Breaking News

స్వీయ విధ్వంసక విధానాలు

Published on Fri, 05/30/2025 - 01:50

మొన్న జనవరి నుంచీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పాలన చూస్తున్నవారికి రేపో మాపో ఆయన మహాద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారన్న భ్రమలు తొలగిపోయి చాన్నాళ్లయి వుంటుంది. నిన్న మొన్నటి నిర్ణయాల కన్నా ఆయన తాజాగా ప్రకటించిన విధానం ఎంత అధ్వాన్నంగా వున్నదో బేరీజు వేసుకోవటమే ఇప్పుడు మిగిలింది. విద్యార్థుల్ని, వృత్తిగత నిపుణుల్ని భయాందోళనల్లో పడేసే బుధవారం నాటి నిర్ణయం ఈ కోవలోనిదే. 

చదువుల నిమిత్తం జారీచేసే వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేస్తూ అమెరికా ప్రభుత్వం తీసు కున్న ఆ నిర్ణయం మన దేశం నుంచి వెళ్లదల్చుకున్న లక్షలమంది విద్యార్థుల్ని అయోమయంలోకి నెట్టింది. ఇందులో బిజినెస్‌ స్కూళ్లలో చదవదల్చుకుని, చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎదురుచూస్తున్నవారు కూడా వున్నారు. 

ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలకు తేదీలు ఖరారైనవారి పరిస్థితి కొంత మేలు. అక్కడ చదువుకునే యోగంవుందో లేదో ఫలానా తేదీకల్లా తెలిసిపోతుందన్న ఆశయినా వారికుంటుంది. కానీ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నవారికి తిరిగి ఆ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో... వుంటుందో, వుండదో తెలియదు. ఎంపిక ప్రక్రియకు అనుసరించ బోయే నిబంధనలు అన్ని రకాల వారినీ కలవరపరుస్తున్నాయి. 

విద్యార్థి వీసాలూ, ఎక్చ్సేంజ్‌ విజిటర్‌ వీసాల ఇంటర్వ్యూలూ మళ్లీ చెప్పేవరకూ నిలిపేయాలని అమెరికా విదేశాంగ శాఖ తన దౌత్య కార్యాలయాలకూ, కాన్సుల్‌ కార్యాలయాలకూ ఆదేశాలిచ్చిందన్న కథనాలు గుప్పుమనడంతో అందరూ ఆందోళన పడుతున్నారు. దీనిపై విదేశాంగ శాఖ అర కొర వివరణ ఇచ్చింది. 

వీసా దరఖాస్తుల స్వీకరణ ఆగదట. వాటి ఇంటర్వ్యూలు ఎప్పుడుంటాయో మాత్రం చెప్పలేదు. క్రమబద్ధంగా సాగే ఇంటర్వ్యూలను ఆపేసి దరఖాస్తుల స్వీకరణ కొనసాగిస్తుంటే అవి ఓ కొలిక్కి వచ్చేందుకు ఎంతకాలం పడుతుంది? ఈ జాప్యం వల్ల యువత విద్యాసంవత్సరం నష్టపోయే ప్రమాదం లేదా? అమెరికాలో మాత్రమే చదవాలనుకున్నవారి సంగతలా వుంచి, అక్కడికెళ్లే అవకాశం రానట్టయితే వేరే దేశంలో ప్రయత్నించాలనుకునేవారి గతేమిటి? అమెరికా సంగతి తేలేసరికి వేరేచోట గడువు ముగిసిపోయే ప్రమాదం లేదా! కుప్పలు తెప్పలుగా వచ్చిపడిన దరఖాస్తులను తాజా నిబంధనలకు అనుగుణంగా జల్లెడ పట్టడానికి ఇప్పుడున్న సిబ్బంది సరి పోతారా? పోనీ అందుకోసం భారీయెత్తున సిబ్బందిని మోహరిస్తారా? వీటికి జవాబు లేదు.

సరిగ్గా వీసా ఇంటర్వ్యూలు నిలిపేయటానికి ముందురోజు అమెరికా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు చేసిన హెచ్చరిక గమనిస్తే అక్కడి వాతావరణం ఏమంత మెరుగ్గా లేదని తెలుస్తుంది. ఇప్పటికే అమెరికాలోని విద్యాసంస్థల్లో చదివేవారు తరగతులు ఎగ్గొట్టినా, మధ్యలో విరమించు కున్నా, ఎంపిక చేసుకున్న ప్రోగ్రాంను చెప్పాపెట్టకుండా వదిలేసినా భవిష్యత్తులో వీసాలకు అర్హత కోల్పోతారన్నది దాని సారాంశం. 

వేరే దేశానికి పోయినప్పుడు అక్కడి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. ఉల్లంఘనలను ఎవరూ సమర్థించరు. అత్యధికులు చదువుల కోసం బ్యాంకు రుణాలు తీసుకుని అక్కడికి వెళ్తారు. మనుగడకు అవసరమైన డబ్బు సంపాదనపై దృష్టి పెడతారు. ఇది నిబంధనలకు విరుద్ధమే కావొచ్చు... కానీ అలాంటి తప్పులకు సైతం ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ మాదిరి ఏకంగా దేశం నుంచి పంపేయటం ఎంతవరకూ సబబు?

దరఖాస్తుదారుల రాజకీయ అభిప్రాయాలేమిటో తెలుసుకునేందుకు వారి సోషల్‌ మీడియా ఖాతాలు తనిఖీ చేస్తారన్న వార్త చాలామందిని కలవరపరుస్తోంది. ఇన్ని శతాబ్దాల చరిత్రలో విద్యా ర్థులకుండే రాజకీయాభిప్రాయాల వల్ల అమెరికా నష్టపోయింది లేదు. 

ఆ యూనివర్సిటీల్లో చదువు కున్న మన ప్రముఖుల్లో మన్మోహన్‌ సింగ్, సుబ్రహ్మణ్యస్వామి, కపిల్‌ సిబల్, శశిథరూర్, చిదంబరం, రాహుల్‌గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, మహువా మొయిత్రా, సల్మాన్‌ ఖుర్షీద్, అఖిలేశ్‌ యాదవ్, జైరాం రమేష్‌ తదితరులున్నారు. అనేకమంది పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ రంగ నిపుణులు అక్కడ చదివి అక్కడే సంస్థలు స్థాపించి లక్షలమందికి ఉపాధి కల్పించారు. వారి వల్ల అమెరికా బాగుపడిందేగానీ చెడిందెక్కడ? ఈ చరిత్ర ట్రంప్‌కు తెలిసేదెలా? చెప్పేదెవరు?

చదువులకైనా, ఉద్యోగాలకైనా అమెరికా వైపు చూడటానికి కారణం అక్కడి స్వేచ్ఛాయుత, వైవిధ్యభరిత సంస్కృతి. ప్రామాణిక విద్య లభించటం, విభిన్నంగా ఆలోచించటానికీ, మెరుగైన ప్రాపంచిక దృక్పథం ఏర్పర్చుకోవటానికీ అవకాశం ఉండటం. పర్యవసానంగా ఎక్కువ లాభ పడింది అమెరికాయే. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఆనాటి సోవియెట్‌పై కావొచ్చు, అనంతరకాలంలో చైనాపై కావొచ్చు మేధారంగంలో పైచేయి సాధించేందుకు ఇవన్నీ తోడ్పడ్డాయి. 

దేశ ఆర్థిక పురో గతిలో చదువుల కోసం వెళ్లినవారి పాత్ర కీలకం. ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో వలస ప్రజలూ లేదా వారి సంతతి నెలకొల్పిన సంస్థల వాటా గణనీయం. ఈ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా వందల కోట్ల డాలర్లు ఆర్జించి పెడుతున్నాయి. వీటన్నిటినీ విస్మరించి ట్రంప్‌ ప్రతిదాన్నీ తలకిందులుగా చూస్తున్నారు. 

తన ప్రియమైన ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లో సాగిన నిరసనోద్యమాలు ఆయనకు ఆగ్రహం తెప్పించినట్టున్నాయి. తప్పుడు నిర్ణయాల వల్ల అంతిమంగా నష్ట పోయేది అమెరికాయే. ఇకపై యువత యూరప్‌ వైపు దృష్టి సారిస్తారు. ఫలితంగా అమెరికా విశ్వ విద్యాలయాల ఆర్జన పడిపోతుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఊపిరాడనీయని అక్కడి వాతావరణం చివరకు అందరూ ఆ దేశం నుంచి నిష్క్రమించటానికే దారితీస్తుంది. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)