ఏమిటీ ఈ పిచ్చి? ఈమె ఎందుకు ఇలా డ్యాన్స్‌ చేస్తోంది?

Published on Sun, 07/26/2026 - 09:35

అది 1518 జూలై– ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌ నగరం– ఆకాశం నిర్మలంగా ఉంది. నగర వీథులు ఎప్పటిలాగే జనసమ్మర్దంతో సందడిగా ఉన్నాయి. హఠాత్తుగా ఒక ఇరుకైన సందులోంచి ఓ మహిళ రోడ్డుపైకి పరుగున వచ్చింది. ఆమె పేరు ఫ్రావ్‌ ట్రోఫియా. ఆమె ముఖంలో ఏదో తెలియని భయం; కళ్లల్లో విపరీతమైన ఆందోళన. కానీ విచిత్రంగా ఆమె కాళ్లు మాత్రం అసంకల్పితంగా నర్తించడం ప్రారంభించాయి. చుట్టుపక్కల వాళ్లంతా ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు.

‘ఏమిటీ పిచ్చి? పండగ లేదు, పబ్బం లేదు– ఈమె ఎందుకు ఇలా డ్యాన్స్‌ చేస్తోంది?’ అని గుసగుసలాడుకుంటున్నారు. 
కొంతమంది నవ్వుకుంటున్నారు. అయినా సరే ట్రోఫియా నృత్యం ఆపలేదు. సూర్యుడు అస్తమించాడు; చీకటి పడింది; తెల్లవారింది. అయినా ట్రోఫియా కాళ్లు ఆగడంలేదు. ఆమె శరీరం చెమటతో తడిసి ముద్దవుతోంది. ఊపిరి కూడా సలపడంలేదు. స్పృహ తప్పి కింద పడిపోతోంది. కానీ కళ్లు తెరవగానే, మెదడుకు ఏదో కరెంట్‌ షాక్‌ తగిలినట్లు మళ్లీ లేచి డ్యాన్స్‌ చేస్తోంది. అలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు– ఏకధాటిగా ఆరు రోజుల పాటు ఆమె మృత్యునృత్యం చేస్తూనే ఉంది.

ట్రోఫియాను చూసి నగర ప్రజలు నవ్వుకుంటుండగానే, మొదటి వారం ముగిసేసరికి మరో 34 మంది వీథిలోకి వచ్చి ఆమెతో జత కలిశారు. వాళ్లకు కూడా ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. ఒకరిని చూసి ఒకరు– అలా కేవలం నెల రోజులు గడిచేసరికి దాదాపు 400 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి, పిచ్చిపట్టినట్లు నృత్యం చేయడం ప్రారంభించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు, యువకులు ఉన్నారు. అదొక వింతైన అంటువ్యాధిలా మారిపోయింది. చూసేవాళ్లకు అది డ్యాన్స్‌లా లేదు. ఏదో అదృశ్య శక్తి వారి చేతులకు, కాళ్లకు దారాలు కట్టి బొమ్మలా ఆడిస్తున్నట్లు ఉంది.

పగలూ రాత్రీ తేడా లేదు. ఎండా వానా తేడా అసలే లేదు. కాళ్లు అరిగిపోయి, పాదాలు చిట్లి నెత్తురోడుతున్నా, నర్తించడం మాత్రం ఆపలేకపోతున్నారు. విపరీతమైన డీహైడ్రేషన్, గుండెపోటు కారణంగా రోజుకు కనీసం 15 మంది వరకు రోడ్లపైన డ్యాన్స్‌ చేస్తూనే ప్రాణాలు విడిచారు. ఈ వింత పరిస్థితిని చూసి నగర పాలకులు, వైద్యులు తలలు పట్టుకున్నారు. 
‘ఇది వేడి రక్తం వల్ల వచ్చే శారీరక సమస్య. దీనికి విరుగుడు ఒక్కటే– వాళ్లను ఇంకా ఎక్కువగా డ్యాన్స్‌ చేయనివ్వండి. రక్తం చల్లబడితే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది!’ అని కొందరు వైద్యులు సలహా ఇచ్చారు.

అంతే! అధికారులు రంగంలోకి దిగారు. బాధితుల కోసం నగరంలో పెద్ద పెద్ద హాల్స్, స్టేజీలు ఏర్పాటు చేశారు. వాళ్లకు మరింత ఉత్సాహం ఇవ్వడానికి ప్రత్యేకంగా డ్రమ్మర్స్, సంగీతకారులను పిలిపించి మరీ వాయించారు. కానీ ఈ నిర్ణయం మరింత బెడిసి కొట్టింది. హోరెత్తించే డ్రమ్స్‌ శబ్దాలు వినబడటంతో నగరంలోని మరికొంతమంది సాధారణ ప్రజల మెదళ్లు కూడా పాడైపోయి, ఆ డ్యాన్స్‌ గ్రూప్‌లో చేరిపోయారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగింది. చివరకు ప్రభుత్వం భయపడి నగరంలో డ్యాన్స్‌ను పూర్తిగా నిషేధించింది. బాధితులను బలవంతంగా ఒక పర్వత గుహలోని చర్చికి తరలించి, ప్రత్యేక పూజలు చేయించాక, సెప్టెంబర్‌లో ఈ కరాళ నృత్యం నెమ్మదిగా ముగిసింది.

శతాబ్దాలుగా ఈ ‘డ్యాన్సింగ్‌ ప్లేగ్‌’పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఆధునిక శాస్త్రవేత్తలు దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉండవచ్చని గట్టిగా నమ్ముతున్నారు. అప్పట్లో ప్రజలు తినే రాగులు, గోధుమల లాంటి ధాన్యాలకు ‘ఎర్గోట్‌’ అనే ఒక రకమైన ఫంగస్‌ పట్టేది. ఈ ఫంగస్‌ ఉన్న ఆహారాన్ని తింటే మనుషుల్లో భ్రమలు, ఫిట్స్, విపరీతమైన నరాల కదలికలు వస్తాయి. అంటే ఇది ఇప్పటి ఎల్‌ఎస్‌డీ వంటి ప్రమాదకరమైన డ్రగ్‌లా పనిచేస్తుంది. అందువల్లే వారు అలా భయంకరంగా నర్తించి ఉంటారనే అంచనాకు వచ్చారు. అలాగే 1518 కాలంలో ఆ నగరంలో తీవ్రమైన కరవు, భయంకరమైన రోగాలు ఉన్నాయి. ఆ విపరీతమైన మానసిక ఒత్తిడి తట్టుకోలేక, ప్రజల మెదడు ఒకేసారి ఆల్టర్నేట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయి ‘మాస్‌ హిస్టీరియా’కు దారితీసి ఉండవచ్చనే వాదనలూ ఉన్నాయి.

అయితే, ఒక ఫంగస్‌ వల్ల లేదా మానసిక ఒత్తిడి వల్ల మనుషులు ఏకధాటిగా రోజులు తరబడి ప్రాణాలు పోయేంత వరకు ఎలా డ్యాన్స్‌ చేయగలరు? అనే ప్రశ్నకు ఇప్పటికీ సైన్స్‌ దగ్గర పూర్తి స్పష్టమైన సమాధానం లేదు. తమ నియంత్రణలో లేని శరీరాలతో, మరణం వైపు అడుగులు వేస్తూ ఆనాడు ఆ నాలుగువందల మంది అనుభవించిన నరకం ఎలాంటిదో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మనిషి మెదడుతో ప్రకృతి ఆడిన ఈ వింత ఆట చరిత్ర పుటల్లో ఎప్పటికీ ఒక వీడని మిస్టరీనే!

- సత్యకిశోర్‌

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)