా? 

ప్రస్తుత యుద్ధానికి వస్తే, అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయెల్‌ ఏకపక్ష విధ్వంసాలు సృష్టించగలగటం వట్టి మాట అని ఇరాన్‌ తన ఎదురు దాడులతో రుజువు చేస్తున్నది. ఇజ్రాయెల్‌ ఎంతో ఘనంగా చెప్పుకునే ఐరన్‌ డ్రోమ్‌ బలహీనతలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ వైమానిక బలం మహాశక్తిమంతమైనదే గానీ, రెండవరోజు నుంచి కూడదీసుకున్న ఇరానియన్‌ రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలను కూల్చివేయటం మొదలైంది. 

బహుశా వీటన్నింటి కన్నా ముఖ్యమైన వార్తలు, ఇరాన్‌ అణు కేంద్రాలకు ఇజ్రాయెల్‌ దాడులతో వాటిల్లిన నష్టం స్వల్పమైనదేనని, భూగర్భంలో, కొండ లలో చాలా లోతున గల కేంద్రాలు యథాతథంగా ఉన్నాయన్నది. ఇరాన్‌ చివరకు అణ్వస్త్రాలు ఉత్పత్తి చేయక తప్పదా?

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు