Breaking News

ట్రంప్‌ ‘ఫెడరల్‌’ పరీక్ష!

Published on Wed, 06/11/2025 - 00:56

వలసలను అరికట్టి తీరతానని వాగ్దానం చేసి గద్దెనెక్కిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అందుకోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ఏంజెలెస్‌ నగరంలోని ఒక ప్రాంతంలో అక్రమ వలసదారుల ఏరివేతకు వచ్చిన ప్రతిఘటన సాకుతో ఆరున్నర దశాబ్దాల తర్వాత ఆ రాష్ట్రం అనుమతి లేకుండా ఆదివారం కేంద్ర బలగాలను పంపారు. 

డెమాక్రటిక్‌ ఏలుబడిలోని ఆ రాష్ట్రానికి అలా సవాలు విసిరారు. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన గవ ర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ను అరెస్టు చేయిస్తానని, ఆ రాష్ట్రానికి నిధులు నిలిపేస్తానని హెచ్చరించారు. అందుకు ప్రతిగా క్యాలిఫోర్నియా నుంచి పన్నుల రూపంలో ఫెడరల్‌ ప్రభుత్వానికి వెళ్లే 8,000 కోట్ల డాలర్ల నిధుల్ని ఆపేస్తామని న్యూసమ్‌ జవాబిచ్చారు. అంతేకాదు... చట్టవిరుద్ధంగా ఫెడరల్‌ బలగాలను పంపిన ట్రంప్‌ తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. 

మొత్తానికి అమల్లో ఉన్న వలస విధానంపై కొన్నేళ్లుగా అంతర్గతంగా రాజుకుంటున్న అసంతృప్తి క్యాలిఫోర్నియాలో భళ్లున బద్దలైంది. నాలుగు లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో సొంతంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే నాలుగో స్థానాన్ని ఆక్రమించగలిగిన క్యాలిఫోర్నియాలో అపరిమితమైన సంపద ఉన్నట్టే దాన్ని ఆశ్రయించి వలసలూ అధికంగా ఉన్నాయి. 

ముఖ్యంగా మెక్సికో నుంచి ఏటా వచ్చే వేలాదిమంది అక్కడ చిన్నాచితకా పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటారు. స్థానికంగా ఉండే శ్వేత జాతి అమెరికన్లకు ఈ వలసలపై ఆగ్రహావేశాలున్నాయి. దీన్ని సకాలంలో సరిచేయటంలో డెమాక్రాట్లు విఫలమైన కారణంగానే ట్రంప్‌ వంటి దూకుడైన నేత అమెరికా రాజకీయాల్లో ఆవిర్భవించారు. 

వర్తమాన స్థితిని ఇలాగే కొనసాగనీయదల్చుకుంటే ట్రంప్‌ ప్రత్యేకతేముంది? దీన్ని సాకుగా తీసుకుని మరింత ముందుకు చొచ్చుకుపోయేందుకు ఆయన రెడీ అయ్యారు. అలబామాలో పౌర హక్కుల యాత్రకు అక్కడి ప్రభుత్వం ఆటంకం కలిగించవచ్చునన్న సంశయంతో ఆరున్నర దశాబ్దాల క్రితం అప్పటి అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ గవర్నర్‌ అనుమతి లేకుండా ఫెడరల్‌ బలగాలను పంపారు. 

ఇంకా వెనక్కివెళ్తే 1860ల్లో అప్పటి అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ ఈ మాదిరే బలగాలను తరలించిన ఉదంతం ఉంది. ఎన్నడో 1807లో అమెరికాలో తిరుగుబాటు చట్టాన్ని రూపొందించారు. ఏ రాష్ట్రమైనా ఫెడరల్‌ ప్రభుత్వంపై తిరగబడి ఆత్యయిక స్థితి ఏర్పడితే మెరైన్‌లను రంగంలోకి దించి వాటిని అణిచేయటం దీని ఉద్దేశం. అప్పట్లో అంతర్యుద్ధాలూ, కొన్ని రాష్ట్రాలు జట్టుకట్టి ఫెడరల్‌ సర్కారుపై తిరుగుబాటుకు సిద్ధపడటం వగైరా పరిస్థితులను ఎదుర్కొనటానికి ఈ చట్టం తీసుకొచ్చారు. 

అయితే ఈ అరవయ్యేళ్లలోనూ ఫెడరల్‌ బలగాలను పంపాల్సిన సందర్భాలు రాలేదని కాదు. 1992లో రోడ్నీ కింగ్‌ అనే నల్లజాతీయుణ్ణి అత్యంత దారుణంగా హింసించిన కేసులో పోలీసులు నిర్దోషులని తీర్పు వెలువడినప్పుడు ఇదే లాస్‌ ఏంజెలెస్‌ దాదాపు వారంరోజుల పాటు అట్టుడికిపోయింది. 50 మంది మరణించటంతో పాటు వందలాది భవంతులు ధ్వంస మయ్యాయి. 

వేలాది కార్లకు నిప్పుపెట్టారు. ఇప్పుడలా కాదు. నగరంలోని ఒక బ్లాక్‌లో దాదాపు 200 మంది మెక్సికన్‌ కార్మికులు ఆదివారం ఆందోళనకు దిగారు. కార్లు తగలబెట్టడం, లూటీలు, ఫెడరల్‌ భవంతులపై రాళ్లు రువ్వటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. క్యాలిఫోర్నియా పోలీ సులే చాలావరకూ అదుపులోకి తెచ్చారు. ఆ ఆందోళన పెద్దగా విస్తరించింది కూడా లేదు.

కానీ ట్రంప్‌ దీన్ని వదలదల్చుకోలేదు. 2020లో తన తొలి ఏలుబడి కాలంలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసులు ఊపిరాడకుండా చేసి హతమార్చిన ఉదంతం సమయంలో తీవ్ర హింస చెలరేగినా ట్రంప్‌ ముందుకు కదల్లేకపోయారు. ఆనాటి రక్షణమంత్రి మార్క్‌ ఏస్పర్, సైనిక బలగాల చీఫ్, అటార్నీ జనరల్‌ ఫెడరల్‌ బలగాలను పంపటం ప్రమాదకరమని వారించారు. 

అందుకే ఈసారి అలాంటివారిని దూరంకొట్టి నిర్విచక్షణగా తనకు మద్దతునిచ్చేవారిని చేరదీశారు. ఇప్పుడు క్యాలిఫోర్నియాకు కేంద్ర బలగాలను పంపాలని నిర్ణయించగానే రక్షణమంత్రి హెగ్సెత్, అటార్నీ జనరల్‌ బోండీ మద్దతుగా నిలిచారు. ట్రంప్‌ పని సులభమైంది. 

రెండోసారి అధికారంలోకొచ్చాక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న విధానాన్ని ట్రంప్‌ పాటిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధాన్ని నిరసిస్తూ విశ్వవిద్యాలయాల్లో చెలరేగిన ఉద్యమం విషయంలో ఆయన ఏం చేశారో ప్రపంచమంతా చూసింది. అందులో పాల్గొన్నవారిని దేశద్రోహులుగా పరిగణించి, సంకెళ్లువేసి జైళ్లకు తరలించటం, దేశం నుంచి గెంటేయటం రివాజుగా మారింది. 

ప్రస్తుత క్యాలిఫోర్నియా అల్లర్లపైనా ఆయన ఆ వైఖరే తీసుకున్నారు. అసలు తిరుగు బాటు చట్టం అమలును ప్రకటించకుండానే, గవర్నర్‌కు వర్తమానం పంపకుండానే 2,000 మంది బలగాలను అక్కడికి తరలించటం అమల్లోవున్న సంప్రదాయాలను ధిక్కరించటమే! ఏ పార్టీకి చెందిన దేశాధ్యక్షులైనా గతంలో ఇలాంటి దుస్సాహసానికి దిగలేదు. కానీ ఉన్న అధికారాలను మాత్రమే కాదు... ఎక్కడాలేని, ఏనాడూ ఎవరూ వినియోగించని అధికారాలను సైతం దబాయించి అమలు చేయించే నైజం ట్రంప్‌ది. 

లాస్‌ ఏంజెలెస్‌ అల్లర్ల వంటివి ట్రంప్‌కు చేజేతులా ఆ అవకాశాన్నిస్తున్నాయి. అక్కడ చెలరేగిన హింస, అందులో మెక్సికన్‌ జాతీయ జెండాల ప్రదర్శన స్థానికుల్లో ఆగ్రహావేశాలను రగిలించాయి. విద్వేషాన్ని పెంచాయి. హింసతో దేన్నయినా సాధించు కోవచ్చన్న మనస్తత్వం వికటిస్తుందని ఉద్యమకారులు తెలుసుకోవటం అవసరం. పరిస్థితిని అదుపు చేయటానికి క్యాలిఫోర్నియా ప్రభుత్వానికి సహకరించటమే వారికి శ్రేయస్కరం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)