JC నా వెంట్రుకతో సమానం.. పెద్దారెడ్డి మాస్ వార్నింగ్
Breaking News
నిదురించే తోటకు పాట వెళ్లి పోయింది
Published on Sat, 01/17/2026 - 03:40
‘జీవితం ఒక ప్రయాణం చివరి మజిలీ మరణం’ అని రాసుకున్న ప్రఖ్యాత హిందీ, ఆంగ్ల కవయిత్రి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ (96) మరణంతో తెలుగు సాహిత్యానికీ, రాచరిక అభిలాషకీ ఉన్న అనుబంధం ముగిసి పోయింది. ధన్‌రాజ్‌గిర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా గుంటూరు శేషేంద్రశర్మ సహచరిగానే తెలియడం ఒక పరిమితి. పట్టుదల, కవితాభిలాష, సాహితీ జిజ్ఞాస మెండుగా ఉన్న ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ తెలుగువారికి కొన్ని జ్ఞాపకాలను మిగిల్చారు. ఒక జ్ఞాపకంగా మిగిలారు.
గాంధార దేశ రాకుమారి గురించి వినేవారం. కాని ఇందిరా ధన్‌రాజ్‌గిర్ రూపంలో చూడగలిగాం. అవును. ఇందిరాదేవి పూర్వీకులు నేటి అఫ్ఘానిస్తాన్ నుంచి పూణె మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. నిజాం తర్వాత అంతటి సంపన్నులుగా, దాతృత్వం కలవారుగా పేరు గడించిన రాజా జ్ఞాన్ గిరిరాజ్ బహదూర్, ప్రమీలా దేవిల పెద్ద కుమార్తె అయిన ఇందిరా దేవి చిన్నప్పటి నుంచి తన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత అభిలాషలను, కళా సౌందర్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. గొప్ప గొప్ప కవులు, కళాకారులతో పరిచయం కలిగి కళాభిరుచిని పరిపుష్టం చేసుకున్నారు. ఏ రాకుమారుణ్ణో వలచాల్సిన ఈ రాకుమార్తె కవిని వలచడం, ఆ కవి తెలుగువాడు కావడం విశేషం. గుంటూరు శేషేంద్ర శర్మ సాహచర్యంలో ఇందిరా ధన్‌రాజ్‌గిర్ తన జీవితాన్ని కవితాత్మకం చేసుకున్నారు.
→ ఎస్టేటే విద్యాలయం
ఇందిరా దేవి జీవితం చివరి వరకూ సాగిన తాత తండ్రుల ప్యాలెస్ ‘జ్ఞాన్‌బాగ్ ఎస్టేట్’ లేదా ‘ధన్‌రాజ్‌గిర్ బాగ్’ నాంపల్లి దాపున 8 ఎకరాల్లో 30 వేల చదరపు అడుగుల్లో 19 విశాల గదులతో ఉంటుంది. అక్కడే ఆమె బాల్యం, వైవాహిక జీవితం, విశ్రాంత జీవితం కొనసాగింది. ఒక దశలో ప్యాలెస్‌ను విడిచి బంజారా హిల్స్‌కు మారి పోవాలని భావించినా మనసు మార్చుకుని అక్కడే ఉండి పోయారు. లాక్‌డౌన్ సమయంలో పని వాళ్లందరూ వెళ్లి పోగా ఒకరిద్దరు సహాయకులతో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది.
అంతటి మమకారం ఆ ప్యాలెస్ అంటే ఆమెకు. ఇందిరాదేవి కొంతకాలం మెహబూబియా బాలికల పాఠశాలలో చదువుకున్నా ఈ జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్సే ఆమె విద్యాలయంగా మారింది. ఇంటి వద్ద ఆంగ్ల గవర్నెస్ ద్వారా చదువుకున్నారు. ఆ తర్వాత ప్రఖ్యాత కవి అల్లామా ఇక్బాల్ ప్రేరణతో తొమ్మిదో ఏటనే రచనలు చేయడం ప్రారంభించారు. ఆంగ్లం, హిందీ, ఉర్దూ, మరాఠా భాషలు ఆమెకు కొట్టిన పిండి. ఇంగ్లిష్‌లో గొప్ప పాండిత్యం ఉంది. ప్రఖ్యాత కవి, ప్రొగ్రెసివ్ రైటర్స్ మూవ్‌మెంట్ సభ్యుడు మఖ్దూం మొహియుద్దీన్‌తో ఉన్న స్నేహం ఆమె ప్రగతివాద దృష్టిని ఇచ్చిందని చెబుతారు.
→ సొంతగా టైప్ నేర్చుకుని...
ఇందిర తనకు తానుగా టైప్ చేయడం నేర్చుకోవడమే కాదు ఉర్దూలో ద్విపదలు కం పోజ్ చేయడం మొదలెట్టారు. ఫొటోలు తీయడం హాబీగా మొదలై తర్వాతి కాలంలో గొప్ప నైపుణ్యంగా మారింది.
1964లో తన మొదటి కవితా సంపుటి ‘ది అ పోస్టల్’, 1965లో ‘రిటర్న్ ఎటర్నిటీ’ వరుసగా వెలువరించడంతో కవులు ఆమెతో పరిచయ భాగ్యం కలిగి ఉండటం గౌరవంగా భావించారు. జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్‌లో గుంటూరు శేషేంద్ర శర్మ, మఖ్దూం మొహియుద్దీన్, జ్వాలాముఖి తదితరులు ఆమెతో కవిత్వంపై చర్చించడానికి, చదవడానికి కలిసేవారు. శేషేంద్ర శర్మతో పరిచయం వివాహానికి దారితీసింది. ఆయనకు అప్పటికే మొదటి వివాహం ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నా ఆమె పరిగణనలోకి తీసుకోలేదు.
→ పూలు పూసే తోట
‘నా మనసు పూలు పూసే తోట’ అని కవిత్వం రాయగలిగిన ఇందిరా దేవి వివాహం తర్వాత అంత ఎక్కువగా కవిత్వం రాయలేదు. ‘ఒక ఇంటిలో ఇద్దరు కవులు ఉండరాదు’ అని ఆమె అన్నట్టుగా చెబుతారు. అయితే ‘ఈ తోట’ను శేషేంద్ర కవిత్వం చేశారు. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని బహుశా తన జీవితంలో ఆమె రాకను సూచిస్తూ కవిత రాస్తే దానిని బాపు, రమణలు ‘ముత్యాల ముగ్గు’ కోసం గొప్ప పాటగా తెలుగువారికి కానుక చేశారు. ‘ముత్యాల ముగ్గు’ కోసం ఇందిరా దేవి తన ప్యాలస్‌ను షూటింగ్‌కు అనుమతి ఇచ్చారు. ‘ముత్యాల ముగ్గు’లో అలా జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్ చిరస్థాయిగా నిలిచి పోయింది.
→ చివరి కోరిక
అంబర్ పేట్ శ్మశాన వాటికలో శేషేంద్ర సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు నిరాడంబరంగా జరిగి పోయాయి. అది ఆమె చివరి కోరిక. అట్టహాసం లేకుండా అంత్యక్రియలు జరిగి పోవాలనేది కూడా ఆమె ఆఖరి ఆలోచన. మొత్తానికి ఒక చరిత్ర ముగిసింది. కవిత్వంలో ఒక రాజకుమారి వీడ్కోలు తీసుకుంది.
అనేక ఘనతలు
ఇందిరాదేవి ‘మెమోరీస్ ఆఫ్ ది డెక్కన్’ అనే కాఫీ టేబుల్ బుక్‌ను తయారు చేసి ఎనిమిదవ నిజాం యువరాజు ముకరం జాకు 2008లో అంకితమిచ్చారు. ఆమె రాసిన ఒక కాలం ఉర్దూ పత్రికలో 12 ఏళ్లు కొనసాగి 750 పేజీల పుస్తకంగా వచ్చింది. 1973 సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఆమె పేరును నామినేట్ చేయడాన్ని నేటికీ విశేషంగా చెప్పుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆమె పేరుతో ఒక హాల్‌ను కళా సాహిత్యాలకు అంకితం చేసింది.
Tags : 1