పాక్‌కు బలూచ్‌ సవాలు!

Published on Thu, 02/05/2026 - 01:13

బలూచిస్తాన్‌ స్వాతంత్య్ర కాంక్షను ఉక్కుపాదాల కింద తొక్కివుంచాలని ఏడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌ పాలకులకు యథాప్రకారం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత వారం చివరిలో తొమ్మిది జిల్లాల్లో కొనసాగించిన ఆత్మాహుతి దాడుల్లో బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) 84 మంది పాక్‌ సైనికుల్ని హతమార్చి, మరో 18 మందిని అపహరించింది. ప్రతీకారంగా తాము జరిపిన దాడుల్లో 133 మంది బీఎల్‌ఏ మిలిటెంట్లు చనిపోయారని పాక్‌ సైన్యం ప్రకటించింది. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్‌ భాషనూ, సంస్కృతినీ విస్మరించిన పర్యవసానంగా అది విడివడి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించిన సంగతి తెలిసి కూడా దేశంలో 40 శాతం భూభాగం గల బలూచిస్తాన్‌ను పాక్‌ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోటిన్నరమంది జనాభా నివసించే ఆ ప్రాంతానికి ఒకపక్క అఫ్గానిస్తాన్, మరోపక్క ఇరాన్, మూడోవైపు అరేబియా సముద్రం ఉండగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అత్యధిక భూభాగంలో భూగర్భ జలాలే ఆధారం. అక్కడ పండే యాపిల్స్, ద్రాక్ష, బాదం, ఖర్జూరం వగైరాలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. పాక్‌ పండ్ల ఎగుమతుల్లో 90 శాతం వాటా బలూచిస్తాన్‌ ప్రాంతానిదే. నీటి పారుదల సదుపాయం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో గోధుమ, వరి, బార్లీ, ఆలుగడ్డ పండుతాయి. 

ఇంతగా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నా బలూచిస్తాన్‌ అభివృద్ధిని పాలకులు పూర్తిగా మరిచిపోయారు. అక్కడి భూపొరల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. రాగి, సీసం, క్రోమైట్, గ్రానైట్, జింకు వగైరాలున్నాయి. చమురు, సహజ వాయువు, బొగ్గు, బంగారం ఉన్నాయి. వీటిల్లో బంగారం, రాగి గనుల నిర్వహణ చైనా చేతుల్లో ఉంది. అది పెట్టుబడి పెట్టి నిర్మించిన గ్వాదర్‌ నౌకాశ్రయం బలూచిస్తాన్‌ ప్రాంతం లోనిదే. 6,500 కోట్ల డాలర్లతో చైనా నిర్మించతలపెట్టిన చైనా–పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ చైనాలోని షిన్‌జియాంగ్‌ నుంచి గ్వాదర్‌ వరకూ ఉంటుంది. చైనా దోపిడీ చాలలేదన్నట్టు నిరుడు సెప్టెంబర్‌లో అమెరికా కూడా వచ్చింది. ఆ దేశానికి చెందిన బహుళ జాతి సంస్థ స్ట్రాటజిక్‌ మెటల్స్‌తో పాక్‌ సైన్యం అనుబంధ సంస్థ 50 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.  ఇదంతా ఆ ప్రాంత అభివృద్ధి కోసమేనంటూ ప్రభుత్వం చెబుతున్నదంతా బూటకమనీ, గ్వాదర్‌ నౌకాశ్రయం తర్వాత తమ మత్స్యకారులు జీవిక కోల్పోయారనీ, గుక్కెడు మంచినీళ్లు దొరకడం కూడా కష్టమవుతున్నదనీ బీఎల్‌ఏ ఆరోపణ.  

పాకిస్తాన్‌ ఆవిర్భవించాక 1948లో బలూచిస్తాన్‌ను బలవంతంగా విలీనం చేసుకుంది. అప్పటి నుంచి తిరుగుబాట్లు సాగుతూనే ఉన్నాయి. అణిచేద్దామని చూసిన ప్రతి సారీ అవి మరింత తీవ్రంగా పోటెత్తుతున్నాయి. పాక్‌ సంస్కృతి, సంప్రదాయాలతో తమకేమాత్రం పోలిక ఉండదని, ఒక దేశంగా ఉంటేనే అస్తిత్వ పరిరక్షణ, అభివృద్ధి సాధ్యమని ఆ ప్రాంతవాసుల వాదన. ఇందుకోసం వామపక్ష భావాలతో ప్రభావితుడైన మీర్‌ గౌస్‌ బిజెంజో ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిధిలో పోరాటాలు జరిగాయి. పాక్‌ పరిధిలోనే స్వయంపాలనకు హామీ ఇవ్వాలన్న డిమాండ్‌తో నేషనల్‌ అవామీ పార్టీ (ఎన్‌ఏపీ) ఏర్పాటు చేసి, 1970 ఎన్నికల్లో బలూచిస్తాన్, ప్రస్తుత ఖైబర్‌ ఫఖ్తూన్‌ఖ్వా ప్రాంతాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మరో మూడేళ్లకే అప్పటి జుల్ఫికర్‌ అలీ భుట్టో ప్రభుత్వం సైనిక చర్య ద్వారా ఆ రెండు ప్రభుత్వాలనూ కూలదోసింది. ఈ అప్రజాస్వామిక చర్యే అనంతర కాలంలో మిలిటెన్సీకి బీజం వేసింది. 

బలూచిస్తాన్‌లో పాక్‌ సైన్యం చేయని దురాగతం లేదు. బలూచ్‌ యూనివర్సిటీలోనూ, వెలుపలా యువతను అపహరించటం, హతమార్చటం దానికి అలవాటైన విద్య. 2011 నుంచి ఇంతవరకూ 10,000 మంది మాయమయ్యారంటే ఇదెంతగా ఉందో అంచనా వేయొచ్చు. 2018 తర్వాత బలూచ్‌ మిలిటెంట్‌ సంస్థలు ఏకం కావటంతో పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. నిరుడు మార్చిలో జాఫర్‌ఖాన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్‌ చేయటం మొదలుకొని పాక్‌ సైన్యంపై సాగిస్తున్న నిరంతర దాడులు పాలకుల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి. చారిత్రక ఆకాంక్షలను అణగదొక్కి, అభివృద్ధిని విస్మరించే ఏ పాలకులకైనా ఇదే దుఃస్థితి ఎదురవుతుంది. తప్పు తెలుసుకోకుండా, గుణపాఠం నేర్చుకోకుండా, మిలిటెంట్లకు భారత్‌ మద్దతుందని అనవసర యాగీ చేయటం పాక్‌ పాలకుల నిస్సహాయతకు అద్దం పడుతోంది.  

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)