Breaking News

వేట్లపాలెం దోషులెవరు?

Published on Wed, 03/04/2026 - 01:28

అంటించి వదిలేస్తే చాలు నింగిలోకి దూసుకెళ్తూ, ఆ వెంటనే ఆకాశాన్ని దేదీప్యమానం చేస్తూ, నక్షత్రాలు రాలుస్తూ, రంగురంగుల పొగలు కక్కుతూ, చిత్రమైన ధ్వనులు చేస్తూ అబ్బురపరిచే బాణాసంచా తయారీ ప్రాణాంతకమైన పరిశ్రమ. అక్కడ పనిచేయటం నిప్పుతో చెలగాటం. చిన్న ఏమరుపాటు సైతం పెను నష్టానికి కారణమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలో శనివారం మిట్టమధ్యాహ్నం ఒక బాణాసంచా గోడౌన్‌లో రెండు గంటల పాటు నిరంతరాయంగా జరిగిన పేలుళ్ల పర్యవ సానంగా ఇంతవరకూ 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం భద్రత, పర్యవేక్షణల్లో మరోసారి మన డొల్లతనాన్ని చాటింది. పేలుడు ధాటి ఏ స్థాయిలో ఉందంటే... శరీర భాగాలు ఛిద్రమై విసిరేసినట్టు పడ్డాయి. కేవలం నలుగురు మాత్రమే ఉండాల్సిన ఘటనాస్థలిలో పేలుడు సమయంలో 45 మంది ఉన్నారని అంటున్నారు. 

ఈ ఉదంతంలో మరో 11 మందికి గాయాలయ్యాయి. ఇంత జరిగాక అక్కడకు పోయిన మంత్రులు నమోదైన సంఖ్యకు మించి పనివారిని అక్కడుంచారనీ, పరిమితి కన్నా ఎక్కువగా పేలుడు పదార్థాలు నిల్వ చేశారనీ, అధికారుల పర్యవేక్షణ లేనేలేదనీ చెబుతున్నారు. ఇవన్నీ తమ పాలన నిర్వాకమేనని... జరిగిన విషాదంలో తమకూ నైతిక బాధ్యత ఉంటుందనీ వారికెవరు చెప్పాలి? కార్మిక శాఖ పట్టించుకోదు. పోలీసు నిఘా ఉండదు. అగ్నిమాపక విభాగానికి అసలే పట్టదు. ఆ రోడ్డు పక్కనుంచి తరచూ మంత్రులు, వారి అనుచరగణం రాకపోకలు సాగిస్తున్నా, పొలాల మధ్యలో అక్కడ సాగుతున్న కార్యకలా పాలేమిటన్న ఆరా ఉండదు. కనీసం అధికారుల్ని అడిగి తెలుసుకుందామన్న స్పృహ కూడా ఉండదు. ఇక ఇటువంటి ఘోరాలు చోటుచేసుకోవటంలో ఆశ్చర్యమేముంది? 

ఇలాంటి ఘటనల్ని ప్రమాదాలంటాం గానీ... నిజానికి అవి ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం కారణంగా దాపురించే ఘోరాలు. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు వాటి అమలును పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అందుకే బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేయటం, పర్యవేక్షించటంలో విఫలమైన ఉన్నతాధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవటం వంటివి తప్పనిసరి చేయాలి. కానీ అలాంటివేమీ జరగటం లేదు. నిబంధనలకేం... చాలా ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలనీ, ఆ కేంద్రంలో నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, తేమ ఉండాలనీ, షెడ్ల నిర్మాణానికి వినియోగించే సామగ్రి కనీసం రెండు గంటలపాటు అగ్నిని నిరోధించగలగాలనీ, బాణసంచా పనిలో ఉండేవారు ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలనీ, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిందేమిటో అవగాహన కలిగి ఉండాలనీ నిబంధనలు చెబుతున్నాయి. ఇంకా ప్రాథమిక వైద్య సదుపాయం, అగ్నిమాపక సిలెండర్లు, అయిదు ట్రక్కుల పొడి ఇసుక, నీరు నింపిన బకెట్లు అందుబాటులో ఉంచాలి. కానీ ఇవన్నీ అమలవుతున్నాయో లేదో చూసేదెవరు? 

దేశంలోని బాణసంచా పరిశ్రమల్లో చిన్నవో, పెద్దవో తరచు ప్రమాదాలు జరుగు తూనే ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో, కార్మికుల భద్రత గురించి శ్రద్ధ చూపటంలో నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. ప్రమాదం జరిగినప్పుడల్లా ప్రదర్శించే హడా విడి మరికొన్ని రోజులకే కనుమరుగవుతుంది. మళ్లీ మరొకటి జరిగేవరకూ అంతా సవ్యంగానే ఉందన్న భ్రమ ఆవరిస్తుంది. సాధారణ సమయాల మాటెలా ఉన్నా కనీసం పండు గలు, శుభకార్యాల సమయాల్లోనైనా బాణసంచా పరిశ్రమలపై దృష్టిపెట్టాలన్న ఇంగిత జ్ఞానం అధికార యంత్రాంగంలో లోపిస్తోంది. డిమాండ్‌ అధికంగా ఉన్నప్పుడు రోజుకు దాదాపు 12 గంటలసేపు పనిచేయిస్తారు. కార్మికులు ఊపిరి తీసుకోవటానికి కూడా వ్యవధి చిక్కనంతగా పనిలో ఉంటారు. సరిగ్గా అప్పుడే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.

వేట్లపాలెం ఉదంతమైనా పాలకుల కళ్లు తెరిపించాలి. అధికారులు నిర్ణీత వ్యవధిలో క్రమం తప్పకుండా బాణసంచా తయారీ కేంద్రాలను సందర్శించేలా, లోటుపాట్లు గుర్తించినప్పుడు కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు ఏర్పరచాలి. కార్మిక శాఖ, పోలీసు, అగ్నిమాపక, విభాగాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి. వాటిమధ్య సమన్వయం ఉండాలి. ఇవేమీ లేకుండా మీడియా కోసం ఆగ్రహావేశాలు నటించటం వల్ల ప్రయోజనం ఉండదు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)