కచ్చితత్వం దిశగా...

Published on Thu, 01/16/2025 - 01:43

పక్షుల, పాముల, జంతువుల ప్రవర్తనను చూసీ...ఆకాశం తీరుతెన్నులు గమనించీ, గాలివాటు, దాని వేగం గ్రహించీ వాతావరణాన్ని అంచనా కట్టే గతకాలపు రోజుల నుంచి ఇవాళ ఏం జరుగుతుందో, వచ్చే నాలుగైదు రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతున్నదో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం అందరికీ అందుబాటులో కొచ్చింది. 

గత నూట యాభయ్యేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఈ పనిలోనే నిమగ్నమై కోట్లాది పౌరులకు చేదోడువాదోడుగా నిలిచిన భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) తన వార్షికోత్సవాన్ని మంగళ వారం ప్రధాని మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఒక దేశ విజ్ఞాన శాస్త్ర అవగాహన ఆ దేశంలోని వైజ్ఞానిక సంస్థల ప్రగతిలో ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పిన మాట అక్షరసత్యం. 

ఈ నూటయాభయ్యేళ్లలో ఐఎండీ సాధించిన ప్రగతి ఇందుకు సాక్ష్యం. ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనే నానుడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇక పోవటం ఖాయమనుకున్న ప్రాణాన్ని నిలబెట్టడానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అధునాతన వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకొచ్చాయి. అలాగే వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో అంచనా వేయగలుగుతున్నాం. 

తుపాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకు రాగల విపత్తు గురించీ హెచ్చరించటంతో పాటు కరవుకాటకాల ప్రమాదాన్ని తెలియజెప్పటం ఆ రంగంలో సాధించిన ప్రగతికి తార్కాణం. మూడు రోజుల వరకూ వాతావరణం ఎలా ఉండబోతు న్నదో చెప్పే స్వల్పకాలిక అంచనాలు, పదిరోజుల వరకూ వాతావరణ పోకడల్ని వివరించగల మధ్య శ్రేణి అంచనాలు, నెల పాటు ఏ వారమెలా వుంటుందో తెలియజేయగల సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇంకా స్థానిక వాతావరణాలను అంచనా వేయగలిగే దిశగా ఐంఎండీ ముందుకెళ్తోంది.

పేరులో తప్ప జనాభా రీత్యా, సంపద రీత్యా, లేదా విస్తీర్ణం రీత్యా ఏ రకంగానూ ‘గ్రేట్‌’ అనే పదానికి అర్హత లేని బ్రిటన్‌ నుంచి వచ్చిన వలస పాలకులు ఈ దేశంలోని వాతావరణ తీరుతెన్నులు చూసి అయోమయంలో పడ్డారు. వీటిని సక్రమంగా అంచనా వేసే సాధనాలు లేకపోతే సరిగా పాలించటం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చిన ఫలితంగానే 1875లో సర్‌ చార్లెస్‌ చాంబర్లేన్‌ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు. 

అంతవరకూ రైతులు సంప్రదాయంగా అనుసరిస్తూ వచ్చిన విధానాలన్నీ క్రమేపీ కనుమరుగై వాతావరణ అధ్యయనం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. కేవలం బ్రిటన్‌ వాతావరణాన్ని పోలి వుంటుందన్న ఏకైక కారణంతో తమ వెసులుబాటు కోసం సిమ్లాలోని పర్వత ప్రాంతంలో మొదలెట్టిన ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1928లో పుణేకు తరలిరావటం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఢిల్లీకి వెళ్లటం తప్పనిసరైంది. 

ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌గా వచ్చిన గిల్బర్ట్‌ వాకర్‌ 1904–1924 మధ్య రెండు దశాబ్దాల సమయంలో భారత వాతావరణంలో చోటుచేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయటంతో అనేక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్‌ మహా సముద్ర జలాలపై ఉండే వాయుపీడనంలో వచ్చే హెచ్చుతగ్గులే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం తేల్చాక వాతావరణాన్ని అర్థంచేసుకునే తీరే మారిపోయింది. 

పసిఫిక్‌ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో మైనస్‌ 17 డిగ్రీల సెల్సియస్‌ మేరకు హెచ్చితే లాæనినో... ఆ ఉష్ణోగ్రత మైనస్‌ 17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడు తుందని తేలింది అప్పుడే. ఇదంతా అర్థమయ్యాక రాగల కాలంలో వాతావరణమెలా వుండనున్నదో అంచనా వేయటం సులభమైంది. వాతావరణంలో విడిచిపెట్టే బెలూన్‌లు గాలిలో తేమనూ, ఉష్ణోగ్రతనూ ఇట్టే చెప్పగలుగుతుండగా ఉపగ్రహాలు నేల పరిస్థితుల గురించి సమాచారం ఇస్తున్నాయి.

స్వాతంత్య్రానంతరం వాతావరణాన్ని కొలవటానికి రాడార్ల వంటి ఉపకరణాలు అందుబాటు లోకొచ్చాయి. 1971లో తొలి తుపాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే, 1990ల్లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల కచ్చితత్వం పెరిగింది. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగిన అధునాతన సూపర్‌ కంప్యూటర్‌ వినియోగం మొదలయ్యాక రుతుపవనాలు, తుపానుల గురించి మాత్రమే కాదు... వడగాల్పులు, వరదల వంటి వైపరీత్యాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు. 

మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతం కేవలం వర్షాధారం కావటం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీవనాధారం వ్యవసాయమే కావటం వల్ల ఐఎండీ చెప్పే అంచనాలు ఎంతో అవసరం. అందుకే వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వీచవచ్చో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదో కూడా పదేళ్లుగా చెప్పగలుగుతోంది. కృత్రిమ మేధ దీన్ని మరింత పదునెక్కించింది.

ఐఎండీ అంచనాల వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమై లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వేలాది ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమవుతోంది. ఇది మున్ముందు ఇంకా విస్తరించి కనీసం అయిదురోజుల ముందు 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలనీ, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలనీ ఐఎండీ 2047 విజన్‌ డాక్యుమెంటు విడుదల సందర్భంగా మోదీ చేసిన సూచన శిరోధార్యం. 

ఈ అంచనాలు మన దేశానికి మాత్రమే కాదు...ఆసియా ప్రాంత దేశాలకు సైతం ఎంతో మేలుచేస్తాయి. పంటల దిగుబడిపై, ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై మరింత  మెరుగైన అంచనాలకు తోడ్పడతాయి.  

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)