Breaking News

ఆకాశంలో విషాదం!

Published on Fri, 06/13/2025 - 00:50

గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా సంస్థ విమానం బోయింగ్‌–787–8 డ్రీమ్‌లైనర్‌ టేకాఫ్‌ అయిన కాసేపటికే గురువారం ప్రమాదానికి లోనై కూలిపోవటం ఎంతో విషాదకరం. మన విమానాలు ఎంతో సురక్షితమైనవనీ, ప్రమాదాలకు ఆస్కారం లేనివనీ పేరుంది. ఇప్పుడు కూలిపోయిన విమానం పదకొండేళ్లుగా వినియోగంలో ఉంది. 

ఈ తరహా విమానాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ఆలోచన కూడా ఉంది. ఇంతలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రయాణికుల్లో గుజరాత్‌ మాజీ ముఖ్య మంత్రి విజయ్‌ రూపానీ సహా 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్‌ పౌరులు, ఏడుగురు పోర్చుగల్‌ వాసులు, కెనడావాసి ఒకరు వున్నారని ఎయిరిండియా సంస్థ ప్రకటన చెబు తోంది. వీరిలో ఒక్కరు గాయాలతో బయటపడ్డారు. భవనంపై ఈ విమానం కూలడంతో అందులో కూడా మరణాలు సంభవించాయని, చాలామంది గాయపడ్డారని అంటున్నారు. 

వర్తమాన యుగంలో దేశాల మధ్య అనుసంధానం బాగా పెరిగింది. వ్యాపారం, వాణిజ్యం, చదువు, ఉపాధి, పర్యాటకం లాంటి ఎన్నెన్నో అవసరాల నిమిత్తం ఒకచోటనుంచి మరో చోటుకు ప్రయాణిస్తున్నవారి సంఖ్య పదేళ్ల క్రితంతో పోల్చినా ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు సంపన్న వర్గాల సొంతం అను కునే విమానయానం ఇవాళ మధ్యతరగతి పౌరులకు సైతం జీవితావసరంగా మారింది. 

ఎప్పటికప్పుడు అందుబాటులోకొస్తున్న సాంకేతికతలు విమానయానాన్ని సురక్షితం చేశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మానవ తప్పిదాలకు ఆస్కారం ఉంటుంది గనుక  విమాన గమనాన్నీ, దాని తీరుతెన్నులనూ నిర్దేశించగల మెకానికల్, హైడ్రో మెకానికల్‌ నియంత్రిత వ్యవస్థలు ప్రవేశించాయి. ఇందువల్ల పైలెట్‌ ఒక కమాండ్‌ ఇవ్వగానే దానికి సంబంధించిన అనుబంధ మార్పులన్నీ ఒకదాని వెంబడి మరోటి వేగంగా పూర్తవుతాయి. 

ఈ క్రమంలో ఎక్కడ లోపం కనిపెట్టినా సెన్సర్లు గుర్తిస్తాయి. ఆ వెనకే తక్షణం సరిచే యగల వ్యవస్థలకు సంకేతాలిస్తాయి. ఏకకాలంలో అనేక పనుల్ని క్షణాల్లో చేయగలిగే ఈ వ్యవస్థల కారణంగా పైలెట్ల పని గతంతో పోలిస్తే చాలా మేరకు తగ్గిందనే చెప్పాలి. అయితే పైలెట్‌ సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేకపోవటం ఇందులోని బలహీ నత. ఏ వృత్తిలోనైనా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినవెన్నో ఉంటాయి. అన్నీ యంత్రాలే చేయటం ఆ అనుభవాలకు పరిమితులు విధిస్తుంది. 

మరి ఇంత సాంకేతికాభివృద్ధి జరిగినా ప్రమాదం ఎలా సంభవించిందన్నదే ప్రశ్న. ఒక మాదిరి విశాలంగా, ఒకేసారి 290 మంది ప్రయాణించగల ఈ మోడల్‌ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. ఎక్కడా ఆగకుండా ఏకబిగిన వేలాది కిలోమీ టర్లు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. 

అయినా ఈ విషాదం ముంచుకొచ్చింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం చోటుచేసుకుని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పైలెట్‌ నుంచి తక్షణ సాయం అవసరమని సూచించే ‘మేడే కాల్‌’ కూడా అందింది. ఆ మరుక్షణమే విమానం ప్రమాదంలో చిక్కుకుంది. దూరప్రయాణం కనుక ఇంధనం అధికంగా ఉంది. దాని వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఆవాసాలుండటం ఒక సమస్య. 

అందువల్ల ఆహారం కోసం వచ్చే పక్షులు విమానాలకు ముప్పు తెస్తాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో 92 శాతం వరకూ పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చంటారు. మహా అయితే అత్యవ సర ల్యాండింగ్‌ తప్పకపోవచ్చు. కానీ ఆ మిగిలిన 8 శాతం మేర ముప్పు పొంచివున్నట్టే లెక్క. పక్షుల గుంపు విమాన మార్గంలో అడ్డు తగలటం, దానికుండే రెండు ఇంజన్లలోనూ అవి చిక్కు కోవటం వంటి కారణాలు ప్రమాదానికి దోహదపడ్డాయా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. 

అయితే ఈ డ్రీమ్‌లైనర్‌ రకం విమానాల్లో నిర్వహణా లోపాలున్నాయని చాన్నాళ్లుగా ఫిర్యాదు లందుతున్నాయి. వాటి పర్యవసానంగా విమానాలు కూలిపోవటం వంటివి చోటుచేసుకోలేదుగానీ అవి భారీ కుదుపులకు లోనై ప్రయాణికులు గాయపడిన ఉదంతాలున్నాయని ఏవియేషన్‌ సేఫ్టీ నెట్‌ వర్క్‌ (ఏఎస్‌ఎన్‌) గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు జనవరిలో అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ విమానం ప్రయాణంలో ఉండగా దానికి చిల్లుపడి చొచ్చుకొచ్చిన పెనుగాలి ధాటికి ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. 

అప్రమత్తమైన పైలెట్‌ చాకచక్యంగా కిందకు దించటంతో ముప్పు తప్పింది. విమానం ఫ్యూజలాజ్‌ (ప్రయాణికులు కూర్చునే బాడీ) నిర్మాణం సక్రమంగా లేదని, అందువల్ల ముప్పు ఏర్పడే అవకాశమున్నదని బోయింగ్‌లో పనిచేసిన ఒక ఇంజనీర్‌ నిరుడు వెల్లడించినప్పుడు సంస్థ కొట్టిపారేసింది. విస్తృతంగా పరీక్షలు జరిపాక వెంటనే సమస్యాత్మకం అయ్యేదేమీ లేదని ప్రకటించింది. అయితే ఈ కంపెనీ రూపొందించిన 737 రకం విమానాలు రెండు 2018, 2019 సంవత్సరాల్లో కుప్పకూలి 346 మంది మరణించారు. 

ఈ రెండు ఉదంతాల్లోనూ తన నేరసంబంధ బాధ్యత నుంచి తప్పించుకోవటానికి అమెరికా ప్రభుత్వంతో గత నెలలోనే ఒప్పందానికొచ్చింది. ప్రభుత్వ పర్యవేక్షణను తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు భారీయెత్తున జరిమానా చెల్లించింది. విమానాల తయారీలో నాణ్యతనూ, భద్రతనూ మరింత పెంచుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఈ దురదృష్టకర ఘటనపై జరిగే దర్యాప్తులో ఉత్పాదక సంబంధ లోపాలపై కూడా దృష్టి పెట్టాల్సివుంది. ఇదే సమయంలో విమానయాన సంస్థలన్నీ భద్రతపై మరింత శ్రద్ధపెట్టి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)