Breaking News

ఇరాన్‌పై కయ్యానికి సై

Published on Sat, 02/21/2026 - 03:48

గాజా ఇంకా తల్లడిల్లుతూనే ఉంది. ఉక్రెయిన్‌ వాసులు ఎప్పుడేమి ఉపద్రవం ముంచు కొస్తుందో తెలియక భయం భయంగా బతుకీడుస్తున్నారు. ఇవి సద్దుమణగకుండానే ఇరాన్‌పై సైనిక దురాక్రమణకు దిగి పశ్చిమాసియాలో మరో యుద్ధక్షేత్రాన్ని తెరవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తహతహలాడుతున్నారు. మరో పదిరోజుల్లో యుద్ధం తప్పదని బెదిరిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ను పశ్చిమాసియా దిశగా తరలిస్తున్నారు. 

ఇది 75 యుద్ధ విమానాలతో, అయిదువేలమంది బలగాలతో మధ్యశ్రేణి క్షిపణుల్ని ప్రయోగించటానికి అనువుగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే అరేబియా సముద్ర జలాల్లోని ఒమన్‌ తీరంలో మరో నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ ఇరాన్‌ వైపు క్షిపణులు గురిపెట్టిసిద్ధంగా ఉంది. అమెరికాను ప్రతిఘటించటానికి ఆర్నెల్ల నుంచే ఇరాన్‌ సన్నాహాలు చేసు కుంటోంది. ఈ యుద్ధం దీర్ఘకాలంగా సాగటానికి అంచెలంచెల వ్యూహాన్ని సిద్ధం చేసిఉంచింది. 

ప్రపంచం దీన్నంతటినీ మౌనంగా వీక్షిస్తూ ఉండగలదా? ఇది అమెరికా సొంత వ్యవ హారం కాదు. యుద్ధం వల్ల నష్టపడేది కేవలం ఇరాన్‌ ఒక్కటే కాదు. యుద్ధానికి అమెరికా చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇరాన్‌ దగ్గర అణ్వాయుధానికి తోడ్పడే శుద్ధి చేసిన యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నది అందులో ఒకటి. ఇది ప్రపంచ శాంతికి ముప్పు తెస్తుందని అమెరికా వాదన.  ఇజ్రాయెల్‌ దగ్గర అమెరికా మోహరించిన అణ్వాయుధాలున్నాయి. అది ఇరుగు పొరుగు దేశాలపై కోరుకున్నప్పు డల్లా దాడులు చేస్తోంది. 

గాజాను వల్లకాడు చేసింది చాలక, అక్కడి వార్తలు బయటి ప్రపంచానికి తెలియకుండా వందల సంఖ్యలో పాత్రికేయులను హతమార్చింది. అందుకే అక్కడేం జరుగుతున్నదో ప్రస్తుతం తెలియటం లేదు. ఇరాన్‌ వల్ల కనీసం గత పదేళ్లుగా పశ్చిమాసియాలోని ఏయే దేశాలకు ముప్పు వాటిల్లిందో, అదే కాలంలో ఇజ్రాయెల్‌ ఏమేం చేసిందో అమెరికా వెల్లడించాలి. ఇక మానవ హక్కుల ఉల్లంఘన సాకు అర్థరహిత మైంది. 

తాను అక్రమ వలసదారుల పేరిట నిత్యం మానవ హక్కులను ఉల్లంఘిస్తూ, వేరెవరో ఆ పని చేస్తున్నారనే నైతిక హక్కు ఎక్కడిది? తన చెప్పుచేతల్లోని సౌదీ, యూఏఈ, ఖతార్‌ వంటి దేశాల మాటేమిటి? అక్కడ ప్రజాస్వామిక వ్యవస్థలు ఉనికిలో ఉన్నాయా? ఆ సంగతలా ఉంచి ఆ సాకుతో జోక్యం చేసుకోవటానికి అమెరికాకున్న అధి కారం ఎక్కడిది? ఇరాన్‌ ప్రజలు యాభయ్యేళ్ల క్రితమే మహ్మద్‌ రెజాపెహ్లవీ వంటి నియంతను కూలదోసిన చరిత్ర గలవారు. ప్రస్తుత ఖమేనీ పైనా తిరగబడగల సత్తా ఉన్నవారు.

జెనీవాలో ఒకపక్క ఒప్పందం కోసం ఇరాన్‌తో చర్చలు సాగిస్తూ బలగాల మోహరింపు నీతిమాలినతనం. అలా చేస్తే పాదాక్రాంతమవుతుందని ట్రంప్‌ భ్రమపడు తున్నారు. నిత్యం యుద్ధాల్లో, ఆంక్షల్లో బతుకీడుస్తున్న ఇరాన్‌ కొత్తగా భయపడేదేమీఉండదు. గత ఏడాది 12 రోజుల యుద్ధంలో తేటతెల్లమైంది ఇదే. చివరకు అమెరికాయే కాల్పుల విరమణకు సిద్ధపడాల్సి వచ్చింది. యుద్ధమంటూ జరిగితే, అది దీర్ఘకాలం కొనసాగేలా ఇరాన్‌ చూస్తే ఇజ్రాయెల్‌ సహా అమెరికా మిత్రదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయి. 

హోర్ముజ్‌ జలసంధి మూతపడితే బ్యారెల్‌ చమురు ధర ఒక్కసారిగా 80 డాలర్ల నుంచి దాదాపు 200 డాలర్లకు చేరువై, ప్రపంచ దేశాలన్నీ అధిక దరలతో సతమతమవుతాయి. చమురు ఉత్పత్తులపై ఆధారపడే ప్లాస్టిక్, ఎరు వులు, ఫార్మా రంగాల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి. స్టాక్‌ మార్కెట్ల పతనం సరేసరి. 

ఇరాన్‌పై దాడులకు తన సైనిక స్థావరం వాడుకోవద్దని బ్రిటన్‌ చెప్పింది. గల్ఫ్‌ దేశాలు, వేరే దేశాలు సైతం ఆ మాటే చెప్పాలి. రష్యా, చైనాలు సైతం ఇరాన్‌కు అనుకూలంగా ఈ వివాదంలోకి దిగితే మున్ముందు ఇది ప్రపంచయుద్ధంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే అమెరికా ప్రతినిధుల సభ మౌనం వహించ కూడదు. దాని అనుమతి లేనిదే ట్రంప్‌ అడుగు ముందుకేయలేరు గనుక ఇది చాలా అవసరం. కాగల కార్యం ట్రంప్‌ నెరవేరుస్తారని కలగంటున్న డెమాక్రాట్లు మౌనం వీడకపోతే చరిత్ర క్షమించదు.  

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)