రోకటిపాట కాదు రహస్య గీతం!

Published on Sun, 06/21/2026 - 08:07

‘ప్రతి మనిషీ ఓరవాకిలిగా తెరిచిన ఓ తలుపే! అందులోంచి ముందుకు పోతే– ఒక్కొక్కరి కోసం, ఒక్కో ద్వారం తెరుచుకుంటుంది!’ –అన్నారు స్వీడిష్‌ కవి, మనఃశాస్త్రజ్ఞుడు, సంగీతజ్ఞుడు తోమస్‌ యోస్తా ట్రాన్స్‌ట్రామర్‌. ఏ భాషలోనైనా, మనఃశాస్త్రజ్ఞులు కవులూ, రచయితలూ, సంగీతజ్ఞులుగా మారిన ప్రతి సందర్భంలోనూ పాఠకులకు ఇలాంటి భావచిత్రాలు అడుగడుగునా ఎదురవుతుంటాయి. ఉదాహరణకు మన చలం, కుటుంబరావు, పద్మరాజు, గోపీచంద్, బుచ్చిబాబు, రావిశాస్త్రి, ఆర్‌ఎస్‌ సుదర్శనం, త్రిపుర, ‘అంపశయ్య’ నవీన్, పతంజలి శాస్త్రి, కె.ఎన్‌.వై పతంజలి, వడ్డెర చండీదాస్‌ తదితరుల రచనల్లోనూ అలాంటి దృశ్యాలు మనం చూసినవేగా!

ఇక పాశ్చాత్య సాహిత్యంలో ఇలాంటి రచయితలు కోకొల్లలుగా కనిపిస్తారు– కాఫ్కా, వూల్ఫ్, లారెన్స్, సిల్వియా ప్లాత్, థామస్‌ మాన్, హెమింగ్వే అలాంటివాళ్ళే! ‘కనిపించీ కనిపించని దృశ్యాల్లాంటి సంక్షిప్త పదచిత్రాల ద్వారా ఈ కవి (ట్రాన్స్‌ట్రామర్‌) వాస్తవదృశ్యాన్ని సరికొత్త కోణంలోంచి మన కళ్ళకు కట్టిస్తార’ని 2011లో ఆయనకు నోబెల్‌ సాహిత్య పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంలో పేర్కొన్నారు, స్వీడిష్‌ ఎకాడెమీ ప్రతినిధి.

ఆ ‘కనిపించీ కనిపించని’తనాన్నే ట్రాన్స్‌ట్రామర్‌లోని మార్మికతగా అభివర్ణించారు విశ్లేషకులు. మరికొందరు ఆయన్ను ‘ఆధునిక కవి’గా పరిగణించగా, వేరే కొందరైతే ‘ట్రాన్స్‌ట్రామర్‌ ఓ ఎక్స్‌ప్రెషనిస్టు కవి’ అన్నారు.

గెయార్గ్‌ హైం, అగస్ట్‌ స్ట్రాం, గాట్ఫ్రైడ్‌ బెన్‌ తదితరులనూ అదే కోవకు చెందిన కవులంటారు. ఇంకొందరు, ‘ట్రాన్స్‌ట్రామర్‌ ఓ అధివాస్తవిక కవి’ అనేశారు. దైనందిన జీవనంలోనూ, మనల్ని ఆవరించుకుని వున్న చరాచర ప్రకృతిలోనూ లోపలి పొరల్లో దాగిన నిగూఢతను ట్రాన్స్‌ట్రామర్‌ ప్రముఖంగా చిత్రించే మాట నిజం! అందుకే, ఆయన్ని ‘క్రైస్తవ కవి’గా లెక్కించారు మరికొందరు.

ఈ నిర్వచనాలూ ప్రవచనాల మాటెలావున్నా, జీవన గీతం రోకటిపాట కాదనీ, అదో రహస్యగానమనీ ట్రాన్స్‌ట్రామర్‌ లాంటి మార్మిక కవులు నిరూపించిన మాటైతే వాస్తవం! ఈ మార్మికత ఎక్కడినుంచో ఎరువుతెచ్చుకున్నదేం కాదు. అది ఆధునిక జీవన విధానంలో భాగమే. మన మర్యాదల్లోనూ పలకరింపుల్లోనూ మొదలుపెట్టి ఒంటరిగా వున్నప్పుడు ముసురుకునే ఆలోచనల వరకూ అన్నింటా ఈ మార్మికత ఆవరించుకుని వుంటుంది. విషయమేమిటంటే, ఆధునిక మానవాళికి మార్మికత పనిగట్టుకుని నేర్పించనవసరం లేదు! బహుశా అందుకేనేమో, ట్రాన్స్‌ట్రామర్‌ కవిత్వం 60 భాషల్లోకి అనువాదమై, పాఠకుల ఆదరణకు పాత్రమైంది.

ట్రాన్స్‌ట్రామర్‌ రాణించిన మరో రంగం సంగీతం. 1990లో పక్షవాతం వచ్చి కుడి చెయ్యి పడిపోయేంత వరకూ, ఆయన పూర్తిస్థాయి పియానో వాద్యగాడిగా ఔననిపించుకున్నవాడే! ఆ తర్వాత కూడా ఒంటిచేత్తోనే పియానో వాదనం అభ్యసించాడు ట్రాన్స్‌ట్రామర్‌. అలా తన విశిష్టతను మరోసారి నిరూపించుకున్నాడు. సంగీత రంగంలో ట్రాన్స్‌ట్రామర్‌ వారసత్వాన్ని ఆయన కుమార్తె కొనసాగించారు. గానకళలో ఆమె పూర్తిస్థాయి ప్రదర్శకురాలు! 2011లో ట్రాన్స్‌ట్రామర్‌కు నోబెల్‌ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో తండ్రి కవితలు పద్దెనిమిదింటికి బాణీలు కట్టి ఆలపించారామె. నార్వీజియన్‌ శాక్సఫోనిస్ట్‌ యాన్‌ గబారెక్, స్వీడిష్‌– అమెరికన్‌ సంగీతకర్త ఊల్ఫ్‌ గ్రాన్, స్వీడిష్‌–ఫ్రెంచ్‌ సంగీతకారిణి మెడిలిన్‌ ఇసాక్సన్‌ తదితరులెందరో ట్రాన్స్‌ట్రామర్‌ గీతాలకు బాణీలు కట్టి శ్రోతలను అలరించారు.

సాహిత్య ప్రక్రియలను– స్థూలంగా– కవిత్వం, వచనంగా విభజించి చూసుకుంటే, నోబెల్‌ సాహిత్య పురస్కారాల వరకూ కవిత్వానికి పూర్తి న్యాయం జరగలేదనే చెప్పాలి. గత నూట పాతికేళ్ళుగా ఈ పురస్కారాలు అందుకున్నవాళ్ళలో కవులూ, వాగ్గేయకారుల సంఖ్య మూడు పదులకు కొంచెం ఎక్కువ. (అక్షరాలా ముప్పైమూడు మాత్రమే!) మరీ ముఖ్యంగా ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ కోవకు చెందిన పురస్కార గ్రహీతలు ముగ్గురంటే ముగ్గురే! 2011లో నోబెల్‌ సాహిత్య పురస్కారం అందుకున్న ట్రాన్స్‌ట్రామర్‌తోనే ఈ ‘జాబితా’ మొదలవుతుంది! అయితే ఆయన కవిత్వానికే ఈ పురస్కారం ప్రకటిస్తున్నామని స్వీడిష్‌ ఎకాడెమీ ఎక్కడా పేర్కొనక పోవడం గమనార్హం.

జర్మన్‌ కవయిత్రి లూయిజ్‌ గ్లూక్‌ ఒక్కరికే– 2020లో– కవిత్వానికి గానూ ఈ పురస్కారం ప్రకటించింది స్వీడిష్‌ ఎకాడెమీ. మరో నాలుగేళ్ళకు ఇదే పురస్కారం అందుకున్న దక్షిణ కొరియన్‌ రచయిత్రి హాన్‌ కాంగ్‌ రాసింది వచనమే– అయితే దాన్ని కవిత్వంతో వేరుచెయ్యడం దాదాపు అసాధ్యం! తెలుగులో ఇలాంటి పోలిక చెప్పాలంటే రావిశాస్త్రి, కె.ఎన్‌.వై.పతంజలి లాంటి పేర్లు కొన్ని చూపించవచ్చు. ట్రాన్స్‌ట్రామర్‌ వచనం కూడా అలాంటిదే! దాన్ని మూసకట్టు వచనమనో, కవిత్వమనో జమకట్టడం కష్టం. ట్రాన్స్‌ట్రామర్‌ కవితల్లో ‘నీలి ఇల్లు’ సుప్రసిద్ధం. దాని ఆంగ్లానువాదం (ద బ్లూ హౌస్‌) నెట్లో దొరుకుతోంది– చదవండి! - మందలపర్తి కిషోర్‌

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)