Breaking News

ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?

Published on Sun, 08/30/2026 - 08:02

ది 1990వ దశకం... అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలోని చిన్న పట్టణం థావోస్‌. అర్ధరాత్రి దాటింది. పట్టణమంతా ప్రశాంతంగా ఉంది. అంతలో ఒక్కసారిగా మంచంపై నుంచి లేచి కూర్చున్నాడు 52 ఏళ్ల మైకేల్‌. చెవులను చేతులతో నొక్కుకుంటూ చిరాకుగా కిటికీ బయటకు చూశాడు.

‘ఎక్కడో డీజిల్‌ ఇంజిన్‌ నడుస్తున్నట్లుంది... ఆపరా బాబోయ్‌’ అంటూ విసుక్కున్నాడు.
పక్కనే నిద్రిస్తున్న అతడి భార్య సారా కళ్లు తెరిచి ఏమైందని అడిగింది... ‘ఏంటా గోల? ఎక్కడి నుంచి వస్తోందది’ అని చిరాకుగా అడిగాడు. ‘నాకేం వినిపించడంలేదే. కల ఏమైనా వచ్చిందా?’ అని సారా అడిగే సరికి మైకేల్‌ కళ్లు నులుముకున్నాడు. అతడికి చెవుల్లో ఆ శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇంట్లో ఎలాంటి యంత్రం లేదు. బయట రోడ్డు మీద వాహనాలూ లేవు. కానీ అతడి చెవుల్లో మాత్రం ఒకే శబ్దం...

‘హ్మ్‌...’ అది దగ్గరగా ఉన్నట్లూ కాదు, చాలా దూరంలో ఉన్నట్లూ కాదు– వినిపిస్తుంది, అంతలోనే  మాయమైపోతుంది. చెవులు మూసుకున్నా వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఆ రాత్రి అతడికి నిద్ర లేదు. మరుసటి రోజు పక్కింటి వాళ్లను అదే విషయం గురించి అడిగాడు. ‘ఏ శబ్దం? మాకేమీ వినిపించలేదు’ అని చెప్పడంతో మైకేల్‌ అయోమయానికి గురయ్యాడు.

క్రమంగా ఆ శబ్దం గురించి చెబుతున్న వారి సంఖ్య పెరిగింది. ‘రాత్రిళ్లు ఓ వింత శబ్దం వినిపిస్తోంది. ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కావడం లేదు. రోజంతా ఉండదు కానీ, రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది’ అంటూ వారంతా ఒకే విధంగా వర్ణించారు. అది దూరంలో డీజిల్‌ ట్రక్కు ఇంజిన్‌ నడుస్తున్నట్లు; భారీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మోగుతున్నట్లు; ఒక పెద్ద ఈగ చెవి దగ్గర నిరంతరం రొద పెడుతున్నట్లు గంభీరమైన ‘హ్మ్‌...’ అనే ధ్వనిలా ఉంటుందని చెప్పారు.

అయితే, అదే ప్రాంతంలో నివసిస్తున్న చాలా మందికి ఆ శబ్దం అసలు వినిపించకపోవడం; కొందరికే అది తెలుస్తుండటం వింతగా అనిపించింది. ఒకే ఇంట్లో భార్యాభర్తల్లో ఒకరికి వినిపిస్తే, మరొకరికి అసలు వినిపించకపోవడం సాధారణమైపోయింది. కొంతమంది చెవులు మూసుకున్నా వినిపిస్తోందని చెబితే, ఇంకొందరు అది తమ తలలోనే ప్రతిధ్వనిస్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు.

మొదట్లో చిన్న అసౌకర్యంగా భావించిన ఈ హమ్‌... క్రమంగా చాలామందిని మానసికంగా వేధించడం ప్రారంభించింది. రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు; పగలు పనిపై దృష్టి నిలిచేది కాదు. తలనొప్పి, చిరాకు, ఒత్తిడి వెంటాడేవి. ఈ బాధ పడలేక కొందరు వేరే ఊరికి వెళ్లిపోయారు కూడా. మరికొందరు వైద్యులను ఆశ్రయించారు. కానీ పరీక్షల్లో పెద్దగా సమస్యలు కనిపించలేదు.

ఈ శబ్దం గురించి ఫిర్యాదులు పెరగడంతో 1993లో అమెరికా అధికారులు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వినికిడి నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం విద్యుత్‌ లైన్లు, ఫ్యాక్టరీలు, భూకంప ప్రకంపనలు, రేడియో తరంగాలు, సైనిక స్థావరాలు– అన్నింటినీ పరిశీలించింది. కానీ ఆ శబ్దానికి కచ్చితమైన మూలం మాత్రం దొరకలేదు. పట్టణమంతటా అత్యంత సున్నితమైన, అత్యాధునిక అకోస్టిక్‌  రికార్డర్లను, వైబ్రేషన్‌ డిటెక్టర్లను అమర్చారు. కానీ ఏ ఒక్క డిజిటల్‌ మెషిన్‌ కూడా ఆ శబ్దాన్ని కచ్చితంగా రికార్డు చేయలేకపోయింది.

ఈ హమ్‌పై ఎన్నో సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. దూరంలోని పరిశ్రమల యంత్రాల శబ్దమని కొందరు చెప్పారు. భూమి లోపల జరిగే సూక్ష్మ ప్రకంపనలేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. మనిషి వినలేని అత్యల్ప ఫ్రీక్వెన్సీ శబ్దాలు కారణమై ఉండవచ్చని అనుకున్నారు. చెవులకు సంబంధించిన టిన్నిటస్‌ అనే వైద్య సమస్యతో ముడిపడి ఉండవచ్చని కొందరు భావించారు. అయితే ఈ వివరణల్లో ఏదీ అందరికీ సరిపోయేలా రుజువు కాలేదు.

శాస్త్రవేత్తలకు సమాధానం దొరకకపోవడంతో ఊహాగానాలు మరింత పెరిగిపోయాయి. ఇది అమెరికా సైన్యం రహస్య ప్రయోగాల ప్రభావమని, భూగర్భంలో దాగి ఉన్న రహస్య కేంద్రాల నుంచే ఈ శబ్దం వస్తోందని, గ్రహాంతరవాసుల సంకేతాలేనని– ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వాటిలో దేనికీ విశ్వసనీయమైన ఆధారాలు లభించలేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మూడు దశాబ్దాలు గడిచినా కొందరు థావోస్‌ నివాసితులు ఇప్పటికీ అదే హమ్‌ వినిపిస్తోందని చెబుతున్నారు. మరికొందరికి మాత్రం అసలు అలాంటి శబ్దం ఎప్పుడూ వినిపించలేదు. అంటే, శబ్దం నిజంగానే ఉందా? లేక కొందరు మాత్రమే గ్రహించే సహజ ధ్వనా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.

ప్రపంచం ఎన్నో మిస్టరీలను ఛేదించింది. సముద్రపు అడుగున ఏముందో తెలుసుకుంది. అంతరిక్షంలో కోట్ల కిలోమీటర్ల దూరంలోని గ్రహాల చిత్రాలు తీసింది. కానీ అమెరికాలోని ఒక చిన్న పట్టణంలో కొందరి చెవుల్లో మాత్రమే వినిపించే ఆ ‘హ్మ్‌...’ అనే శబ్దం వెనుక రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయింది. అందుకే, థావోస్‌ హమ్‌ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన, అంతుచిక్కని రహస్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

- సత్యకిశోర్‌ కొండ్రెడ్డి

ఇవి కూడా చదవండి: అంతరిక్షంలో వరిపంట

Videos

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు

Photos

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)