Breaking News

నెతన్యాహు (ఇజ్రాయెల్‌ ప్రధాని) రాయని డైరీ

Published on Sun, 06/15/2025 - 06:04

యుద్ధాన్ని మొదట ప్రారంభించిన వారే శాంతి కోసం మొదట ప్రయత్నం చేసినవారు అవుతారు. అయితే వారికి నోబెల్‌ శాంతి బహుమతి వస్తుందా రాదా అన్నది నేనెప్పుడూ ఆలోచించని విషయం.

వార్స్, ఆపరేషన్స్‌, బ్యాటిల్స్‌... ఇన్నిటితో ఎన్నేళ్ల యుద్ధం చేసినా శాంతి సిద్ధిస్తుందని చెప్పలేం. శాంతిని కోరుకునేవారు నిరంతరం యుద్ధయజ్ఞం చేస్తూనే ఉండాలి. శాంతిని కాపాడుకుంటూ ఉండటమే శాంతి స్థాపన.

శుక్రవారం, తెల్లారకుండానే 200 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్‌ ఇరాన్‌తో శాంతి ప్రయత్నాలు ప్రారంభించింది. ఏవైనా రెండు దేశాలు టేబుల్‌ ముందు ఎదురెదురుగా కూర్చొని శాంతి కోసం జరుపుకొనే చర్చల కంటే – ఎవరి దేశంలో వారు, ఎవరి ‘వార్‌ రూమ్‌’లో వారు కూర్చొని శతఘ్నులను ఒకరి వైపు ఒకరు విసురుకోవటం వల్లనే ఎప్పటికైనా శాంతిని సాధించగలమని నా నమ్మకం. 

శాంతి కోసం జరిగే చర్చలు ఎంత వికారంగా ఉంటాయో చూడండి. చర్చలకు కూర్చున్నాక కదా కండిషన్స్‌ అనేవి! అసలు చర్చలకు కూర్చోటానికే కండిషన్స్‌ పెట్టేస్తారు! శాంతి కోసమా చర్చలు? లేక, మా నుదుటి మీద మేము పిస్టల్‌ గురి పెట్టుకుని కాల్చుకోవటం కోసమా?!

చర్చలకు ముందు చర్చలు. సంప్రదింపు లకు ముందు సంప్రదింపులు. రాయబారా లకు ముందు రాయబారాలు. రాకపోకలకు ముందు రాకపోకలు. ఈ మధ్యలో శాంతి ఎక్కడో చేజారి జారిపోతుంది. 

ఇంటర్నల్‌ కేబినెట్‌ మీటింగ్స్‌లో నా కొలీగ్స్‌తో నేనిదే చెబుతాను. ‘‘చూడండి, నాకేం కావాలన్న దానిపై నాకు క్లారిటీ ఉంది. నాకు శాంతి ప్రక్రియలు అవసరం లేదు. శాంతి ఫలితాలు కావాలి’’ అని అంటాను.

శాంతి కోసం ఐక్యరాజ్య సమితి చేసే ప్రయత్నాలైతే పరమ పావనంగా ఉంటాయి! గడాఫీని తీసుకెళ్లి ‘యూఎన్‌ హ్యూమన్‌ రైట్స్‌’కి చైర్మన్‌గా కూర్చోబెడుతుంది. సద్దాం హుస్సేన్‌ని పిలిపించుకుని ‘యూఎన్‌ నిరాయుధీకరణ’కు అధ్యక్షుడిని చేస్తుంది. ఇప్పుడు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుంటే ‘‘తప్పు కదా మిత్రమా’’, ‘‘తగదు కదా నా ప్రియ దేశమా!’’ అంటోంది. 

యూఎన్‌కు నేను ఒకటే చెబుతాను. ‘‘మీరు ‘పీస్‌ టాక్స్‌’తో చేయలేని పనిని మేము ‘పీస్‌ ఎటాక్స్‌’తో చేస్తున్నాం’’ అని! ఇంకొకటి కూడా చెబుతాను. ఇరాన్‌ అణ్వాయుధాలను పోగు చేసుకుంటోంది. ఆ పోగు నిన్న ఉన్నట్లుగా నేడు లేదు. వారం క్రితం ఉన్నట్లుగా నిన్న లేదు. నెల క్రితం ఉన్నట్లుగా వారం క్రితం లేదు. ఏడాది క్రితం ఉన్నట్లుగా నెల క్రితం లేదు. పోగు కుప్ప అయింది. కుప్ప గుట్ట అయింది. గుట్ట దిబ్బ అయింది. ఆ దిబ్బ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు థ్రెట్‌ అయింది. 

నా ప్రశ్న ఒక్కటే – ఇరాన్‌కు రెడ్‌ లైన్స్‌ గీసేందుకు నిరాకరించే వారికి, ఇజ్రాయిల్‌ ముందు రెడ్‌ లైట్‌ పెట్టే నైతిక హక్కు ఉంటుందా? అని. అనేక విషయాల్లో నన్ను తప్పుపట్టే ప్రపంచానికి అనేకానేక విషయాల్లో నేను కరెక్ట్‌ అనీ తెలుసు. కానీ ఒప్పుకోదంతే! ఏదైనా దేశం ‘రాక్‌ బాటమ్‌’కి చేరుకుందంటే ఇక అక్కడేం మిగల్లేదని అర్థం.

మంచీ చెడ్డ, నీతీ నియమం, ఆశా శ్వాస...ఏమీ మిగల్లేదని. అలాంటి దేశాన్ని కలుపుకోనన్నా కలుపుకోవాలి. లేదా యుద్ధ ట్యాంకుల్ని పెట్టి కలుపునైనా ఏరి పారేయాలి. హఠాత్తుగా భారీ విస్ఫోటనం! జెరూసలేంలో నేనున్న గది ఒక్కసారిగా దద్దరిల్లింది. కిటికీ అద్దాలు బద్దలయ్యాయి. సమీపంలో – ‘‘కొడుకా... నాయనా...’’ అని ఓ తల్లి ఆక్రందన! ఇరాన్‌ నుంచి ఖొమైనీ తిరుగుయుద్ధం ప్రారంభించినట్లున్నాడు. 

ఇజ్రాయెల్‌ మాత్రం యుద్ధాన్ని ఆపదు. ఒక తల్లి తన పిల్లల్ని ఏ ఉదయమైనా నిర్భయంగా బయటికి పంపగలిగేంతైనా శాంతిని నెలకొల్పేవరకు ఇజ్రాయెల్‌ తన యుద్ధాన్ని ముగించదు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)