Breaking News

'టీ' తాగుతారా? తింటారా? సుప్రీంకోర్టు కీలక తీర్పు!

Published on Sun, 11/29/2026 - 08:45

ఇదేం ప్రశ్న.. ఎవరైనా ‘టీ’ తింటారా? తాగుతారు.. కానీ అంటారా? ఇదే అంశం సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. ‘టీ’ని తమిళనాడు ప్రభుత్వం ఆహార పదార్థాల జాబితాలో చేర్చింది. పానీయాన్ని ఆ కేటగిరీ కింద చేర్చడం సరైందేనా? ఆ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై ఓ ‘టీ’ కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆహారపదార్థం అంటే ఏంటి? టీని ఆహారపదార్థంగా పరిగణించాలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇరుపక్షాల వాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అసలీ వివాదం ఎందుకు వచ్చింది? కోర్టు  ఏం తీర్పు ఇచ్చిందనేదే ఈ వారం లీ‘గలాట’...

కోయంబత్తూరులోని వేదపట్టి ప్రాంతంలో కేరళకు చెందిన హారిసన్స్‌ మలయాళం సంస్థకు చెందిన టీ గోదాములు ఉన్నాయి. 1990లో అధికారులు ఆ గోదాము నుంచి 13 టీ నమూనాలను సేకరించారు. వాటిలో కల్తీ పదార్థాలు ఉన్నాయని, ఇది 1977లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోని నిబంధనలకు విరుద్ధం అనేది అధికారుల ప్రధాన ఆరోపణ.

హైకోర్టుకు వెళ్లిన వ్యాపారులు
తమిళనాడు ప్రభుత్వం 1977లో ‘తమిళనాడు షెడ్యూల్డ్‌ ఆర్టికల్స్‌’ పేరుతో ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని నిత్యావసర వస్తువుల సరఫరా, వాటి నాణ్యత ప్రమాణాలను మరింత పెంచడం ఆ ఉత్తర్వుల ఉద్దేశం. ఈ షెడ్యూల్‌1–లో ‘టీ’ని కూడా చేర్చారు. 1977లో రాష్ట్ర ప్రభుత్వం ‘టీ’కి నిర్దేశించిన ప్రమాణాల ఉత్తర్వుల చెల్లుబాటు కాదని, ఆ నిబంధనల ప్రకారం తమ సంస్థపై  కేసు నమోదును ప్రశ్నిస్తూ హారిసన్స్‌ సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది.

కొందరు టీ వ్యాపారులు కూడా ఈ  అంశంపై పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు అన్నీ కలిపి హైకోర్టు విచారించింది. ఎక్కువ మంది పేదలు ఆహారపదార్థానికి ప్రత్యామ్నాయంగా ‘టీ’ తాగుతారు. కొద్దిసేపు ఉత్సాహంగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. దీన్ని ఆహారపదార్థాల పరిధిలోకి తీసుకురావచ్చని పేర్కొంది.  పిటిషనర్ల వాదనను తిరస్కరిస్తూ, అధికారుల చర్యను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టులో అప్పీలు
హైకోర్టు తీర్పుపై వ్యాపారులు సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. ‘టీ’ని ప్రజలు ఆహారంగా కాకుండా పానీయంగా తీసుకుంటారని, ఇది శక్తినిచ్చే ఆహారపదార్థం కాదని ఉద్దీపన మాత్రమే కలిగిస్తుందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. అందువల్ల ‘ఆహారపదార్థం’ నిర్వచనం పరిధిలోకి ‘తేనీరు’ను తీసుకురాలేమని పేర్కొన్నారు. ప్రజల నిత్యావసర వినియోగంలో ‘టీ’ ఒక భాగమని, దానికి నాణ్యత ప్రమాణాలు నిర్దేశించడం చట్టవిరుద్ధం కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు.

నిత్యావసర వస్తువుల చట్టం 1955లో నిత్యావసర వస్తువుల నిర్వచనం ఉంది. అయితే అందులో ‘ఆహారపదార్థం’ పదానికి ప్రత్యేక నిర్వచనం లేదు. చట్టంలో ఒక పదానికి స్పష్టమైన నిర్వచనం లేనప్పుడు వ్యవహారికంలో ఆ పదానికి ఉన్న అర్థాన్ని సాధారణంగా కోర్టులు పరిశీలిస్తాయి. దానిలో భాగంగా సుప్రీంకోర్టు ‘టీ’ కి జనబాహుళ్యంలో ఉన్న అర్థం, వ్యాపార రంగంలో ఎలా పరిగణిస్తారు, నిఘంటువుల్లో పేర్కొన్న అర్థాల్ని పరిశీలించింది.

‘ఫుడ్‌’ అంటే తినే పదార్థమా? తాగేదా?
వాడుక భాషలో ఆహారం అంటే తినే పదార్థం. విస్తృతమైన అర్థంలో ఆహారం అంటే ఘన పదార్థాలతో పాటు ద్రవ పదార్థాలు కూడా కావచ్చు. అయితే ఏదైనా పదార్థం శరీర పెరుగుదలకు, దెబ్బతిన్న కణజాలాల మరమ్మతుకు జీవక్రియల నిర్వహణకు తోడ్పడాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

టీ తాగితే మనిషికి ఉత్సాహం, చురుకుదనం కలగొచ్చు. అందువల్ల దీన్ని ఆహార పదార్థంగా పరిగణించలేమని, పౌష్టికాహారంతో సమానంగా భావించలేమని పేర్కొంది. ‘టీ’ని ఆహారపదార్థంగా నిర్ణయిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేదు. ‘టీ’ నిత్యావసర వస్తువుల పరిధిలోకి వచ్చినా, ‘ఫుడ్‌స్టఫ్‌’ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ‘టీ’కి వర్తించేలా రూపొందించిన నిబంధనలు చెల్లవని తేల్చింది.  హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి, అప్పీలుదారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.  
వేర్వేరు చట్టాలు.. వేర్వేరు తీర్పులు
‘టీ’ ఆహారపదార్థాల పరిధిలోకి వస్తుందా? రాదా? అనే చర్చ సుప్రీంకోర్టు తీర్పుతో ముగియలేదు. హైకోర్టులో మరో కేసు సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. మదురైలోని ఓ సంస్థ దుకాణంలో 25 కిలోలు టీ వ్యర్థాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని, వాటిని ధ్వంసం చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. దీనిపై ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. వాదనల్లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తావనకు వచ్చింది.

ఈ కేసులో ఆ తీర్పును హైకోర్టు అంగీకరించలేదు. ఆహార పదార్థాల కల్తీ నిరోధక చట్టం 1954 ప్రకారం... ‘ఆహారానికి’ ఉన్న నిర్వచనాన్ని పరిగణనలోకి తీసుకుంది. మానవ వినియోగానికి వాడే ఈ పదార్థాన్ని ఆహారంగా పరిగణించాలని పేర్కొంది. టీ వ్యర్థాలు కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉండాలని చెప్పింది. అధికారుల చర్యను సమర్థిస్తూ, కంపెనీ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.

తాజా తీర్పుతో సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు తోసిపుచ్చినట్టు కాదు. రెండు కేసుల్లోనూ రెండు వేర్వేరు చట్టాల ప్రకారం ‘టీ’కి రెండు వేర్వేరు అర్థాలు వర్తించాయి. ఒకే పదార్థానికి రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విభిన్న అర్థాలు ఉండొచ్చని ఈ రెండు తీర్పుల ద్వారా స్పష్టం అవుతుంది.

- దిలీప్‌ మాదిరెడ్డి

ఇదీ చదవండి: ఈ వారం కథ: 'పెంపకం'

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)