Breaking News

‘అఖిలపక్షం వేళ’ అనైక్యత!

Published on Wed, 05/21/2025 - 01:10

దేశం కోసం సమష్టిగా కదలాల్సిన సందర్భాల్లో సైతం కలవలేనంతగా అధికార విపక్షాలు ఎడ మొహం పెడమొహంగా మారాయి. పెహల్‌గామ్‌లో గత నెల 22న ఉగ్రవాదులు సాగించిన మారణ కాండ మొదలు మన ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్, ఈ నెల 10న కాల్పుల విరమణ, పాకిస్తాన్‌ దురాలోచనలూ వగైరా ప్రపంచానికి తెలియజెప్పేందుకు అధికార, విపక్ష ఎంపీలతో ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష బృందాల కూర్పు ప్రక్రియ వివాదాస్పదంగా మారటం దీన్ని చాటుతోంది. 

మన దేశంనుంచి సమష్టి స్వరం వినబడితే దాని ప్రభావం వేరుగా వుంటుంది. పాకిస్తాన్‌ సైతం ఇదే తరహాలో అఖిలపక్ష ప్రతినిధి బృందాలను పంపటానికి సన్నాహాలు చేసుకుంటున్నది. కనీసం ఇందుకోసమైనా విభేదాలు పక్కనబెట్టి ఒక్కటై నిలబడదామన్న స్పృహ అటూ ఇటూ కరువవుతోంది. ఏ దేశంలోనూ ఇలా వుండదు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్ల్యూటీసీ)పై ఉగ్రదాడి మొదలు ఇందుకు ఎన్నయినా ఉదాహరణలివ్వొచ్చు. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరుతో అమెరికా అఫ్గాన్‌ను వల్లకాడు చేసింది. చివరకు ఒరిగిందేమీ లేదు. 

అఫ్గాన్‌నుంచి అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. అయినా అక్కడి విపక్షం మౌనంగా ఉండిపోయింది. కానీ ఇక్కడలా కాదు. యూపీఏ హయాంలో ముంబైపై ఉగ్రదాడి, దానికి వెనకాముందూ జరిగిన అనేకానేక ఉదంతాల్లో మన దేశంలో అధికార పక్షంపై విపక్షం విరుచుకుపడటం, యక్షప్రశ్నలు వేసి ఇరుకున పడేసే ప్రయత్నం చేయటం రివాజుగా మారింది. 

యూపీఏ హయాంలో బీజేపీ విపక్షంలోవుండి ఏం చేసేదో, ఇప్పుడు కాంగ్రెస్‌ సైతం ఆ పనే చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడి సమయంలో మరీ దారుణం. జవాన్ల త్యాగాలూ, వారు దెబ్బకు దెబ్బ తీసిన వైనమూ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో చర్చనీయాంశంగా మారటం ఆశ్చర్యపరిచింది. ఈ ఉదంతాలను బీజేపీ తనకను కూలంగా మలుచుకునే ప్రయత్నం చేయగా, ప్రభుత్వ వైఫల్యంపై విపక్షం చాటింపు వేసింది. 

అయితే మన దేశంలోనూ ఒకప్పుడు అధికార, విపక్షాలు కలిసికట్టుగా పనిచేసిన ఉదంతాలు లేకపోలేదు. ఇందుకోసం ఎన్నడో 1971 నాటి భారత్‌–పాక్‌ యుద్ధం వరకూ పోనవసరం లేదు. 1994లో కశ్మీర్‌పై భారత్‌ వైఖరిని వివరించటానికి నాటి ప్రధాని పీవీ నరసింహారావు రూపొందించిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించింది అప్పటి విపక్ష నేత అటల్‌ బిహారీ వాజపేయి! పాతికేళ్ల క్రితం కార్గిల్‌ యుద్ధ సమయంలో నాటి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ, కాంగ్రెస్‌తోసహా విపక్షాలూ దేశభద్రత కోసం కలిసికట్టుగా పనిచేశాయి. 

కానీ ఇప్పుడెందుకు పరస్పరం తప్పులు వెదుక్కొనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నట్టు? దేశంలో తక్షణం వచ్చే ఎన్నికలేమీ లేవు. అయినా పెహల్‌గామ్‌ను రాజకీయంగా వినియోగించుకోవటానికి అటూ ఇటూ పోటీపడుతున్నారు. త్రివిధ దళాల అధికార ప్రతినిధులు చెప్పేవరకూ ఆగకుండా ఇష్టానుసారం ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి, విపక్షాలను పాకిస్తాన్‌ అనుకూలురుగా, దేశద్రోహులుగా చూపటానికి బీజేపీ శ్రేణులూ, సాను భూతిపరులూ చేయని ప్రయత్నం లేదు. 

తొలి ప్రధాని నెహ్రూ ఉదారంగా పాకిస్తాన్‌కు నదీజలాలు, భారీయెత్తున సొమ్ము కట్టబెట్టారని బీజేపీ నేతలు ఇంకా ఆరోపణలు గుప్పిస్తూనే వున్నారు. ఒకపక్క అఖిలపక్షాన్ని పంపుతూ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? వీటిని ఎలా ఎదుర్కొనాలో తెలియక ఇష్టానుసారం మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు చులకనవుతున్నారు. యుద్ధ విమానాలు ఎన్ని కూలాయి... మనవైపు జరిగిన నష్టమెంత అంటూ రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఇవి అడగకూడని ప్రశ్నలేమీ కాదు... కానీ అందుకు తగిన వేదికను ఎంచుకోవాలని కూడా ఆయనకు తోచదు. 

ఇంతకూ అఖిలపక్ష బృందాల కూర్పుపై ఇంత వివాదం ఎందుకొచ్చినట్టు? విపక్షాలను విశ్వా సంలోకి తీసుకుని, వారు పంపిన పేర్లనుంచి ఎంపికచేసే కనీస మర్యాద అధికార పక్షం పాటించివుంటే సమస్య తలెత్తేది కాదు. విపక్షానికి ఆలోచించే శక్తిసామర్థ్యాలు లేవన్నట్టు సర్కారు ప్రవర్తించింది. కాంగ్రెస్‌ పార్టీ నలుగురు సభ్యుల పేర్లు పంపితే వారిలో ఒక్కరినే ఎంపిక చేసింది. 

పోనీ సర్కారు ఎంచుకున్నది కూడా సమర్థుల్నే కదా అనే సర్దుబాటు ధోరణి కాంగ్రెస్‌కు లేదు. అసలు ఆ పార్టీ నుంచి వెళ్లిన జాబితాలో సల్మాన్‌ ఖుర్షీద్, శశిథరూర్, మనీష్‌ తివారీ తదితరుల పేర్లు ఎందుకు లేకుండా పోయినట్టు? సీనియర్‌ నేత ఖుర్షీద్‌ను ఎంపిక చేసిన ప్రభుత్వం తీరా ఆయన సీనియారి టీని కాదని జేడీ(యూ) నేత సంజయ్‌ ఝాకు సారథ్య బాధ్యతలు ఎందుకిచ్చినట్టు? సమష్టి స్వరం వినబడాల్సిన ఈ సమయంలో ఇన్ని లుకలుకలుండటం మంచిదేనా? ఇంత రాద్ధాంతం చేసిన కాంగ్రెస్‌ చివరకు ఈ వివాదాన్ని పొడిగించదల్చుకోలేదని చేతులెత్తేసింది. 

కానీ ఎప్పుడూ వీరంగం వేసే అలవాటున్న తృణమూల్‌ మాత్రం ప్రభుత్వం ఎంపిక చేసిన సభ్యుణ్ణి తప్పుకోమని చెప్పింది. దాంతో ప్రభుత్వం తగ్గి ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ సూచించిన నేతకు స్థానం కల్పించింది. 

అఖిలపక్షం పంపటంలోని ఉద్దేశమే సమష్టితత్వాన్ని, ఈ దేశ సంకల్పాన్ని, పాకిస్తాన్‌ కుయుక్తులను చాటడానికైనప్పుడు సభ్యుల ఎంపిక వివాదాస్పదం కాకుండా ప్రభుత్వం చూడాల్సింది. ఈమధ్య ఆపరేషన్‌ సిందూర్‌ మొదలుకొని పార్టీ వైఖరికి భిన్నంగా పలు ప్రకటనలిస్తూ సంచలనం సృష్టిస్తున్న శశిథరూర్‌ను కాంగ్రెస్‌ ఎంపిక చేయకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన్ను ఏరికోరి ఎంపిక చేయటం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టడానికేనన్న విషయంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. ఏదేమైనా ఇలాంటి సంక్షోభ సమయాల్లో అవసరమైన సంయమనం, హుందాతనం ఇరువైపులా కనబడకపోవటం దురదృష్టకరం. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి