Breaking News

బాబు తినడం లేదా? అసలు కారణం ఇదే!

Published on Sun, 09/20/2026 - 09:55

మా బాబు వయసు మూడున్నరేళ్లు. సరిగ్గా తినడం లేదు. కొంచెం తిన్న వెంటనే ఇక చాలు అంటున్నాడు. అందుకే, వయసుకు తగ్గట్టు ఎత్తు, బరువు పెరగడం లేదు అనుకుంటున్నాను. మా అబ్బాయి బాగా తినాలంటే ఏం చేయాలి?
– రమణి, హైదరాబాద్‌.

పిల్లల విషయంలో అసలు ప్రశ్న ‘ఎంత తిన్నాడు?’ అనేది కాదు ‘ఏం తిన్నాడు?’ అనేదే. పిల్లల కడుపు నిండితే సరిపోదు. మెదడు ఎదగాలి,  ఎముకలు బలపడాలి, కండరాలు పెరగాలి, రోగనిరోధక శక్తి మెరుగవ్వాలి! పిల్లల పెరుగుదలకు క్యాలరీల కంటే క్వాలిటీ న్యూట్రిషన్‌ ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రతి పేరెంట్‌ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..

మెదడుకు ‘ఫ్యూయల్‌’ కావాలి!
పిల్లల జీవితంలోని తొలి సంవత్సరాలు మెదడు అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ సమయంలో ప్రొటీన్‌ , ఐరన్‌ , జింక్, అయోడిన్‌ , ఒమేగా–3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు అందేలా చూడాలి.

ఐరన్‌  ఎంతో ముఖ్యమైనది! 
ఐరన్‌ తక్కువైతే రక్తహీనత మాత్రమే కాదు, ఏకాగ్రత, చురుకుదనం తగ్గి, నేర్చుకునే సామర్థ్యం ప్రభావితం కావచ్చు. అందుకే పప్పులు, ఆకుకూరలు, గుడ్డు, మాంసాహారం, రాగి వంటివి పిల్లల భోజనంలో చేర్చాలి. ఐరన్‌  ఉన్న ఆహారంతో పాటు నిమ్మ, జామ, ఉసిరి వంటి విటమిన్‌ –సి ఉన్న పదార్థాలు ఇస్తే ఐరన్‌  శరీరంలోకి బాగా చేరుతుంది.

ప్రొటీన్‌ ఎదుగుదలకు బిల్డింగ్‌ బ్లాక్స్‌!
‘బాబు బాగా తింటున్నాడు’ అనడం కంటే ‘బాబుకు రోజూ మంచి ప్రొటీన్‌ అందుతోందా?’ అని ఆలోచించండి. గుడ్డు, పాలు, పెరుగు, పప్పులు, శనగలు, పెసలు, చేపలు, మాంసం వంటివన్నీ పిల్లల ఎదుగుదలకు మంచి ప్రొటీన్‌ వనరులు.

బలమైన ఎముకలకు పాలు!
పాలు మంచివే. కానీ ఎముకల బలానికి పాలు ఒక్కటే సరిపోవు. కాల్షియం, విటమిన్‌ –డి, శారీరక చలనం కూడా అవసరం. పాలు, పెరుగు, రాగి, నువ్వులు, పనీర్‌ వంటి వాటి ద్వారా కాల్షియం అందుతుంది. వైద్యుల సూచన మేరకు అవసరమైతే మందుల ద్వారా కూడా తీసుకోవటం ఉత్తమం.

జింక్‌ కొంచెమే... ఫలితమే ఘనం
జింక్‌ పిల్లల ఎదుగుదలకు, కణాల అభివృద్ధికి, రోగనిరోధకతకు సహాయపడుతుంది. పప్పులు, గింజలు, నువ్వులు, గుడ్లు, చేపలు, మాంసాహారం వంటి వాటిలో జింక్‌ లభిస్తుంది.

విటమిన్‌ –ఏ అంటే క్యారెట్‌ మాత్రమేనా?
కాదు. విటమిన్‌ –ఏ కళ్ల ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తికి కూడా ముఖ్యమైనది. క్యారెట్‌తో పాటు గుమ్మడికాయ, ఆకుకూరలు, మామిడి, బొప్పాయి వంటి రంగురంగుల పండ్లు, కూరగాయలను పిల్లల ఆహారంలో చేర్చాలి. పిల్లల ప్లేట్‌లో రంగులు పెరిగితే, పోషకాల్లో కూడా వైవిధ్యం పెరుగుతుంది.

ఒమేగా–3 ఎందుకు అవసరం?
ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెదడు, కళ్ల అభివృద్ధికి ఉపయోగపడతాయి. చేపలు దీనికి మంచి వనరులు. శాకాహారంలో అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్స్‌ వంటి వాటి ద్వారా కూడా ఇవి లభిస్తాయి. అయితే చిన్నపిల్లలకు గింజలు, నట్స్‌ ఇస్తున్నప్పుడు వయసుకు తగినట్లు సురక్షిత రూపంలోనే ఇవ్వాలి.

పిల్లల ప్లేట్‌కి ‘5 కలర్స్‌’ చాలెంజ్‌!
పిల్లల ప్లేట్‌లో పసుపు రంగులో ధాన్యం అన్నం, రొట్టె, రాగి, జొన్న; ఆకుపచ్చ రంగులో కూరగాయలు, ఆకుకూరలు; ఎరుపు రంగులో పప్పు, గుడ్డు, చేప, మాంసం; నారింజ రంగులో పండు; తెలుపు రంగులో పాలు, పెరుగు ఉండేలా ప్రయత్నించండి. వివిధ రకాల ఆహారాలను కలిపి ఇవ్వడం వల్ల పిల్లలకు అనేక రకాల పోషకాలు అందుతాయి.

చిరుతిండ్లు పూర్తిగా మానేయాలా?
పూర్తిగా నిషేధించడం కంటే వాటిని అలవాటుగా మారకుండా చూడటం ముఖ్యం. రోజూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే ఇవ్వడం మంచిది. తరచుగా ప్యాకెట్‌ ఆహారం, తీపి పానీయాలు అధికంగా ఇవ్వడం వల్ల పిల్లల ఆహార నాణ్యత తగ్గుతుంది.

మొబైల్‌ చూపిస్తూ తినిపించడం తప్పా?
తినేటప్పుడు మొబైల్‌ చూపించడం అలవాటుగా మారితే పిల్లలు ఆకలి, తృప్తి సంకేతాలను గమనించకుండా తినే అవకాశం ఉంటుంది. భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మొబైల్‌ను పక్కన పెట్టి, పిల్లలతో మాట్లాడటం, వాళ్లు తినే ఆహారంపై దృష్టి పెట్టేలా చేయడం మంచిది.

బొద్దుగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టేనా?
అసలు కాదు. పిల్లల ఆరోగ్యాన్ని కేవలం బరువుతో నిర్ణయించలేం. ఎత్తు, బరువు, వయసుకు తగిన శరీర బరువు సూచిక, ఎదుగుదల పట్టికలను కలిపి చూడాలి. బరువు తక్కువగా ఉండటమే ఆందోళనకరం కాదు, అధిక బరువు కూడా అంతే శ్రద్ధ పెట్టాల్సిన విషయమే.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
పిల్లల బరువు సరిగ్గా పెరగకపోతే, ఎత్తు పెరుగుదల మందగిస్తే, తరచు అనారోగ్యానికి గురైతే, చాలాకాలంగా ఆకలి తగ్గిపోయి ఉంటే లేదా ఎప్పుడూ నీరసంగా కనిపిస్తే దాన్ని కుటుంబంలో అందరికీ ఇలాగే ఉంటుంది అని వదిలేయకండి. పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
చివరగా ఒక మాట– పిల్లల ప్లేట్‌ నిండితే సరిపోదు, అది పోషకాలతో నిండాలి.

- డా‘‘ కె. పవన్‌ కుమార్‌, సీనియర్‌ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్‌ అలర్జిస్ట్, ప్రొఫెసర్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌

ఇదీ చదవండి: Health: నో ఆపరేషన్, నో చిప్స్‌... కేవలం ఐ డ్రాప్స్‌తో మళ్లీ చూపు!

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)