ఆలనాపాలన... రోడ్డుపాలు చేయొద్దు!

Published on Tue, 08/11/2026 - 00:41

డాక్టర్‌ కావాల్సిన ప్రియాంక నూరేళ్ల జీవితం క్షణాల్లో కడతేరిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన అందరి మనసునూ కలచివేసింది. పిల్లలకు కార్లిచ్చి పంపుతున్న తల్లిదండ్రులు ఆ పిల్లల ధోరణి గమనిస్తున్నారా?
రేస్‌ ఉన్మాది – స్పీడ్‌ కోసం ప్రాణాలు తీసేవాడు
ఈగో ఉన్మాది –  ‘దారి ఇవ్వలేదు’ అని గుద్దేవాడు
మత్తు ఉన్మాది –  తాగి స్టీరింగ్‌ పట్టేవాడు
డాడీ పవర్‌ ఉన్మాది – ‘నాన్న చూసుకుంటాడు’ అని నడిపేవాడు. 
ఇంట్లో ‘బంగారు తండ్రి’ అని  పిలుచుకునే కొడుకు రేపు ఈ నలుగురిలో ఒకడు కాకుండా చూసుకుంటున్నామా?

ఆగస్టు 3, 2026 రాత్రి 10:00 గంటలు. 
రాజమండ్రిలోని ఒక మాల్‌లో సినిమా చూసి బయటకు వచ్చిన ప్రియాంక (28) తన స్కూటీ తీసి ఫ్రెండ్‌తో కలిసి ఇంటికి బయలుదేరింది. బహుశా ఆమె సినిమా కబుర్లలో మునిగి ఉంటుంది. హాస్టల్‌ నుంచి ఫోన్‌ వస్తే ‘ఇంకో పావుగంటలో చేరుకుంటున్నాం’ అని కూడా చెప్పి ఉంటుంది. కాని ప్రియాంక జీవితం సడన్‌గా విషాదంలో కూరుకుపోయింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ వాహనంతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టడమే కాదు, ప్రియాంక తలపై నుంచి కారును పోనిచ్చి పరారయ్యారు.

ఆ క్షణమే కోమాలోకి వెళ్లిన ప్రియాంక ఆగస్టు 9న మృతి చెందింది.  ఆ అమ్మాయి చేసిన నేరం ఏమిటి? ఏ కొద్ది మందికో దక్కే ఎంబీబీఎస్‌ కోర్సు చదివి, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ఉన్న అమ్మాయి క్షణంలో ఉన్మాద చర్యకు ప్రాణం కోల్పోవడం ఏమిటి? ఆమె మృతికి ఇద్దరు వ్యక్తులే కారణంగా పైకి కనిపించవచ్చు. కాని వారి ‘మైండ్‌సెట్‌’ను అలా తయారు చేసిన వ్యవస్థ, పెంపకం, వ్యసనం, లెక్కలేనితనం... ఇవన్నీ కారణాలే. ఇవి సరికానంత వరకూ ఇలాంటి ఉత్పాతాలు జరగవని  గ్యారంటీ ఇవ్వలేము. రోడ్డు మీద క్షేమంగా తిరగలేము.

నాలుగు రకాల ఉన్మాదాలు
రోడ్ల మీద తిరిగే వాహనాల బ్రాండ్‌ కంటే వాటిని నడుపుతున్న మనుషుల మనస్తత్వాలు ముఖ్యం. నేటి రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే వాటికి కారణమైన వారిలో నాలుగు రకాల ఉన్మాదులు కనిపిస్తున్నారు.

రేస్‌ ఉన్మాది: కేవలం స్పీడ్‌ కోసం, రోడ్డుపై థ్రిల్‌ కోసం పక్కవారి ప్రాణాలు తీసేవాడు. ‘మావాడు బైక్‌ స్పీడ్‌గా నడుపుతాడు’ అని తల్లిదండ్రులే గొప్పగా చెప్పి ఇలా తయారు చేస్తున్నారు. ‘ఫాస్ట్‌గా నడిపే వాడే గొప్ప’ అని కుర్రాడి బుర్రలో ఉంటే ఎవరిది దోషం?

ఈగో ఉన్మాది: ‘నాకు దారి ఇవ్వలేదు’ అని, అహం దెబ్బతిన్నదని కావాలనే వెనుక నుంచి గుద్దేసేవాడు. ‘వాడికి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు’ అని తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి అహాన్ని సాకుతారు.

మత్తు ఉన్మాది: ఒంట్లో ఎంత మద్యం ఉందో తెలియకుండానే స్టీరింగ్‌ పట్టి, రోడ్డుపై నడిచే ప్రతి ఒక్కరినీ టార్గెట్‌గా మార్చేవాడు. స్నేహితులు ఎలాంటివారో తల్లిదండ్రులు చూడకపోవడం, రాత్రి ఒంటి గంటకు కూడా రాకపోతే పార్టీకి వెళ్లాడు అని సరిపెట్టుకోవడం... దాని ఫలితం ఇది.

డాడీ పవర్‌ ఉన్మాది: ‘నా వెనుక నాన్న ఉన్నాడు, ఏ తప్పు చేసినా చూసుకుంటాడు’ అనే నమ్మకంతో బరితెగించి వాహనం నడిపేవాడు. కొడుక్కు పద్దెనిమిదేళ్లు రాకముందే తండ్రి కారు కీ చేతికి ఇవ్వడం, పోలీసు ఆపితే నా పేరు చెప్పు అని తండ్రి అనడం... ఇంకేముంది?

రాజమండ్రిలో డాక్టర్‌ ప్రియాంకను బలితీసుకున్నది ఈ ఉన్మాదాల కలయికే. ఈ విపరీత ధోరణులు రాత్రికి రాత్రి పుట్టవు. చిన్నప్పటి నుంచి తయారై ఉంటాయి. 20 సెకన్లలో జరిగిన ప్రియాంక మృత్యుఘటన వెనుక ‘20 ఏళ్ల బాధ్యతారాహిత్యపు పెంపకం’ కారణమై ఉండొచ్చు. రాత్రి పది తర్వాత కొడుకు బయట ఉంటే కారో, బైకో వేసుకుని తిరుగుతుంటే ‘ఎక్కడ ఉన్నావు?’ అని అడగ్గలిగే స్థితిలో తల్లిదండ్రులు లేకపోయినా, ‘చెప్పాల్సిన పని లేదనే’ ధోరణిలో పుత్రరత్నాలు ఉన్నా అది సమాజానికి అపాయకరం. 

మరవకూడని పాఠం
ఈ రోజు డాక్టర్‌ ప్రియాంక మన మధ్య లేదు. కానీ ఆమె మరణం నేర్పిన పాఠం చాలా పెద్దది. తల్లిదండ్రులారా.. మీ కొడుకులకు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్పండి. రోడ్డు మీద కారు స్టీరింగ్‌ చేతిలో ఉందనో, వెనుక అండ ఉందనో అహంకారంతో ప్రవర్తిస్తే చట్టం ముందు, సమాజం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించండి. కొడుకులను బాధ్యతగల పౌరులుగా పెంచినప్పుడే మన ఇళ్లలో, సమాజంలో నిజమైన భద్రత ఉంటుంది. 

బతుకును మింగే ‘బెల్టు’
కంటి రెప్ప కునుకేస్తేనే స్టీరింగ్‌ ఎటో పోతుంది. మరి మత్తు తలకెక్కితే? అడుగుకొక బెల్టు షాపు రారమ్మని పిలుస్తుంటే దారిన పోయేవాడు ఆగి కాసింత పోసుకొని బయల్దేరుదాం అనుకుంటాడు. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెస్తాడు. వ్యవస్థ ఇలా ఉంటే దానిని ఆపాల్సిన బాధ్యత పాలనది, పౌర సమాజానిది. అధిక అందుబాటు, వేళాపాళా లేకుండా సాగే అమ్మకాలు సహించరానివి. దీనికి కారకులెవరు... నిజంగా మత్తులో తేలుతున్నది ఎవరు అనేది కూడా తేలాలి.

ఏం చేయాలి?
→ లైసెన్స్ తీసుకోకుండా, 21 ఏళ్లు రాకుండా కారు ఇవ్వకండి. ఇచ్చే ముందు ‘నువ్వు తప్పు చేస్తే నేను కేసు నుంచి తప్పించను’ అని గట్టిగా చెప్పండి 

→ ప్రతి రాత్రి 9 గంటలకల్లా కొడుకు ఇంటికి వచ్చాడా? కారు ఎక్కడుంది? పార్టీలో ఉన్నాడా... ఫోన్‌ చేసి చెక్‌ చేయండి. ఇది అనుమానం కాదు. బాధ్యత 

→  ‘సారీ’ చెప్పడం నేర్పండి. రోడ్డుపై ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే దిగి క్షమాపణ చెప్పే అలవాటు చేయండి. ఈగో కంటే మనిషితనం గొప్పదని చూపించండి 

→ సినిమా, రీల్స్‌ గురించి మాట్లాడండి. ‘రేసింగ్‌ సీన్లు సినిమాకే బాగుంటాయి... నిజ జీవితంలో చాలా ప్రాణాంతకం’ అని కూర్చుని చెప్పండి. హీరోయిజం అంటే స్పీడ్‌ కాదు.... బాధ్యత అని చెప్పండి.

→ శిక్ష నుంచి తప్పించకండి. చిన్న స్క్రాచ్‌ అయినా, చిన్న ఫైన్‌ అయినా అబ్బాయినే కట్టనివ్వండి. ‘నాన్న ఉన్నాడు’ అనే నెట్‌ తీసేయండి. భయం ఉంటేనే బుద్ధి వస్తుంది.

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)